బంగారంపై పెట్టిన సొమ్ము.. ఎన్నటికీ వొమ్ము కాదు అనేది పెద్దలు చెప్పే మాట. అది వట్టి మాట మాత్రమే కాదు. 2021-22 సిరీస్–VI సావరిన్ గోల్డ్ బాండ్లలో (SGB) పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలు అందనున్నాయి. ఐదేళ్ల తర్వాత ముందస్తు రిడీమ్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక్కో యూనిట్ రిడంప్షన్ ధరను రూ.15,334గా నిర్ణయించింది. ఈ సెప్టెంబర్ 7న ఈ ధరకు బాండ్లను ముందస్తుగా రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
కొన్నప్పుడు ఎంతంటే..
2021-22 సిరీస్–VI సావరిన్ గోల్డ్ బాండ్లని 2021 సెప్టెంబర్ 7న జారీ చేశారు. సాధారణ పెట్టుబడిదారులకు ఇష్యూ ధర గ్రాముకు రూ.4,732 కాగా, ఆన్‌లైన్‌లో డిజిటల్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.50 డిస్కౌంట్‌తో రూ.4,682గా నిర్ణయించారు.
ఇప్పుడు ముందస్తు రిడంప్షన్ ధర రూ.15,334కి చేరడంతో ఆన్‌లైన్‌లో రూ.4,682కు కొనుగోలు చేసినవారికి ఒక్కో యూనిట్‌పై రూ.10,652 లాభం వస్తోంది. అంటే అసలు పెట్టుబడిపై సుమారు 227.5 శాతం రాబడి లభించినట్టే. దీనిపై వడ్డీ ఆదాయం కూడా ఉంటుంది.
ఉదాహరణతో చూస్తే.. 2021లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి సుమారు 21.36 యూనిట్ల సావరిన్ గోల్డ్ బాండ్లని కొనుగోలు చేశారనుకుంటే.. ప్రస్తుత రిడంప్షన్ ధర ప్రకారం ఆ యూనిట్ల విలువ సుమారు రూ.3.28 లక్షలకు చేరుతుంది. అంటే ఐదేళ్లలో బంగారం ధర పెరుగుదల ద్వారా దాదాపు రూ.2.28 లక్షల లాభం వచ్చినట్టవుతుంది.
అదనంగా వడ్డీ కూడా..
సావరిన్ గోల్డ్ బాండ్ల ప్రత్యేకత కేవలం బంగారం ధర పెరుగుదలతో వచ్చే లాభం మాత్రమే కాదు. 2021-22 సిరీస్–VIపై ఏటా 2.50 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ వడ్డీని ప్రారంభ పెట్టుబడి మొత్తంపై లెక్కించి ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. కాబట్టి ఐదేళ్లపాటు బాండ్‌ను కొనసాగించినవారికి పై రూ.3.28 లక్షల విలువకు అదనంగా ఇప్పటివరకు వచ్చిన వడ్డీ కూడా ఉంటుంది.
రిడంప్షన్ ధర ఎలా నిర్ణయించారు?
సావరిన్ గోల్డ్ బాండ్ల ముందస్తు రిడంప్షన్ ధరను ఆర్బీఐ (RBI) నేరుగా నిర్ణయించిన స్థిర మొత్తం కాదు. బంగారం ధర ఆధారంగా లెక్కిస్తారు. 2026 సెప్టెంబర్ 7 రిడంప్షన్ కోసం సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధరల సాధారణ సగటును పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ రూ.15,334 ధరను ప్రకటించింది.
ఎప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు?
సావరిన్ గోల్డ్ బాండ్లకు సాధారణంగా 8 ఏళ్ల మెచ్యూరిటీ ఉంటుంది. అయితే జారీ తేదీ నుంచి ఐదేళ్లు పూర్తైన తర్వాత, వడ్డీ చెల్లింపు తేదీల్లో ముందస్తు రిడంప్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం 2021-22 సిరీస్–VIకి 2026 సెప్టెంబర్ 7 నుంచి ముందస్తు రిడంప్షన్ అవకాశం వచ్చింది.


