ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ వచ్చి మా సినిమా(ఇట్లు అర్జున) గురించి మాట్లాడడం ఇప్పటికీ కలలాగే ఉంది. అంత మంచి సపోర్ట్ లభించడం చాలా ఆనందంగా ఉంది. మేము ఎంచుకున్న కాన్సెప్ట్, మా కంటెంట్ నచ్చడం వల్లే ఈ స్థాయిలో సపోర్ట్ వచ్చిందని భావిస్తున్నాను. ఒక కొత్త నటుడికి ఇంత పెద్ద సపోర్ట్ లభించడం నిజంగా సంతోషంగా ఉంది. అదే సమయంలో ఇది నా మీద మరింత బాధ్యతను పెంచింది’ అన్నారు యంగ్ హీరో అనీష్. అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవంబర్ 13న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో అనీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ ఇట్లు అర్జున కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చిన అంశం ఒక మూగవాడి ప్రేమకథ. తన భావాలను మాటల్లో వ్యక్తపరచలేని వ్యక్తి ప్రేమను ఎలా చూపిస్తాడనేది నాకు చాలా నచ్చింది. అలాగే కథ నడిచే విధానం, హీరో, హీరోయిన్ ప్రయాణం, యాక్షన్, ఎమోషన్ చాలా ఆర్గానిక్‌గా అనిపించాయి. ఇందులో చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయి. అలాంటి సందర్భాలను ఒక మూగవాడు ఎలా ఎదుర్కొంటాడు, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
→ ఈ సినిమా కోసం దాదాపు ఆరు నెలల పాటు వర్క్‌షాప్ చేశాం. బాడీ లాంగ్వేజ్, రియాక్షన్స్, ఎక్స్‌ప్రెషన్స్ .. విషయాలపై డైరెక్టర్ గారికి చాలా క్లారిటీ ఉంది. కొంత సైన్ లాంగ్వేజ్ కూడా ఉపయోగించాం. అయితే అది అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ప్రతి సీన్‌ను ముందుగానే రిహార్సల్స్ చేసేవాళ్లం. దాంతో పాత్రలోకి వెళ్లడానికి చాలా ఉపయోగపడింది.
(ఇదీ చదవండి: నన్ను తీసుకోలేదు.. అందుకే ప్లాఫ్ అయింది: ‘ప్యారడైజ్’పై బాబుమోహన్ షాకింగ్ కామెంట్స్)
→ ఇందులో యాక్షన్‌ను చాలా కొత్తగా డీల్ చేశాం. ఇది ఒక అండర్‌డాగ్ క్యారెక్టర్‌కు తగ్గట్టుగానే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. మాస్ కమర్షియల్ సినిమాల్లో ఉండే యాక్షన్‌లా కాకుండా ఆ పాత్ర స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. యాక్షన్ లో సహజంగా వచ్చే సౌండ్స్ ను మ్యాచ్ చేయడానికి డబ్బింగ్ కూడా చెప్పాను. మాటలు లేకుండా కేవలం బాడీ కదలికలు, 'హమ్ ..హ' లాంటి ఎక్స్ ప్రెస్ ప్రెషన్ కు డబ్బింగ్ చెప్పడం కూడా చాలా కొత్త ఎక్స్ పీరియన్స్. తనది చాలా జెన్యూన్ క్యారెక్టర్. ఆ ఎమోషన్ ఆడియన్స్ ఫీల్ అవుతారు.
→ ఈ సినిమాకు మ్యూజిక్ మెయిన్ హీరో. ముఖ్యంగా ఇది మూగవాడి కథ కావడంతో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. తమన్ ఈ జర్నీలో నాకు ఒక బ్రదర్‌లా అయిపోయారు. ఆయన సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.
→ బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ గారు ఇలా మంచి నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ప్రతి పాత్రకు కథలో ఒక ప్రాధాన్యత ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ప్రతి పాత్రను ఎంజాయ్ చేస్తారు.
→ నేను అందరు హీరోల సినిమాలు చూస్తూ పెరిగాను. రామ్ చరణ్ , తారక్, అల్లు అర్జున్ సహా చాలామంది హీరోలు నాకు ఇన్‌స్పిరేషన్. తారక్ గారికి ఈ సినిమా చాలా నచ్చింది. చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది.


