హైదరాబాద్: దేశ డిజిటల్ కనెక్టివిటీ రంగంలో కీలక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో తన ప్రయాణంలో పదేళ్లు పూర్తి చేసుకుంది. 2016లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన జియో.. దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా కోట్లాది మందికి డిజిటల్ సేవలను చేరువ చేసింది. ఈ సందర్భంగా సంస్థ తెలంగాణ విభాగంలో ఉద్యోగులు, నాయకులు, భాగస్వాములతో కలిసి దశాబ్ది వేడుకలను నిర్వహించారు.
తెలంగాణలో ప్రారంభ దశ నుంచి క్రమంగా విస్తరించిన జియో.. ప్రస్తుతం మొబిలిటీ, హోమ్, ఎంటర్‌ప్రైజ్ విభాగాల్లో తన కార్యకలాపాలను బలోపేతం చేసుకుంది. గత పదేళ్లలో సాధించిన విజయాలు, సంస్థ అభివృద్ధిలో ఉద్యోగులు అందించిన సహకారం, ఈ ప్రయాణంలో ఏర్పడిన నైపుణ్యాలు, అనుభవాలను వేడుకల్లో గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా జియో తెలంగాణ సీఈఓ కే.సీ. రెడ్డి మాట్లాడుతూ.. తొలి దశాబ్దంలో సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రానున్న పదేళ్లు మరింత ఉత్సాహభరితంగా ఉండనున్నాయని పేర్కొన్నారు. సాంకేతికత జీవితం, వ్యాపారంలోని ప్రతి అంశాన్ని మరింతగా మార్చబోతోందని, 5జీ, కనెక్టెడ్ హోమ్స్, డిజిటల్ ఎంటర్‌ప్రైజెస్, భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే కొత్త సేవల్లో భారీ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
దశాబ్ది వేడుకల్లో ఉద్యోగుల గుర్తింపు కార్యక్రమాలు, స్మారక అవార్డుల ప్రదానం, కేక్ కటింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ అభివృద్ధిలో ఉద్యోగులు, వారి కుటుంబాలు, భాగస్వాములు అందించిన సహకారానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.


