కీలక దశకు పరిషత్‌ పోరు | - | Sakshi
Sakshi News home page

కీలక దశకు పరిషత్‌ పోరు

Nov 4 2026 3:14 AM | Updated on Nov 4 2026 3:14 AM

అనంతపురం న్యూ టౌన్‌: పరిషత్‌ పోరులో ప్రచార పర్వం మంగళవారం ముగిసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఐదో తేదీన పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు భద్రతాపరమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా పరిషత్‌ సీఈఓ విజయలక్ష్మి మీడియాకు చెప్పారు. జిల్లాలోని 28 జెడ్పీటీసీ, 353 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 31 జెడ్పీటీసీ స్థానాలకు గాను గుంతకల్లు, గుత్తి, పామిడి స్థానాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. తక్కిన 28 స్థానాలకు వివిధ పార్టీలకు చెందిన 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 9 చోట్ల ముఖాముఖి పోటీ కొనసాగుతోంది. మిగిలిన 19 స్థానాల్లో బహుముఖ పోటీ ఉంది. ఐదు స్థానాల్లో ఐదేసి అభ్యర్థులు, ఎనిమిది స్థానాల్లో నలుగురు, మరో ఆరు స్థానాల్లో ముగ్గురేసి అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అదేవిధంగా మొత్తం 450 ఎంపీటీసీ స్థానాలకు గాను ఇదివరకే 97 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 353 ఎంపీటీసీ స్థానాలకు వివిధ పార్టీల తరఫున 801 మంది ఎన్నికల బరిలో మిగిలారు. వీరిలో వైఎస్సార్‌సీపీకి చెందిన 338 మంది అభ్యర్థులు పోటీలో కొనసాగుతున్నారు.

కూటమిలో కొనసాగుతున్న వెన్నుపోట్లు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి (టీడీపీ, బీజేపీ, జనసేన) పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పొత్తు ధర్మానికి టీడీపీ అభ్యర్థులు వెన్నుపోట్లు పొడుతూ బీజేపీ, జనసేన అభ్యర్థులపై పోటీకి దిగారు. పొత్తు ధర్మానికి తిలోదకాలు ఇచ్చి పోటీకి దిగే టీడీపీ అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్న చంద్రబాబు ఆదేశాలు జిల్లాలో నీటిమూటలయ్యాయి. శింగనమల నియోజకవర్గంలో జనసేన తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులకు టీడీపీ నుంచి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య పొత్తులో భాగంగా నార్పల, గార్లదిన్నె జెడ్పీటీసీ స్థానాలకు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే సమస్య పరిష్కారం కాకుండానే తన బీఫాం సమర్పించిన అంకె ఈశ్వరయ్యను ఎన్నికల అధికారులు స్వతంత్ర అభ్యర్థిగా గుర్తించారు. అక్కడ టీడీపీ తరఫున గంజే నాగరాజు పోటీలో ఉన్నారు. శింగనమల జెడ్పీటీసీ స్థానానికి కూటమి తరఫున జనసేన పార్టీ ఎస్సీ అభ్యర్థిని బరిలో దింపింది. అయితే అక్కడ కూడా టీడీపీ నుంచి మరో అభ్యర్థి పోటీకి దిగారు. కూటమిలో మరో భాగస్వామ్య పార్టీ బీజేపీకి పొత్తులో భాగంగా కొన్ని స్థానాలను కేటాయించారు. అయితే బీజేపీ బరిలోకి దిగిన స్థానాల నుంచి కొన్నిచోట్ల టీడీపీ అభ్యర్థులు కూడా రంగంలోకి దిగి వెన్నుపోటు పొడిచారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బ్రహ్మరథం

పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు వరంగా మారింది. ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది.

పరిషత్‌ ఎన్నికలు

సజావుగా సాగేనా..?

అనంతపురం న్యూ టౌన్‌ : కూటమి నేతల అరాచకాలు.. అధికారులు, పోలీసుల ఏకపక్ష వైఖరి నడుమ జిల్లా పరిషత్‌ – మండల పరిషత్‌ ఎన్నికలు సజావుగా సాగేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాని అధికారులు పైకి చెప్తున్నా.. చాలాచోట్ల అందుకు విరుద్ధంగా జరిగాయి. ఈ నేపథ్యంలో గురువారం జిల్లాలోని 28 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 1,114 చోట్ల అల్లర్లు జరిగే పోలింగ్‌ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. ఇందులో సమస్యాత్మకమైనవి 573 కాగా, 541 అత్యంత సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు 11,922 మంది సిబ్బందిని, బందోబస్తు విధులకు 1,946 మంది పోలీసులను కేటాయించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా 732 పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, నిరంతర పర్యవేక్షణకు మరో 731 పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌ కాస్టింగ్‌కు చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌

పలుచోట్ల బహుముఖి పోటీ

కూటమి అభ్యర్థులకు తప్పని వెన్నుపోట్లు

ప్రచారంలో దూసుకెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

ప్రజా మద్దతుతో పరిషత్‌ ఎన్నికల్లో ఫ్యాన్‌ హోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement