‘‘నా తొలి చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ మంచి విజయం సాధించింది. కానీ ఆ విజయం నాలో ఒత్తిడి పెంచింది. ఆ సినిమా విజయం తర్వాత నేను చాలా కథలు విన్నాను. అయితే సరైన కథలనే ఎంచుకుంటున్నానా? నా జడ్జ్‌మెంట్ కరెక్టేనా? అనే ఆలోచనలు నాలో ఒత్తిడి పెంచాయి. అయితే నాకు కొత్త కథలు చెబుతూనే, ఎంటర్‌టైనింగ్ సినిమాలు చేయాలని ఉంది’’ అని మౌళి తనూజ్ ప్రశాంత్ అన్నారు.
(చదవండి: తెలుగు 'బిగ్‌బాస్'లో నిశ్చితార్థం చేసుకున్న ప్రేమజంట)
మౌళి తనూజ్ ప్రశాంత్, సుష్మితా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా ‘డీఎన్‌కే’. శ్రీను కంబాల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మౌళి తనూజ్ మాట్లాడుతూ– ‘‘ఈజీ మనీకి అలవాటు పడ్డ ఓ కుర్రాడు గ్యాంబ్లింగ్ చేస్తే డబ్బులు వస్తాయని ఆ మార్గాన్ని ఎంచుకుంటాడు. కానీ అతను తీసుకునే నిర్ణయాల వల్ల అప్పుల్లో కూరుకుపోతాడు. ఆ అప్పుల నుంచి బయటపడటానికి ఒక దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత ఆ కుర్రాడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది? ఆ కష్టాల నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నదే ఈ సినిమా కథ.
కథలో క్రైమ్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ మంచి ఫన్ కూడా ఉంది. సెకండాఫ్‌లో ఒక సర్‌ప్రైజింగ్ సాంగ్ కూడా ఉంటుంది. సింజిత్ మంచి మ్యూ జిక్ ఇచ్చాడు. ఇక సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పడంతో మా సినిమా టైటిల్‌ను ‘డీఎన్‌కే’గా మార్చాం. నాకు దర్శకత్వంపై ఆసక్తి ఉంది. కానీ ఇది పెద్ద బాధ్యత కాబట్టి కాస్త సమయం పడుతుంది’’ అని అన్నారు.


