సాక్షి,సిద్దిపేట: బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి రెడ్డి హాజరయ్యారు. తనది బీఆర్‌ఎస్సేనని, కాంగ్రెస్ కాదని స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కేంద్ర బిందువుగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల వ్యూహం, అనుసరించాల్సిన విధానాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
‘అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ డైరెక్షన్ కోసం ఫామ్‌హౌస్‌కు వచ్చాం. పార్టీ పిలుపునిచ్చింది కాబట్టి ఈ సమావేశానికి హాజరవుతున్నాం. కేసీఆర్ ఈరోజు ఏ దిశానిర్దేశం చేస్తారో దాని ప్రకారం నడుచుకుంటాం. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడినే, అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ సభ్యుల వైపే కూర్చుంటాను’ అని మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై కోర్టు తీర్పు కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
👉ఇదీ చదవండి: నా వల్లే ఇదంతా.. బోరున ఏడ్చేసిన కొండా సుష్మిత


