- సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు
- వాటికి తలాడిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
- ప్రభుత్వ కీలక నేతతో పక్కా ఒప్పందం.. పెద్ద ఎత్తున ముడుపులు!
- ఫలితంగా ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ సర్వీసుల్లో భారీ కోత
- ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆధార పడేలా ఎత్తుగడ
- హైదరాబాద్, అంతర్రాష్ట్ర ప్రయాణికులపై ప్రధాన గురి
- మూడు నాలుగు రెట్ల చార్జీల పెంపుతో పన్నాగం
- రానూపోనూ కోటి మంది ప్రయాణికుల దోపిడీకి స్కెచ్
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ‘దారి’ దోపిడీకి చంద్రబాబు సర్కారు డూడూ బసవన్న తరహాలో తలాడిస్తోంది. ప్రభుత్వ కీలక నేతకు రూ.వంద కోట్ల ముడుపుల మూట ముట్టజెప్పేందుకు పక్కా డీల్ కుదరడంతో అడ్డగోలు దందాకు సర్కారు పచ్చ జెండా ఊపింది. దీనికోసం ఆర్టీసీ స్పెషల్ సర్వీసుల్లోనూ భారీగా కోత విధించింది. ప్రయాణికులు అనివార్యంగా ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆధార పడాల్సిన పరిస్థితి కల్పించింది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా కోటి మంది ప్రయాణికులను దోచుకునేందుకు పథక రచన చేసింది. రూ. కోట్లు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వంలో ప్రయాణ వ్యవహారాలు చూసే కీలక మంత్రి మాఫియాకు అండగా నిలిచినట్టు సమాచారం. సంక్రాంతి అంటే ఆంధ్రనాట పెద్ద పండగ. ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు, విద్యార్థులు సొంత ఊళ్లకు తరలివస్తారు. బంధు మిత్రులతో పండగ మూడు నాలుగు రోజులూ ఆనందంగా గడిపి తిరిగి కార్యస్థానాలకు వెళ్తారు. ఏటా సంక్రాంతికి దాదాపు 75 లక్షల మంది సొంతూళ్లకు వస్తారని అంచనా. వీరిలో సొంత వాహనాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సులో వచ్చే వారిని మినహాయిస్తే దాదాపు 40 లక్షల మంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. 
కాగా, ఈ ఏడాది ఆర్టీసీ సర్సీసుల్లో భారీ కోత విధించడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో 50 నుంచి 60 లక్షల మంది ప్రయాణించక తప్పదని స్పష్టమవుతోంది. ఏటా సంక్రాంతికి వచ్చి వెళ్లే వారిలో 40 శాతం మంది హైదరాబాద్‌వాసులే ఉంటారు. అందుకే టీడీపీ సిండికేట్ హైదరాబాద్ బస్ సర్వీసులను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. ఆర్టీసీ సర్వీసులను కుదించేలా పావులు కదిపింది.
ఆర్టీసీ దొంగాట
ఏటా సంక్రాంతి స్పెషల్ బస్సు సర్వీసుల వివరాలను ఆర్టీసీ ఎండీ విలేకరుల సమావేశం నిర్వహించి మరీ వెల్లడించేవారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వ కీలక నేతతో డీల్ కుదరడంతో సంక్రాంతి స్పెషల్ బస్సులపై కేవలం చిన్న నోట్ విడుదల చేసి ఆర్టీసీ చేతులు దులిపేసుకుంది. అందులో హైదరాబాద్ నుంచి కేవలం 240 సర్వీసులే నిర్వహిస్తామని వెల్లడించడం గమనార్హం. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆర్టీసీ కనికట్టు చేసేందుకు యత్నించింది.
హైదరాబాద్‌నుంచి ఏటా మాదిరిగానే సంక్రాంతి స్పెషల్ బస్సులు నడుపుతామని మరో చిన్న ప్రకటన మొక్కుబడిగా ఇచ్చింది. కానీ మొదటి ప్రకటనలో పేర్కొన్నట్టుగా వివిధ ప్రాంతాల నుంచి సంక్రాంతి స్పెషల్ బస్ సర్వీసుల పట్టిక ఇవ్వక పోవడం గమనార్హం. అంటే టీడీపీ ట్రావెల్స్ సిండికేట్ దోపిడీకి వత్తాసు పలుకుతున్నట్టేనని ఆర్టీసీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
గతంలో హైదరాబాద్ నుంచి 2,500 సర్వీసులు
కొన్నేళ్లుగా ఏటా సంక్రాంతి సీజన్‌లో హైదరాబాద్ నుంచి ఆర్టీసీ 2,500 బస్ సర్వీసులు నడిపింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సంక్రాంతికి ముందు ఐదు రోజులపాటు రోజుకు 2,500 బస్ సర్వీసులు.. సంక్రాంతి తర్వాత తిరుగు ప్రయాణాల కోసం మూడు రోజులపాటు రోజుకు 2 వేల బస్ సర్వీసులు నిర్వహిస్తూ వచ్చింది. గత ఏడాది కూడా ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌కు 2,100 బస్ సర్వీసులు నడిపారు. అయితే ఈసారి టీడీపీ సిండికేట్ అక్కడే దెబ్బ కొట్టింది.

ఇందులో భాగంగానే ఆర్టీసీ 240 బస్ సర్వీసులను మాత్రమే నడుపుతామని తొలుత ప్రకటించింది. ఇక హైదరాబాద్ తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న బెంగళూరు నుంచి కూడా కేవలం 102 బస్ సర్వీసులు, చెన్నై నుంచి కేవలం 15 బస్ సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించడం గమనార్హం. రాష్ట్రంలోని 28 జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల మధ్య కేవలం 3,500 బస్ సర్వీసులనే నడుపుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించడం మాఫియాతో ప్రభుత్వం డీల్ విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి.
మూడు నాలుగు రెట్ల చార్జీల బాదుడు
ప్రభుత్వంతో డీల్ కుదరడంతో టీడీపీ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా భారీ దోపిడీకి తెగబడుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సర్వీసుల్లో జనవరి 11 నుంచి 18 వరకు రానూపోనూ టికెట్లను జనవరి 1 నాటికే బ్లాక్ చేసేసింది. తద్వారా కృత్రిమ కొరత సృష్టించి ప్రయాణికులను హడలెత్తించింది. ఆ వెంటనే టికెట్ల రేట్లను ఐదు రెట్లు పెంచేసింది. ఆర్టీసీ బస్సుల కోతతో హీనపక్షంగా 50 లక్షల మంది ప్రైవేటు బస్సులపై ఆధార పడతారని అనుకున్నా.. రానుపోను అంటే కోటి మంది దోపిడీకి ప్రైవేటు మాఫియా పథక రచన చేసింది.
ఇందుకోసం ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్‌కు దన్నుగా నిలుస్తున్న ప్రభుత్వంలో కీలక నేతకు భారీగా ముడుపులు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. గతేడాది సంక్రాంతి సీజన్‌లోనే ఆయనకు రూ.50 కోట్ల వరకు ముట్టజెప్పినట్టు ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ప్రయాణికులు రెట్టింపు కావడంతో ముడుపుల మూట కూడా రెట్టింపు చేసినట్టు సమాచారం.


