
దేశీయంలో వరి పంటలో స్వావలంబన సాధించేందుకు, ఇథనాల్ ఉత్పత్తికి, రైతులకు ఆర్థిక భరోసాకు, కొన్ని దేశాలకు బియ్యం ఎగుమతులు పెంచేందుకు భారత్ తీసుకున్న నిర్ణయానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశంలో వరి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపు నిర్ణయానికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీఓ)లో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈమేరకు భారత నిర్ణయాన్ని అమెరికా, పరాగ్వే సంయుక్తంగా డబ్ల్యూటీఓలో వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచ ఆహార భద్రతకు సంబంధించిన ‘బాలీ ఒప్పందాల’ను(డబ్ల్యూటీఓ ఆహార సబ్సిడీ పరిమితులు) భారత్ భేఖాతరు చేస్తుందని వాదించాయి.
ఎంఎస్‌పీ పెంపు విధానం భారత్ దేశీయ ఆహార పంపిణీ వ్యవస్థలో భాగం అయినప్పటికీ ఎగుమతులు, ఆహారేతర ప్రయోజనాల కోసం నిల్వలు పెంచుతోందని యూఎస్, పరాగ్వే అభిప్రాయపడుతున్నాయి. భారత్ ఎంఎస్‌పీ పెంచడం, భారీగా నిల్వలు ఉండడం, ఎగుమతులు సాగించడం వంటి విధానాలు ప్రపంచ బియ్యం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నట్లు చెప్పాయి. పాకిస్థాన్‌ను ఉదాహరిస్తూ.. అక్కడి బాస్మతియేతర బియ్యం ధరలు దాదాపు రాత్రికి రాత్రే మెట్రిక్ టన్నుకు సుమారు 200 డాలర్లు పడిపోయాయని గుర్తు చేశాయి.
అయితే భారత్ వాదనలు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. దేశం తన వంతుగా చిన్న, సన్నకారు రైతులకు మద్దతు ఇవ్వడానికి, పేదలకు ఆహారం అందించడానికి, కొన్ని దేశాలకు ఆహార భద్రతను నిర్ధారించేందుకు ఈ మార్పులు చేసినట్లు చెప్పింది. భారతదేశం బియ్యంపై ఆంక్షలను ఎత్తివేసినప్పటి నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2025 నాటికి రికార్డు స్థాయిలో 22.5 మిలియన్ టన్నులకు పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే డబ్ల్యూటీఓ నిబంధనలకు లోబడే నిర్ణయాలున్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. ఎఫ్‌సీఐ గోదాముల్లోని బియ్యాన్ని ఎగుమతులకు ఉపయోగించడం లేదన్నారు. అందుకు బదులుగా ఏటా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న స్టాక్‌నే నిల్వ ఉంచకుండా నేరుగా ఎగుమతి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై సెప్టెంబర్ 25-26 తేదీల్లో జరిగే సమీక్షా సమావేశంలో చర్చ జరగనుంది.
ఇదీ చదవండి: భారత్–అమెరికా చర్చల్లో పురోగతి