సాక్షి, అమలాపురం/ రావులపాలెం: తీపి పంట అరటి.. రైతు నోరు చేదు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలకు మించి దిగుబడి రావడం, ఉత్తరాదికి ఎగుమతులు క్షీణించడం, దేశీయంగా అరటి ధరలు గణనీయంగా పడిపోవడం, జిల్లా రైతులకు శాపంగా మారింది. ధరలు తగ్గడంతోపాటు ఎగుమతులు కూడా పెద్దగా సాగకపోవడంతో అరటి రైతులు విలవిలలాడుతున్నారు. (Banana Prices Drop In AP)
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అరటి సాగు అధికం. ఒక్క కోనసీమ జిల్లాలోనే సుమారు 25,204 ఎకరాల్లో అరటి పంట సాగు జరుగుతోంది. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు, పి.గన్నవరం, కపిలేశ్వరపురం, అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో ఈ సాగు అధికం. డెల్టాలోనే కాకుండా లంక గ్రామాల్లో అరటి ఏక పంటగాను, కొబ్బరిలో అంతర పంటగా సాగవుతోంది. మొత్తం సాగులో 80 శాతం తెల్ల అరటి, కర్పూరం కాగా, మిగిలిన 20 శాతం కూర అరటి, అమృతపాణి, ఎర్ర చక్కెర కేళీ వంటి రకాలు పండిస్తున్నారు.
ఈసారి సీన్ రివర్స్
సాధారణంగా కార్తిక మాసంలో అరటి ధరలు అధికంగా ఉంటాయి. కాని ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. కార్తిక మాసం మొదలైన నాటి నుంచి అరటి ధరలు తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం రావులపాలెం, అంబాజీపేట మార్కెట్ యార్డులలో అరటి ధరలు పరిశీలిస్తే కర్పూరం కనిష్టంగా రూ.100, గరిష్టంగా రూ.200 చొప్పున ఉంది. చక్కెర కేళీ (తెలుపు) రూ.150 నుంచి రూ.250 వరకు, బుషావళి రూ.125 నుంచి రూ.200 వరకు, బొంత (కూర అరటి) రూ.150 నుంచి రూ.200 వరకు, అమృతపాణి రూ.200 నుంచి రూ.350 వరకు, చక్కెర కేళీ (ఎరుపు) రూ.200 నుంచి రూ.300 వరకు ఉంది. ఇప్పుడున్న ధరలకు గెలకు అదనంగా రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటే కాని రైతులకు గిట్టుబాటు కాదు. పైగా ఈ ధరలు నాణ్యత ఉన్న గెలలకు మాత్రమే. ఇప్పుడు మార్కెట్‌కు వస్తున్న గెలలు చాలా నాసిరకంగాను, చిన్న సైజువి కావడంతో ధరలకు మరింత కోత పెడుతున్నారు. (Banana Farmers Struggles In AP)
నాణ్యత లేక ధరాఘాతం
గత నెలలో వచ్చిన మోంథా తుపాను ప్రభావంతో ఈదురుగాలులు, వర్షాలకు అరటి తోటలు పెద్ద ఎత్తున నేలనంటిన విషయం తెలిసిందే. జిల్లాలో 3,379.90 ఎకరాల్లో పంట నేలకొరిగి దెబ్బతింది. తుపాను బారి నుంచి తప్పించుకున్న చోట్ల గాలులకు మొవ్వు ఒడి తిరిగిపోయింది. దీనివల్ల చెట్టు శక్తి కోల్పోవడంతో ఆ ప్రభావం గెలలపై పడింది. దీనివల్ల ఇప్పుడు కోత కోస్తున్న గెలల్లో 60 శాతం నాసిరకం గెలలు, మరో 20 శాతం మధ్యస్థంగా ఉండే మొరటు (నాణ్యమైన) గెలలు, మరో 20 శాతం మొరటు గెలలు వస్తున్నాయని రావులపాలెం మార్కెట్ యార్డు వ్యాపారులు చెబుతున్నారు.పది రోజులుగా పెరిగిన మంచు కూడా అరటి కాయల దిగుబడిని దెబ్బ తీస్తోంది. కాయల సైజు తగ్గిపోతోందని రైతులు వాపోతున్నారు. ఈ కారణంగా ఆశించిన ధరలు రావడం లేదంటున్నారు. దీనివల్ల రావులపాలెం మార్కెట్ యార్డు నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. సీజన్‌లో ఇక్కడ నుంచి రోజుకు 25 నుంచి 30 లారీల అరటి (లారీకి సగటున 800 గెలలు) చొప్పున రోజుకు 25 వేల గెలలు ఎగుమతి జరిగేది. ఇప్పుడు కేవలం 15 వేల నుంచి 18 వేల గెలలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి.
