ఉద్యోగులపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులపై చర్యలు తీసుకోండి

Nov 4 2026 3:14 AM | Updated on Nov 4 2026 3:14 AM

ఉరవకొండ: రేణుమాకుపల్లి గ్రామంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రామాంజనేయులు తరఫున ప్రచారంలో పాల్గొన్న రేణుమాకుపల్లి గ్రామానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వన్నూర్‌స్వామి, విద్యుత్‌ శాఖలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఓబుళప్పపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆర్‌ఓ సాలురెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ రూరల్‌ కన్వీనర్‌ ఎర్రిస్వామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తులూరు అశోక్‌, కౌడిగిగోవిందు, ఆమిద్యాల అనిల్‌ మాట్లాడుతూ ఫీల్డ్‌ అసిస్టెంట్‌తో పాటు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు రేణుమాకుపల్లిలో టీడీపీ కండువాలు వేసుకొని, కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారన్నారు. దీనిపై పత్రికల్లో ప్రచురితమైన క్లిప్పింగ్‌లను కూడా ఆర్‌ఓకు చూపించి, ఫిర్యాదు చేశారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల స్వీకారం

అనంతపురం న్యూ టౌన్‌: జిల్లాలోని పరిషత్‌ ఎన్నికల్లో పాల్గొననున్న సిబ్బంది నుంచి 8,304 పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తులు అందినట్లు ఆర్‌ఓ విజయలక్ష్మి తెలిపారు. ఇందులో జిల్లా పరిషత్‌కు సంబంధించి 4,345, ఎంపీటీసీలకు సంబంధించి 3,969 పోస్టు బ్యాలెట్లను జారీ చేయగా.. అవన్నీ మంగళవారం సాయంత్రం తమకు అందినట్లు ఆమె వివరించారు. ఇందులో అనంతపురం రూరల్‌ పరిధిలో 1014 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నట్లు తెలిపారు. ఉరవకొండ పరిధిలో 720 మంది, శెట్టూరు, రాప్తాడు మండలాల పరిధిలో 454 చొప్పున, కంబదూరులో 408 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకున్నట్లు ఆర్‌ఓ తెలిపారు.

ప్రజాసేవకు పట్టం

గుంతకల్లుటౌన్‌: పట్టణంలోని 39వ వార్డులో ఓటర్లు ప్రజాసేవకు పట్టం కట్టారు. అందులోనూ నాలుగుసార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన దిగ్గజ నాయకుడు రామాంజనేయులుపై విజయం సాధించడంపై ప్రజలు ప్రశంసిస్తున్నారు. పట్టణానికి చెందిన బి.పవన్‌కుమార్‌.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వార్డు వలంటీర్‌గా పనిచేసి, ప్రజల మన్ననలు పొందాడు. వైఎస్సార్‌సీపీ వలంటీర్‌ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేస్తున్న పవన్‌కుమార్‌.. ప్రస్తుతం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 39వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థిగా పోటీ చేశాడు. మంగళవారం నిర్వహించిన కౌంటింగ్‌లో టీడీపీ సీనియర్‌ నేత రామాంజనేయులు అలియాస్‌ అంజిపై 162 ఓట్ల మెజార్టీతో గెలుపొంది శెభాష్‌ అనిపించుకున్నాడు.

బొలెరో వాహనానికి నిప్పు

యల్లనూరు: గడ్డంవారిపల్లి వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు రామకృష్ణారెడ్డి బొలెరో వాహనానికి గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. వాహనం మొత్తం పెట్రోల్‌ చల్లి నిప్పు పెట్టారు. అయితే బ్యానెట్‌ పెయింట్‌, బంపర్‌ కాలిపోయింది. బాధితులు ఎస్‌ఐ రామాంజనేయరెడ్డికి ఫిర్యాదు చేశారు.

ముగిసిన చెకుముకి సంబరాలు

భీమవరం: స్థానిక అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు మంగళవారం ముగిశాయి. జేవీవీ వ్యవస్థాపక అధ్యక్షుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం, డీఈఓ అనిల్‌కుమార్‌ హాజరై విజేతలకు ప్రశంసా పత్రాలు, మెమొంటోలు, సైన్స్‌ కిట్లు అందజేశారు.

ప్రభుత్వ పాఠశాలల విభాగం: స్పేస్‌ సెంట్రల్‌ స్కూల్‌ (తిరుపతి జిల్లా), పీఎంశ్రీ మోడల్‌ స్కూల్‌ ( విజయనగరం), మారేడుమిల్లి జెడ్పీ హైస్కూల్‌ (పోలవరం జిల్లా) విద్యార్థులు మొదటి మూడుస్థానాల్లో నిలిచారు. గుడ్‌ షెఫర్డ్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ (నంద్యాల), అమరరాజా విద్యాలయ (తిరుపతి), రాధ స్కూల్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ (అనంతపురం జిల్లా) విద్యార్థులు మొదటి మూడుస్థానాల్లో నిలిచారు.

అంగన్‌వాడీ ఆయా ఆత్మహత్య

ఉరవకొండ:స్థానిక హమాలీ కాలనీలో నివాసం ఉంటున్న అంగన్‌వాడీ ఆయా అమ్మాజీ (39) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన మేరకు..ఇందిరానగర్‌లో 19వ అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న అమ్మాజీకి రూ.14లక్షల వరకు అప్పు ఉంది. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అమ్మాజీకి భర్త షెక్షావలి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement