బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) మరోసారి భారీ లాభాలను అందించాయి. 2019-20 సిరీస్–VII కింద జారీ చేసిన ఎస్‌జీబీల ముందస్తు రిడెంప్షన్ (Premature Redemption) ధరను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గ్రాముకు రూ.15,275గా నిర్ణయించింది.
ఆర్బీఐ ఈ బాండ్లను 2019 డిసెంబర్ 10న గ్రాముకు రూ.3,745 ధరతో జారీ చేసింది. అప్పుడు వీటిని కొనుగోలుచేసినవారికి ఐదేళ్లలో సుమారు 308 శాతం లాభం లభించినట్లైంది. అంటే గ్రాముకు రూ.11,530 లాభం అన్నమాట. అలాగే ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన గ్రాముకు రూ.50 తగ్గింపు కూడా ఆర్బీఐ ఇచ్చింది. దీంతో ఆన్‌లైన్‌లో కొన్నవారికి ఈ లాభం 313 శాతానికి పైగా చేరింది.
రూ.లక్షకు రూ.4 లక్షలు!
ఈ సిరీస్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుల పెట్టుబడి విలువ ప్రస్తుతం రూ.4.08 లక్షలకు పైగా పెరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి అదనంగా బాండ్ జారీ ధరపై సంవత్సరానికి 2.5 శాతం స్థిర వడ్డీని కూడా అర్ధవార్షికంగా పొందారు. అంటే మొత్తం రాబడి ఇంకా ఎక్కువే.
రిడెంప్షన్ ధర ఎలా నిర్ణయించారు?
ఎస్‌జీబీ రిడెంప్షన్ ధరను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. జూన్ 5, 8, 9 తేదీల ముగింపు ధరల సగటు ఆధారంగా ఈ విడతకు గ్రాముకు రూ.15,275 ధరను ఖరారు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది.
ఐదేళ్ల తర్వాతే ముందస్తు నిష్క్రమణ
సావరిన్ గోల్డ్ బాండ్ల అసలు గడువు ఎనిమిదేళ్లు. అయితే జారీ తేదీ నుంచి ఐదో సంవత్సరం పూర్తైన తర్వాత వడ్డీ చెల్లింపు తేదీల్లో ముందస్తుగా బాండ్లను రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ఈ సిరీస్‌కు జూన్ 10, 2026 తేదీని అర్హత కలిగిన రిడెంప్షన్ తేదీగా ఆర్బీఐ ప్రకటించింది.
పన్ను ప్రయోజనాలు ఏమిటి?
వ్యక్తిగత పెట్టుబడిదారులు ఎస్‌జీబీలను ఆర్బీఐ వద్ద రిడీమ్ చేసుకున్నప్పుడు లభించే మూలధన లాభాలపై గతంలో పన్ను మినహాయింపు ఉండేది. అయితే 2026 బడ్జెట్ తర్వాత పన్ను నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ వడ్డీ ఆదాయం మాత్రమే ఆదాయపు పన్నుకు లోబడి ఉంటుంది. బాండ్ల బదిలీ ద్వారా వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలు వర్తిస్తాయి.
ఏమిటీ ఎస్‌జీబీ పథకం?
భౌతిక బంగారం కొనుగోలు అవసరం లేకుండా బంగారం ధరల పెరుగుదల ప్రయోజనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. బంగారం ధరల పెరుగుదలతో పాటు 2.5 శాతం వార్షిక వడ్డీ కూడా లభించడం ఈ పథకాన్ని ప్రత్యేకంగా నిలిపింది. దేశంలో భౌతిక బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గృహ పొదుపులను ఆర్థిక ఆస్తులుగా మలచడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు.
అయితే ప్రభుత్వం 2023 చివరి నుంచి కొత్త సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని నిలిపివేసింది. నిర్వహణ వ్యయాలు పెరగడం, గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్ వంటి ప్రత్యామ్నాయాల ప్రాచుర్యం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. అయితే ఇప్పటికే జారీ చేసిన బాండ్లు చెల్లుబాటులోనే ఉంటాయి. పెట్టుబడిదారులు వాటిని మెచ్యూరిటీ వరకు కొనసాగించవచ్చు లేదా అర్హత వచ్చినప్పుడు ముందస్తు రిడెంప్షన్‌ను ఎంచుకోవచ్చు.
ఇదీ చదవండి: ఈజీగా ‘EPF 100% విత్‌డ్రా’.. కొత్తగా మారిందిదే..


