మరికొద్ది రోజుల్లో మండీలకు చేరనున్న ఖరీఫ్ పంటలకు కాస్త మెరుగైన ధరలు లభించేలా కనిపిస్తోంది. ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో మెజారిటీ పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో సమానంగా లేదా అంతకుమించి ధరలు పలుకుతుండటం రైతన్నలకు ఊరటనిస్తోంది. అగ్మార్క్‌నెట్ డేటా ప్రకారం, ఎంఎస్‌పీ ప్రకటించిన 14 పంటల్లో మొక్కజొన్న, జొన్న, కంది, మినుములు, సోయాబీన్ సహా తొమ్మిది పంటలు సెప్టెంబర్ 4న సగటున ఎంఎస్‌పీకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగానే అమ్ముడైనట్టు వెల్లడైంది.
అయితే, సజ్జ (బజ్రా), పెసర పంటలు మాత్రం వరుసగా 31 శాతం, 13 శాతం మేర ఎంఎస్‌పీతో పోలస్తే నేల చూపులు చూస్తున్నాయి. వరి విషయంలో ప్రభుత్వ సేకరణ ప్రభావం చూపుతుండగా ఉత్తరప్రదేశ్‌లో సగటు ధర క్వింటాల్‌కు రూ.1,965గా ఉంది. ఎంఎస్‌పీ కంటే ఇది 20.2 శాతం తక్కువ. ఎల్‌నినో ప్రభావంతో దిగుబడి నష్టాలు నమోదైనప్పటికీ వేరుశనగ, సోయాబీన్ వంటి పంటలు కూడా స్వల్ప నష్టంతోనే నడుస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
మెరుగ్గా ధరలు
‘వరి ఉత్పత్తిలో 40 శాతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందున దానికి ఢోకా లేదు. పంట సేకరణ మొదలైతే ధరలు మరింత పుంజుకుంటాయి. నూనె దిగుమతులు ఎక్కువగా ఉన్నా సోయాబీన్ ధర గతేడాదితో పోలిస్తే మెరుగ్గానే ఉంది’ అని వ్యవసాయ శాఖ మాజీ అదనపు కార్యదర్శి ఒకరు అభిప్రాయపడ్డారు. మొక్కజొన్న ధర ప్రస్తుతం ఎక్కువగా ఉన్నా పశుగ్రాసంతో పోటీ మొదలయ్యాక కిందికి దిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
వ్యాపారుల కుమ్మక్కు
నాఫెడ్ మాజీ అదనపు ఎండీ ఎస్‌కే సింగ్ మాట్లాడుతూ, ‘సోయాబీన్ ధర ఆకస్మిక పతనం వెనుక కార్టెలైజేషన్ (వ్యాపారుల కుమ్మక్కు) కనిపిస్తోంది. ఇది ఎక్కువ కాలం కొనసాగదు’ అని అన్నారు. మొత్తంగా పెసర తప్ప మిగతా ప్రధాన పంటలన్నీ ఎంఎస్‌పీకి దగ్గరగానే నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మొక్కజొన్న సాగు విస్తీర్ణం 3 శాతం, వరి విస్తీర్ణం 4 శాతం మేర తగ్గినట్టు సెప్టెంబర్ 4 నాటి అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: మీ వీధిలోనే ఉన్నారు ఫైనాన్స్ గురువులు


