అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల నాలుగో తేదీన 4.6 మి.మీ, ఐదున 8.1, ఆరో తేదీన 3.9 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొన్నారు. ఈ నెల 8 వరకు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి పంటల్లో పురుగు మందుల పిచికారీ చేపట్టాలన్నారు. ఈ నెల 15 వరకు నల్లరేగళ్లలో రబీ పంటగా పప్పుశనగ సాగుకు అనుకూలమని తెలిపారు.
వైఎస్సార్‌సీపీకి
33.88 శాతం ఓట్లు
అనంతపురం: అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గణనీయమైన ఓటింగ్ శాతాన్ని సాధించింది. మొత్తం 62కు గాను 60 డివిజన్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీచేశారు. వీరికి 33.88 శాతం ఓట్లు లభించాయి. ఇది కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు దర్పణం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కూటమిపై
పెల్లుబుకిన అసంతృప్తి
అనంతపురం: మునిసిపల్ ఎన్నికల ఫలితాల తీరును చూస్తే రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైందనే విషయం స్పష్టమవుతోంది. ’సూపర్ సిక్స్’ సహా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను నిలిపివేయడం, పేదల పొట్టకొట్టడం వల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర అశాంతి నెలకొంది. కక్షసాధింపు రాజకీయాలు, ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై వేధింపులు, దౌర్జన్యాలతో సాధారణ ప్రజలు విసిగిపోయారు.
ఉద్యోగ వర్గాల తిరుగుబాటు
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టడం, డీఏ బకాయిలు చెల్లించడంలో ఆలస్యం చేయడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశను నింపింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల వేధింపులతో విసిగిపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు. ఎమ్మెల్యేల బెదిరింపులు, పోలీసుల ఒత్తిళ్లు, రిగ్గింగ్ అక్రమాలను సైతం బేఖాతరు చేస్తూ.. అనంతపురం కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీని 21 డివిజన్ స్థానాల్లో గెలిపించడంలో సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగుల పాత్ర కూడా స్పష్టంగా కన్పిస్తోంది. అధికార బలంతో ఏమైనా చేయవచ్చనే ధీమాలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ఫలితాలు బలమైన చెంపపెట్టులాంటివని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ అరాచకాలను, పాలనా వైఫల్యాలను ఎండగట్టడానికి ఈ విజయం వైఎస్సార్‌సీపీకి కొత్త ఉత్సాహాన్ని, తిరుగులేని ప్రజాబలాన్ని అందించిందని అంటున్నారు.
‘రిగ్గింగ్’ కూటమికి గుణపాఠం
● 30వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ జయకేతనం
అనంతపురం: అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కూటమి నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడిన 30వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం సంచలనంగా మారింది. ఇక్కడ ఆదివారం పోలింగ్ సందర్భంగా 30/3 బూత్‌లో బీజేపీ అభ్యర్థి అశోక్ రెడ్డి మనుషులు రిగ్గింగ్ చేశారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రిగ్గింగ్ జరిగినట్టు జిల్లా ఎన్నికల అధికారి నివేదిక పంపడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ బూత్‌లో రీపోలింగ్‌కు ఆదేశించింది. మరుసటి రోజు రీపోలింగ్ నిర్వహించారు. దీంతో ఈ డివిజన్ ఎన్నికల ఫలితంపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెన్నం శివరామిరెడ్డి 101 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి.. ఎమ్మెల్యే దగ్గుపాటి, మంత్రి సత్యకుమార్ వర్గీయుల అహంకారంపై దెబ్బకొట్టారు.


