‘టాప్‌ యంగ్ సైంటిస్ట్’: భారత బాలికకు రూ. 21 లక్షల బహుమానం | raji doshi the 13 year old top young scientist | Sakshi
Sakshi News home page

‘టాప్‌ యంగ్ సైంటిస్ట్’: భారత బాలికకు రూ. 21 లక్షల బహుమానం

Oct 21 2026 9:17 AM | Updated on Oct 21 2026 9:17 AM

raji doshi the 13 year old top young scientist

కనెక్టికట్‌: అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన 13 ఏళ్ల భారత సంతతి బాలిక రాజీ దోషి ప్రతిష్టాత్మక ‘2026 3ఎం యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్’ విజేతగా నిలిచింది. స్టాన్‌ఫోర్డ్ ఆన్‌లైన్ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆమె, అమెరికా వ్యాప్తంగా ఎంపికైన ఫైనలిస్టులను వెనక్కి నెట్టి ‘అమెరికాస్ టాప్ యంగ్ సైంటిస్ట్’ కిరీటంతో పాటు 25,000 డాలర్ల (సుమారు రూ. 21 లక్షలకు పైగా) నగదు బహుమతిని సొంతం చేసుకున్నారు.

తీరప్రాంతాల్లో సముద్రపు గవ్వలను సేకరించే అలవాటున్న రాజీ, కర్బన ఉద్గారాల వల్ల సముద్రాలు ఆమ్లీకరణకు గురై జీవులు, శంఖు-గవ్వలు నాశనమవడం గమనించారు. ఈ విపత్తుకు అడ్డుకట్ట వేసేందుకు ఆమె ‘ఆల్కాకోర్’ పేరిట సరికొత్త పరిశోధనను ప్రారంభించారు. తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు 3ఎం సంస్థ అందించిన శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో  సమర్థవంతమైన ప్రోటోటైప్‌ను సిద్ధం చేశారు.

సముద్రపు నాచు (Macroalgae) సాగుకు సహజ కాల్షియం కార్బోనేట్ రూపమైన అరగోనైట్ (Aragonite) ఖనిజాన్ని జోడించడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. ఈ విధానం ద్వారా సముద్రపు నీటిలో ఆల్కలీనిటీ పెరిగి, కరిగి ఉన్న హానికర కార్బన్ డై ఆక్సైడ్ భారీగా తగ్గుతుందని రసాయన విశ్లేషణల ద్వారా నిరూపించారు. అంతేకాకుండా, తీరప్రాంత సమాజాలు సులభంగా అమలు చేసేందుకు 'మైకేలిస్-మెంటెన్' కంప్యూటేషనల్ మోడల్ ఆధారంగా అరగోనైట్ సరైన మోతాదును కూడా ఖరారు చేశారు.

మిన్నెసోటాలోని 3ఎం ప్రధాన కార్యాలయంలో జరిగిన తుది పోటీలలో రాజీ తన సంభాషణా చాతుర్యంతో న్యాయనిర్ణేతలను మెప్పించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. కేవలం సైద్ధాంతిక పరిశోధనలకే పరిమితం కాకుండా, ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న గ్లోబల్ వార్మింగ్ ముప్పుకు పర్యావరణ అనుకూల పరిష్కారాన్ని చూపిన ఈ చిచ్చరపిడుగు ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టులో సీఎం నిర్బంధం.. 50 వేల జరిమానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement