అనైతికం.. అరాచకం | - | Sakshi
Sakshi News home page

అనైతికం.. అరాచకం

Nov 4 2026 3:14 AM | Updated on Nov 4 2026 3:14 AM

హిందూపురం(చిలమత్తూరు): పురం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ఏకపక్షంగా జరిగింది. కాదు కాదు ఎమ్మెల్యే పీఏలు శ్రీనివాసరావు, బాలాజీల కనుసన్నల్లో జరిపారు. అధికార యంత్రాంగాన్ని, పోలీసులను తమ గుప్పిట్లో పెట్టుకొని దౌర్జన్యంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లను బెదిరించి అనైతికంగా గెలుపొందారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మంగళవారం ఉదయమే కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన పీఏలు ఉన్నతాధికారుల మాదిరిగా వ్యవహరించడం అందరినీ విస్తుపోయేలా చేసింది. విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్న ఓ సీఐను కౌంటింగ్‌ విధుల నుంచి పీఏలే బయటకు పంపించే స్థాయిలో పెత్తనం చెలాయించడం గమనార్హం. మీడియాను సైతం కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లనీకుండా అడ్డుకున్నారు. ఉదయం మీడియా గ్యాలరీలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు స్క్రీన్‌పై చూపించిన అధికారులు, మధ్యాహ్నం 12:30 గంటలైనా ఒక రౌండ్‌ రిజల్ట్‌ కూడా ప్రకటించలేదు. కౌంటింగ్‌ కేంద్రంలో ఫలితాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు రావడంతో మీడియా ప్రతినిధులు కౌంటింగ్‌ కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. ఆర్‌ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తొలి రెండు రౌండ్లు స్క్రీన్‌పై చూపించారు. దీన్ని బట్టి లోపల కౌంటింగ్‌ ఏకపక్షంగా జరిగిందనేందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. అనంతరం మీడియాను లోపలికి అనుమతించారు. అయితే తక్కువ సమయం ఉండేలా పోలీసులు మీడియాపై ఆంక్షలు పెట్టారు.

ఎమ్మెల్యే పీఏల కనుసన్నల్లో

‘పురం’ కౌంటింగ్‌ ప్రక్రియ

ఫలితాల ప్రకటనలో జాప్యంపై

మీడియా ప్రతినిధుల ఆగ్రహం

41వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి

డిక్లరేషన్‌ ఫారం చించివేత

మూడు సార్లు రీ కౌంటింగ్‌ చేసినా ఫలితం ప్రకటించకపోవడంతో

12వ వార్డు అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

డిక్లరేషన్‌ ఫారం చించివేత

41వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్‌ కుమార్‌ 18 ఓట్లతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. అధికారులు డిక్లరేషన్‌ ఫారం కూడా అందించారు. అదేవార్డుకు చెందిన టీడీపీ నేత చంద్రమోహన్‌ యాదవ్‌ డిక్లరేషన్‌ ఫారాన్ని చించివేశారు. డిక్లరేషన్‌ అందించిన తర్వాత కూడా రీకౌంటింగ్‌కు అనుమతించడం అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా నిలిచింది. ‘సాక్షి’ విలేకరులు అక్కడకు చేరుకోగా అధికారులు చివరకు 41 వార్డుకు సంబంధించి డిక్లరేషన్‌ ఫారం అందించారు. 12వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాబా గెలుపొందారు. అయినప్పటికీ మూడు సార్లు రీకౌంటింగ్‌ చేశారు. ఈ వేధింపులను భరించలేక బాబా కౌంటింగ్‌ కేంద్రం తొలి అంతస్తు నుంచి దూకేందుకు ప్రయ త్నించాడు. అప్రమత్తమైన పార్టీ నేతలు, పోలీసులు ఆత్మహత్యా యత్నాన్ని నిలువరించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కౌంటింగ్‌ కేంద్రం వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు.వైఎస్సార్‌సీపీ సమన్వ యకర్త టీఎన్‌ దీపిక అక్కడికి చేరుకొని కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డు చూపితే లోపలికి అనుమతిస్తామని చెప్పడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాసేపటికే బాబా గెలుపును అధికారులు ధ్రువీకరించడంతో వివాదం సద్దుమణిగింది. 29 వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గంగిరెడ్డి 40 ఓట్లతో గెలుపొందారు. అయితే మెప్మాలో పని చేసే తిరుమలయ్య అనే వ్యక్తి బ్యాలెట్‌లను తారుమారు చేసి టీడీపీ అభ్యర్థి గెలిచేలా చేసి తీవ్ర అన్యాయం చేశారని బాధిత అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ నాయకులకు అడుగడుగునా వేధింపులు, భయభ్రాంతులకు గురి చేశారు. పురం ఓట్ల లెక్కింపు ప్రక్రియలోనూ అధికార పార్టీ ముఖ్యప్రతినిధి పీఏలు దగ్గరుండి అరాచకాలకు తెరలేపడంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement