విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతగట్లలో ప్రభుత్వ భూమి దురాక్రమణ
గ్రామస్తుల ఫిర్యాదుతో అక్రమ కట్టడం తొలగించేందుకు సిబ్బంది యత్నం
వారిపై రాళ్లు, రాడ్‌లతో దాడి.. చంపుతామని బెదిరింపు
ప్రాణభయంతో పరుగులు.. పోలీసులకు ఫిర్యాదు
పెందుర్తి : విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ కూటమి నేతల దుర్మార్గాలు తారస్థాయికి చేరాయి. పెందుర్తి మండలం చింతగట్లలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన ఆ పార్టీ నాయకుడు.. అందులోని నిర్మాణాలను తొలగించేందుకు వెళ్లిన సిబ్బందిపై దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరు వీఆర్వోలు, ఆక్రమణ తొలగించేందుకు వచి్చన జేసీబీ, ఆపరేటర్‌పై రాళ్లు, రాడ్‌లతో ఆ పార్టీ సీనియర్ నేత చీపురపల్లి నరసింగరావు, అతని కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు. దీంతో వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో నరసింగరావు, అతడి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే..
చింతగట్ల రెవెన్యూ సర్వే నెంబర్ 57/1, 2లలో దాదాపు 20 సెంట్ల ప్రభుత్వ భూమిని మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుచరుడు చీపురపల్లి నరసింగరావు ఆక్రమించి అందులో నిర్మాణాలు ప్రారంభించాడు. దీనిపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. విశాఖ జిల్లా జేసీ స్పందించి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఐ.వెంకట అప్పారావును ఆదేశించారు. ఈ క్రమంలో నరసింగరావు వద్ద ఏమైనా పత్రాలుంటే తీసుకురావాలని అధికారులు కోరారు. దీనిని పెడచెవిన పెట్టడంతో ఆ నిర్మాణాన్ని తొలగించాల్సిందిగా తహసీల్దార్ సిబ్బందిని ఆదేశించారు.
వీఆర్వోలు నాగహనుమాన్ కుమార్ ధర్మేంద్ర కట్టడాలను తొలగించేందుకు సన్నద్ధమవుతుండగా నరసింగరావు, అతని భార్య చిన్నీ, కుమారుడు రాజేష్, ఇద్దరు వీఆర్వోలు, జేసీబీపైకి రాళ్లు రువ్వారు. రాడ్‌లు పట్టుకుని దుర్భాషలాడుతూ చంపుతామంటూ మీదకు దూసుకెళ్లారు. దీంతో వీఆర్వోలు, జేసీబీ ఆపరేటర్ పరుగులు తీశారు. వారి దాడిలో జేసీబీ ధ్వంసమైంది. ఘటనపై వీఆర్వోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో ఓ మహిళపై యాసిడ్ దాడికి పాల్పడిన కేసులో నరసింగరావు 90 రోజుల రిమాండ్ అనుభవించినట్లు సమాచారం. ఘటనపై తహసీల్దార్ వెంకట అప్పారావు మాటా్లడుతూ.. నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించామని.. చట్ట ప్రకారం వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు.


