సుడిగాలి సుధీర్‌ ‘గోట్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Sudigali Sudheer GOAT Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

సుడిగాలి సుధీర్‌ ‘గోట్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Nov 12 2026 2:50 PM | Updated on Nov 12 2026 2:55 PM

Sudigali Sudheer GOAT Movie Review And Rating In Telugu

బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో స్టార్‌లా ఎదిగిన నటుడు సుడిగాలి సుధీర్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం గోట్‌(G.O.A.T).వేదవ్యాస్‌ దర్శకత్వం వహించాడు. దివ్యభారతి హీరోయిన్‌గా నటించింది. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్‌  సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ సమర్పణలో నేడు(నవంబర్‌  12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
1983లో భారత్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలిచిన సమయంలో గోదావరి జిల్లాలోని రుద్రవరం గ్రామంలో క్రికెట్‌ బెట్టింగ్‌ జోరందుకుంటుంది. దీనికి ఆ ఊరి పెద్ద కృష్ణంరాజు అడ్డుకట్ట వేస్తే..పదేళ్ల తర్వాత మొద్దు బాబ్జీ(నితిన్‌ ప్రసన్న) చైర్మన్‌గా ఎన్నికై.. బెట్టింగ్‌ని మరింత ప్రోత్సహిస్తాడు. జూదం వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోతుంటారు. కట్‌ చేస్తే.. విశాఖపట్నంకు చెందిన సార్‌ అలియాస్‌ గణ(సుడిగాలి సుధీర్‌) ఓ ఆవార. డబ్బు కోసం ఓ అమ్మాయిని కిడ్నాప్‌ చేయాలని ప్రయత్నిస్తాడు. అయితే అనుకోకుండా సుభాషిణి (దివ్యభారతి) అతడి చేతికి చిక్కుతుంది. సుభాషిణి పరిచయం తర్వాత సార్‌  జీవితంలో వచ్చిన మలుపులు ఏంటి? క్రికెట్‌ బెట్టింగ్‌కు అడ్డాగా మారిన రుద్రవరం గ్రామంతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? డబ్బు కోసం కిడ్నాప్‌ చేసిన అతడే చివరకు బెట్టింగ్‌ మాఫియాను ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది?  అతని ప్లాష్‌ బ్యాక్‌ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
జూదంతో ముడిపడిన ఓ పల్లెటూరి కథ ఇది. క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియాకి పల్లెటూరి నేపథ్యాన్ని జోడించి.. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు వేదవ్యాస్‌. యాక్షన్‌, కామెడీ, ప్రేమ, ఎమోషన్‌ అన్నింటినీ బ్యాలెన్స్‌  చేసే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగుంది కానీ కథ, కథనం ఇంకాస్త పదునుగా ఉంటే బాగుండేది. చాలావరకు ఊహకందేలా కథనం సాగుతుంది. ట్విస్టులను కూడా ముందే ఊహించొచ్చు.

(ఇదీ చదవండి: 'కొడతారేమో అని భయపడి ఈవెంట్‌కు వస్తున్నా': బుచ్చిబాబు)

అయితే రెండు,మూడు కామెడీ సీన్లు అయితే ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌ అంతా కిడ్నాప్‌ డ్రామా, హీరోయిన్‌తో పరిచయం..హీరో గ్యాంగ్‌  చేసే కామెడీతో ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. హీరోకి సంబంధించిన ఓ నిజం హీరోయిన్‌కి తెలియడంతో ఇంటర్వెల్‌ కార్డు పడుతుంది. ఇక ద్వితియార్థం మొత్తం బెట్టింగ్‌ మాఫియాతో హీరో పోరాటమే ఉంటుంది. యాక్షన్‌ సన్నివేశాలు, మాస్‌ ఎలిమెంట్స్‌, ఎమోషన్‌ను కలిపి కమర్షియల్‌గా ముగించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు. కీలకమైన సన్నివేశాలను కూడా చుట్టేసినట్లుగా అనిపిస్తుంది.  సెకండాఫ్‌ ని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.  సుధీర్‌ అభిమానులతో పాటు  గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్‌ కామెడీ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే.. 
సుడిగాలి సుధీర్‌ తనకు బాగా తెలిసిన కామెడీతో పాటు యాక్షన్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ మెప్పించే ప్రయత్నం చేశారు. గణ పాత్రకు ఆయన న్యాయం చేశాడు. సుభాషిణిగా దివ్యభారతి తన పాత్ర పరిధి మేర బాగానే చేసింది. నితిన్‌ ప్రసన్న విలనిజం బాగానే పడించాడు.  సర్వదమన్‌ బెనర్జీ, బ్రహ్మాజీ, 30 ఇయర్స్‌ పృథ్వీ, మొట్టై రాజేంద్రన్‌, చమ్మక్‌ చంద్ర తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. మణిశర్మ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. లియోన్‌ జేమ్స్‌ అందించిన పాటలు జెస్ట్‌ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement