ఆవేదన వినండి...మానవత్వంతో ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

ఆవేదన వినండి...మానవత్వంతో ఆదుకోండి

Nov 4 2026 3:14 AM | Updated on Nov 4 2026 3:14 AM

ఆరు దశాబ్దాల్లో ఇలాంటి క రువు చూడలేదు

● పెట్టుబడులు చేతికందక అప్పులపాలయ్యాం

● తాగేందుకు నీరు, జీవాలకు మేత కరువైంది

● కేంద్ర బృందం ఎదుట రైతుల గోడు

బత్తలపల్లి/ముదిగుబ్బ: ‘తీవ్ర వర్షాభావంతో ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయాయి. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు చేతికి అందక అప్పులపాలయ్యాం. తాగడానికి నీరు, మూగజీవాలకు మేత లేక అల్లాడిపోతున్నాం. ఆరు దశాబ్దాల కాలంలో ఇలాంటి కరవు ఎన్నడూ చూడలేదు.. మా కష్టాలు కళ్లారా చూడండి...మానవత్వంతో ఆలోచించి ఆదుకోండి’’అంటూ కేంద్ర కరువు అంచనా బృందం ఎదుట రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర బృందం మంగళవారం బత్తలపల్లి , ముదిగుబ్బ, కదిరి మండలాల్లో పర్యటించింది. ముందుగా బత్తలపల్లి, గుమ్మల్లకుంట, దంపెట్ల, రామాంజులపల్లి గ్రామాలలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ చిన్మయ్‌ గోట్మారే ఆధ్వర్యంలో 10 మంది అధికారులు పర్యటించి రైతులతో వివరాలు సేకరించారు. వీరికి కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, మండల అధికారులు స్వాగతం పలికారు.

ఎండిన పంటల పరిశీలన : కేంద్ర బృందం సభ్యులు తొలుత బత్తలపల్లి వద్ద అప్పరాచెరువు గ్రామానికి చెందిన అక్కిం నాగమ్మ సాగు చేసిన ఆముదం, వేరుశనగ, కంది పొలాలను పరిశీలించారు. అదేవిధంగా గుమ్మల్లకుంట వద్ద వరిమడుగు నాగిరెడ్డి తోటలో ఎండుతున్న చీనీ చెట్లును పరిశీలించారు. దంపెట్ల వద్ద నరసింహులు సాగు చేసిన ఉలవ పంటను పరిశీలించి రైతులతో వివరాలు సేకరించారు. రామాంజులపల్లి వద్ద నీరు లేక ఎండిపోయిన చెరువును పరిశీలించారు.

చెరువులకు నీరిచ్చి ఆదుకోండి

ధర్మవరం చెరువుతో పాటు ఇతర జలాశయాల నుంచి బత్తలపల్లి మండలంలోని చెరువులకు, చిత్రావతి నదికి నీరు విడుదల చేయించి రైతాంగాన్ని, మూగజీవాలను ఆదుకోవాలని పలువురు రైతులు కేంద్ర బృందం సభ్యులను కోరారు. దంపెట్ల సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు రైతులు, గొర్రెల కాపర్లు, ఉపాధి కూలీలు నరసింహులు, వెంకటనాయుడు, చంద్రశేఖర్‌నాయుడు, వెంకటరమణ, దరూరి రామకృష్ణ, నాగప్ప, నారాయణస్వామి, రాఘవంపల్లి రామకృష్ణ మాట్లాడారు. లోటు వర్షపాతం కారణంగా చెరువులు, కుంటలలో నీరు లేక రైతులు, మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారికి వివరించారు. హంద్రీ నీవా, చిత్రావతి రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల చేయాలని కోరారు. అనంతరం కేంద్రబృందం సభ్యులు మాట్లాడుతూ... ఉద్యాన తోటలు, వ్యవసాయ పంటలు, పశుగ్రాసం కొరత సంబంధించిన విషయాలు క్షేత్రస్థాయిలో పరిశీలించామని, నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసి రైతులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మంజీర్‌ జిలాని సమూన్‌, మహాలనోబిస్‌ నేషనల్‌ క్రాప్‌ ఫోర్‌కాస్ట్‌ సెంటర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రభాకాంతి, గ్రామీణాభివృద్ధి శాఖ అండర్‌ సెక్రటరీ వినోద్‌సామంత్‌, కేంద్ర ఆర్థిక వ్యయశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పంకజ్‌ పహాడియా, మానిటరింగ్‌ అండ్‌ అప్రైజల్‌ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ సతీష్‌ సీమకుర్తి, ఆయిల్‌ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ పొన్నుస్వామి, నీతి అయోగ్‌ సీనియర్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌ అనురాధ బటానా, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ప్రతినిధి ధీరేంద్రకుమార్‌, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అండర్‌ సెక్రటరీ ప్రదీప్‌కుమార్‌, కేంద్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ అధికారి సాక్షి భదౌరియాతో పాటు జిల్లా, డివిజన్‌, మండల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.

ముదిగుబ్బకు చెందిన నారాయణస్వామి సాగు చేసిన కంది, ఉలవ పంటలను పరిశీలించారు. కదిరి మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement