వరి ‘సాగు’తలేదు! | El Nino tension among farmers | Sakshi
Sakshi News home page

వరి ‘సాగు’తలేదు!

Jul 6 2026 2:13 AM | Updated on Jul 6 2026 2:13 AM

El Nino tension among farmers

నేటితో ముగుస్తున్న ఆరుద్ర కార్తె.. రైతుల్లో ఎల్‌నినో టెన్షన్‌

ఇప్పటివరకు కేవలం 1.94 లక్షల ఎకరాల్లోనే వరిసాగు

ఇతర పంటలు కూడా అంతంత మాత్రమే 

బావులు, బోర్ల కిందే వరి సాగు.. చెరువులు,కాలువల కింద కదలని నాగళ్లు

సాక్షి, హైదరాబాద్‌: ఖరీఫ్‌ సీజన్‌కు అత్యంత కీలకంగా భావించే ఆరుద్ర కార్తె ఆదివారంతో ముగుస్తున్నా.. రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వ్యవసాయ పనులు ఊపందుకోలేదు. వర్షాలు ఓ మోస్తరులో కూడా కురవకపోవడంతో రైతులు వరి నారుమళ్లను సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసినా... అవి సాగుకు సరిపోక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బావులు, బోర్ల కింద నీటి సౌకర్యం ఉన్న రైతులు మాత్రమే నార్లు పోస్తుండగా, వర్షాధార రైతులు ఇంకా ఎదురుచూపులకే పరిమితమయ్యారు. సాధారణంగా ఆరుద్ర కార్తెలోనే వరి నార్లు వేయడం, నాట్లు ప్రారంభించడం జరుగుతుంది. ఆరుద్ర దాటితే ‘కాలం ఎత్తిపోయింది’అనే మాట ఉత్తర తెలంగాణలో ఎక్కువగా వినబడుతుంది. గత సంవత్సరం కూడా వర్షాలు ఆలస్యంగా కురవడంతో జూలై మొదటి వారం తరువాతే వరి నార్లు పోసే ప్రక్రియ వేగం అందుకోగా, ఈసారి మాత్రం ఆ జాడ కనిపించడం లేదు. నార్లు పోయకపోయినా, దుక్కులు దున్ని పొలాల కోసం సిద్ధం చేసుకునే రైతులు ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముందుగానే నార్లు పోసి వర్షాలు లేకపోతే మొత్తం పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉండటంతో చాలామంది రైతులు రిస్క్‌ తీసుకోవడం లేదు. కాలం ఎత్తిపోతే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టే యోచనతో ఉన్నారు.  

వరి 1.94 లక్షల ఎకరాల్లోనే..  
రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో 132 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో వరి 62.47 లక్షల ఎకరాల్లో సాగు కావలసి ఉండగా, ఇప్పటివరకు 1.93 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు కాగా.. గత ఏడాది ఇదే సమయానికి 5 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోనే ఎక్కువగా సాగైనట్లు తెలుస్తోంది. ఈ ఖరీఫ్‌లో పత్తి 49 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 30 లక్షల ఎకరాల్లో సాగైంది. గత ఏడాది ఇదే సమయానికి 36,30,988 ఎకరాల్లో సాగైంది. వర్షాధారమైన పత్తికి ఎల్‌నినో దెబ్బ తగిలితే పెట్టిన పెట్టుబడి కూడా రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి పోగా మిగిలిన అక్కడక్కడా మొక్కజొన్న, సోయాబీన్, కంది తదితర పంటల సాగు కొనసాగుతోంది.  

గోదావరి, ప్రాణహితపై ఆశలు 
ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే ప్రాణహిత నదిలోకి వరద వచ్చి చేరుతోంది. గోదావరికి కూడా ఇన్‌ఫ్లో పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద ఉన్న రైతుల్లో కొంత మేర ఆశలు మొలకెత్తుతున్నాయి. ప్రాణహితకు వరద పెరిగితే ఆ ప్రభావం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టులకు ఉపయోగపడే అవకాశం ఉంది. కృష్ణా పరీవాహక ప్రాంత రైతులు ఈసారి వరిపై ఆశలు వదిలేసుకునే పరిస్థితిలో ఉన్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగం దృష్టి ఇప్పుడు రాబోయే రెండు వారాలపైనే నిలిచింది. ఈ సమయంలో విస్తృతంగా వర్షాలు కురిస్తేనే వరి నాట్లు ఊపందుకునే అవకాశం ఉంది. లేకపోతే ఖరీఫ్‌ సాగు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement