ఎయిర్‌పోర్టులో సీఎం నిర్బంధం.. 50 వేల జరిమానా | Punjab cm Bhagwant Mann Detained for 3 hours | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో సీఎం నిర్బంధం.. 50 వేల జరిమానా

Oct 21 2026 8:38 AM | Updated on Oct 21 2026 8:38 AM

Punjab cm Bhagwant Mann Detained for 3 hours

న్యూఢిల్లీ: పారిస్‌లో జరిగిన ఫుడ్ ట్రేడ్ ఫెయిర్‌లో పాల్గొని తిరిగి వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను అక్టోబర్ 19 అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో మూడు గంటల పాటు నిర్బంధించి, రూ. 50,000 జరిమానా విధించారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సీఎం మాన్‌ను అవమానించేందుకు, పంజాబ్ గౌరవాన్ని దెబ్బతీసేందుకు ఈ చర్యకు పాల్పడిందని ఆప్ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్ బల్తేజ్ పన్ను పేర్కొన్నారు. సీఎం లగేజీ ఇంకా రాలేదని, తనిఖీలు జరుగుతున్నాయనే నెపంతో ఆయనను ఎయిర్‌పోర్టులోనే ఉంచారని పార్టీ తెలిపింది.

మూడు గంటల తర్వాత సీఎం మాన్ తన లగేజీని వాహనంలో పెట్టుకుని బయలుదేరుతుండగా, విమానాశ్రయ అధికారులు ఆయన వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి తమపై ‘పైనుంచి తీవ్ర ఒత్తిడి ఉంది’ అని చెబుతూ అసంబద్ధంగా రూ. 50,000 చలానా జారీ చేశారని పన్ను ఆరోపించారు. ఈ జరిమానా ఎందుకు విధించారనే దానిపై స్పష్టమైన కారణం చెప్పలేదని, ఇదంతా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే జరిగిందని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు మాన్ ఫ్రాన్స్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించగా, పంజాబ్-హర్యానా హైకోర్టు జోక్యం చేసుకుని అనుమతి ఇచ్చినా.. ప్రోటోకాల్ ప్రకారం ప్యారిస్‌లోని కాన్సుల్ జనరల్ కూడా సీఎంను కలవలేదని ‘ఆప్’ ఆరోపించింది.

మరోవైపు శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) ప్రధాన కార్యదర్శి బిక్రమ్ సింగ్ మజీథియా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, అనుమతించిన పరిమితి కంటే ఎక్కువ నగదు లేదా లగేజీని తీసుకువచ్చినందుకే మాన్ దంపతులను అధికారులు ప్రశ్నించారని పేర్కొన్నారు. అయితే దీనికి వారు సరైన సమాధానం ఇవ్వలేకపోయారని, కేవలం ముఖ్యమంత్రి హోదాను పరిగణనలోకి తీసుకునే ఆయనను విడిచిపెట్టారని ఆరోపించారు. 

ఇదీ చదవండి: రావణునితో పాటు ‘బొద్దింక’ దహనం.. దీప్కే కృతజ్ఞతలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement