చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, చీకటి ఒప్పందాలపై వైఎస్ జగన్ ప్రశ్నాస్త్రాలు
వీటిలో ఏ ఒక్కదానికి బదులివ్వని సీఎం చంద్రబాబు, మంత్రులు
రాయలసీమ ఎత్తిపోతల నుంచి రాజధాని వరకూ అన్నింటా అదే తీరు
వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే అంటున్న మేధావులు, రాజకీయ పరిశీలకులు, ప్రజా సంఘాల నేతలు
ఆత్మరక్షణలో పడిన ప్రభుత్వం.. ప్రజల దృష్టి మళ్లించేందుకే మరో డైవర్షన్ డ్రామా
అందులో భాగంగానే ఎల్లో మీడియాతో కలిసి వైఎస్ జగన్‌పై దూషణలంటున్న రాజకీయ విశ్లేషకులు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు.. అవినీతి.. చీకటి ఒప్పందాలను సాక్ష్యాధారాలతో బట్టబయలు చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంధించిన ప్రశ్నాస్త్రాలకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తిట్ల దండకం అందుకున్నారని మేధావులు, రాజకీయ పరిశీలకులు, ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు తమకు అలవాటైన రీతిలో పోటీ పడి దూషణలకు దిగుతున్నారంటూ ఆక్షేపిస్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, ప్రజాభ్యుదయమే పరమావధిగా, ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్ష నేతగా చిత్తశుద్ధితో ప్రజల తరఫున వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తే.. చిత్తశుద్ధితో సీఎం చంద్రబాబు, మంత్రులు వాటికి సమాధానాలు చెప్పాల్సిందిపోయి, దూషణల పర్వానికి దిగడం ద్వారా తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయించానంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ చోరీ, రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతిపై ఆర్‌బీఐ నివేదిక, పారిశ్రామిక ప్రగతి పేరిట చేస్తున్న అవినీతి, అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, పన్నుల పేరిట బాదుడే బాదుడుతోపాటు.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతూ చేస్తున్న అవినీతిపై సాక్ష్యాధారాలతో గురువారం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలను సంధించిన విషయం తెలిసిందే.
ఇదే సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. రాజధానికి తొలి దశ భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా, వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రెండో దశలో మళ్లీ 50 వేల ఎకరాలు సమీకరిస్తుండటంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ప్రశ్నించిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సీఎం చంద్రబాబు, మంత్రులు సమాధానాలు చెప్పలేక నీళ్లు నములుతూ తమకు అలవాటైన రీతిలో తిట్ల దండకాన్ని అందుకున్నారు. వారితో పాటు ఎల్లో మీడియా సైతం పోటీ పడి దూషణల పర్వానికి దిగింది.
స్వలాభం కోసం ఎందాకైనా బాబు సిద్ధం
⇒ స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి మోసాన్ని చేయడానికైనా సీఎం చంద్రబాబు వెనుకాడరన్నది రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని వైఎస్ జగన్ ఎత్తిచూపడంతో చంద్రబాబు సర్కార్ ఆత్మరక్షణలో పడింది.
⇒ 2014–19 మధ్య భూ సేకరణను కోర్టు కేసులతో సంక్లిష్టం చేసి చంద్రబాబు సర్కార్ చేతులెత్తేస్తే 130 కేసులను పరిష్కరించి, 2019–24 మధ్య 2,700 ఎకరాల భూమిని సేకరించి.. రూ.960 కోట్లతో మూడు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి.. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను ప్రారంభించింది వైఎస్ జగన్. 2026 నాటికి ఎయిర్‌పోర్టు సిద్ధమవుతుందని అప్పుడే చెప్పిన అంశాన్ని వైఎస్ జగన్ గుర్తు చేస్తూ చంద్రబాబు క్రెడిట్ చోరీ నిర్వాకాన్ని సాక్ష్యాధారాలతోసహా బట్టబయలు చేయడంతో బాబు అబాసుపాలయ్యారు.
⇒ 2019–24 మధ్య రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే.. అందులో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.73 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లో జమ చేశామని.. ఎవరెవరి ఖాతాల్లో ఏ పథకం కింద ఎంత వేశామన్నది ఆధార్ కార్డులతో సహా ఇస్తామని వైఎస్ జగన్ చెప్పారు. కానీ.. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే రూ.3.02 లక్షల కోట్లు అప్పు చేసినా.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలు అమలు చేయలేదని.. అప్పుగా తెచ్చిన ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందని వైఎస్ జగన్ నిలదీయడంపై కూడా వారెవరూ జవాబు చెప్పలేదని మేధావులు స్పష్టీకరిస్తున్నారు.
⇒ ఇసుక నుంచి క్వార్ట్‌జ్ వరకూ ఎడాపెడా దోచేస్తూ.. మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని టీడీపీ నేతలు జేబుల్లోకి వేసుకుంటున్నారని గణాంకాలతోసహా ఎత్తిచూపితే ఎందుకు వాటిపై స్పందించరని మేధావులు నిలదీస్తున్నారు.
అమరావతి మదర్ ఆఫ్ స్కామ్స్ కాదా?
⇒ బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో అత్యంత అధునాతన సదుపాయాలతో చదరపు అడుగు రూ.4 వేల చొప్పున భవనాలను నిర్మిస్తుంటే.. రాజధానిలో చదరపు అడుగు రూ.పది వేలతో నిర్మిస్తున్నారని ఎత్తిచూపుతూ ఈ వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారులను కి.మీ రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున నిర్మిస్తుంటే.. రాజధాని అమరావతిలో కిలోమీటర్‌కు రూ.180 కోట్లు వెచ్చించి రహదారి నిర్మిస్తున్నాని ఎత్తిచూపుతూ.. భారీ ఎత్తున దోచుకుంటున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి నీకింత–నాకింత అంటూ దోచుకుంటున్నారని నిగ్గదీసి అడిగారు. దీనిపై కూడా సమాధానం రాలేదు.
⇒ గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాల ప్రాంతాన్ని రాజధానిగా 2015లో ప్రభుత్వం ప్రకటించింది. లోతట్టు ప్రాంతమైన ఆ భూమిలో రోడ్లు, విద్యుత్, తాగునీరు, మురుగు నీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని కేంద్రానికి చంద్రబాబు సర్కార్ డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) సమర్పించింది. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు సేకరిస్తోంది. దీని అభివృద్ధికి మరో రూ.లక్ష కోట్లు కావాలి. మొత్తంగా రూ.రెండు లక్షల కోట్లు. అంతపెద్ద ఎత్తున అప్పు తెచ్చి ఎవరైనా రాజధాని నిర్మిస్తారా? అని వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నకూ సమాధానం లేదు.
⇒ ‘మచిలీపట్నంలో పోర్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ వెస్ట్రన్ బైపాస్ పూర్తయింది. గన్నవరం ఎయిర్‌పోర్టు ఉంది. విజయవాడ–గుంటూరు మధ్యలో రహదారికి సమీపంలో లేదా విజయవాడ–మచిలీపట్నం మధ్య రహదారికి సమీపంలో రాజధానిని నిర్మించి ఉంటే తక్కువ ఖర్చుతో ఈ పాటికే మహానగరంగా అభివృద్ధి చెంది ఉండేది కాదా?’ అని వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నకూ వారి నుంచి సమాధానం లేదు.
సమాధానం చెప్పేందుకు నోరు పెగలట్లేదెందుకు?
⇒ రాజ్యాంగంలో ఎక్కడైనా రాజధాని ప్రస్తావన ఉందా? వైఎస్ జగన్ చెప్పినట్టుగా సీఎం, మంత్రులు ఎక్కడ కూర్చొని కార్యకలాపాలు నిర్వహిస్తే అదే రాజధాని. ఇది అబద్ధమని సాక్ష్యాధారాలతో ఒక్కరైనా సమాధానం చెప్పగలిగారా?
⇒ రివర్ బేసిన్‌లో, ముంపు ప్రాంతంలో రాజధాని అమరావతిని నిర్మిస్తున్నారని.. ఎక్కడైనా లోతట్టు ప్రాంతం, వరద ముప్పు ఉండే ప్రాంతంలో రాజధాని నిర్మించారా? అన్న వైఎస్ జగన్ ప్రశ్నకు సూటిగా సమాధానం ఎందుకు చెప్పడం లేదు?
⇒ కొండవీటి వాగు, పాల వాగు వరద వల్ల తరచుగా రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుండటం నిజం కాదా. ఈ వరద ముప్పును తప్పించడానికే శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండ వద్ద 3 రిజర్వాయర్లు నిర్మిస్తున్న మాట వాస్తవం కాదా? కొండవీటి వాగు వరద నీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోయడానికి ఇప్పటికే 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఉండవల్లి వద్ద ఎత్తిపోతల చేపట్టలేదా? తాజాగా 8,400 క్యూసెక్కులను ఎత్తిపోసేందుకు మరో ఎత్తిపోతల చేపట్టింది వాస్తవం కాదా?
⇒ రాజధానికి తొలి దశ భూ సమీకరణ కింద రైతులు భూములు ఇచ్చి 11 ఏళ్లు పూర్తయినా, ఇప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వక పోవడం నిజం కాదా? రైతులకు అభివృద్ధి చేయకుండా ఇచ్చిన ప్లాట్లను కూడా చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో ఇవ్వడం నిజం కాదా?
⇒ తాజాగా సీడ్ యాక్సిస్ రోడ్డు, ఎన్–8 రోడ్డు వంటి రోడ్ల విస్తరణ పేరుతో రైతుల ఇళ్లను కూడా సమీకరణ కింద ప్రభుత్వం లాక్కుంటుంటే.. ఈ అన్యాయంపై మంత్రి నారాయణను రైతు రామారావు ప్రశ్నిస్తూ ఆవేదనతో గుండె పగిలి చనిపోవడం నిజం కాదా?
⇒ రెండో దశ భూ సమీకరణ చేసేందుకు వడ్లమానులో నిర్వహించిన గ్రామసభలో ఇదే అంశంపై మంత్రి నారాయణను రైతులు నిలదీయడం వాస్తవం కాదా?