నలువైపులా పోటీ
రాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురంలో దశాబ్దకాలంగా అరటి సాగు అధికంగా ఉన్నా అక్కడ జి–9 మాత్రమే పండించేవారు. ఇప్పుడు కర్పూరం అధికంగాను, అమృతపాణి, చక్కెర కేళీలు అధికంగా సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి మొరటు 80 శాతం వరకు వస్తున్నాయి. దీనితో అక్కడ అరటికి డిమాండ్ పెరిగింది.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అరటి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌కు ఎగుమతి అధికం. ఎర్ర చక్కెర కేళి మాత్రం తమిళనాడు వెళుతోంది. ఈ ఏడాది శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తెలంగాణలోని ఖమ్మం, భద్రాది కొత్తగూడెంలో కూడా అరటి విస్తారంగా సాగు జరిగింది. మంచి దిగుబడి కూడా వస్తోంది. దీంతో ఉత్తరాదికి ఆయా జిల్లాల నుంచి ఎగుమతి అధికంగా ఉండడంతో ఇక్కడ అరటికి డిమాండ్ తగ్గింది.(Banana Farmers Challenges)
తమిళనాడుకు ఎర్ర చక్కెర కేళీ ఎగుమతి అధికం. సీజన్‌లో దీని ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటోంది. ఇప్పుడు దిగుబడి నాణ్యత లేని కారణంగా రూ.200 నుంచి రూ.300కు పడిపోయింది. గతంలో రోజుకు ఆరు నుంచి ఎనిమిది మినీ వ్యాన్‌ల అరటి ఎగుమతి జరిగేది. ఇప్పుడు ఇది నాలుగు వ్యాన్లకు మించడం లేదు. పైగా తమిళనాడు నుంచి బొంత అరటి ఇక్కడకు పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. దీని ధర కూడా తక్కువగా ఉండడం విశేషం.
సంక్రాంతి వరకు డిమాండ్ వచ్చేలా లేదు
రావులపాలెం మార్కెట్‌కు పదిహే ను రోజులుగా నాణ్యత లేని గెలులు అధికంగా వస్తున్నాయి. తుపాను ప్ర భావం, మంచు వల్ల గెలల నాణ్యత దెబ్బతింటోంది. ధర పడిపోయింది. రాయలసీమలో పంట పెరగడం కూడా ధర పెరుగుదలకు అడ్డంకిగా మారింది. పండగల సీజన్ పూర్తవడంతో సంక్రాంతి వరకు డిమాండ్ వ చ్చేలా లేదు.
– కోనాల చంద్రశేఖర్, అరటి వ్యాపారి, ఊబలంక, రావులపాలెం మండలం
గాలులు దెబ్బ తీశాయి
తుపాను వల్ల ఈదురు గాలులకు అరటి తోటలకు పెద్ద దెబ్బ తగిలింది. గెలలు సరిగా తయారవడం లేదు. దీనివల్ల ధర రావడం లేదు. తుపాను ముందు గెల రూ.200 నుంచి రూ.400 వరకు ఉంది. ఇప్పుడు సగం ధర కూడా రావడం లేదు. గెలలు తయారవుతున్న సమయంలో గాలులు దెబ్బ తీశాయి.
– పిల్లా గంగాధర్, అరటి రైతు, అంబాజీపేట


