దుర్గగుడిలో మరో ఘోరం | Bezawada Indrakeeladri incident | Sakshi
Sakshi News home page

దుర్గగుడిలో మరో ఘోరం

Jan 11 2026 3:39 AM | Updated on Jan 11 2026 10:05 AM

Bezawada Indrakeeladri incident

శ్రీచక్ర నవావరణార్చన పూజకు వినియోగించే పాలలో పురుగులు

అర్ధగంటపాటు కార్యక్రమం నిలిపివేత 

ఘటనపై ఐదుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీ 

ప్రొవిజన్స్‌ స్టోర్స్‌లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు 

ఆలయ ప్రాంగణంలోని గోశాల కానూరుకు తరలింపుపై విమర్శలు 

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కలకలం

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరిగే శ్రీ చక్ర నవావరణార్చన పూజకు వినియోగించే పాలలో పురుగులు కనిపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమ్మవారి సన్నిధిలోని నూతన పూజా మండపంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకోగా శనివారం వెలుగులోకి వచి్చంది. సంఘటన జరిగిన రోజు పూజను అర్ధగంట పాటు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ పాల కోసం ఆలయ అర్చకులు దేవస్థాన వాట్సాప్‌ గ్రూప్‌లో సందేశాన్ని పెట్టడంతో విషయం బయకొచ్చి దావానంలా వ్యాపించింది.

ఆలయ అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై దేవస్థాన స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌ శర్మ పర్యవేక్షణలో ఓ విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. ఇందులో అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ), ఏఈఓలు, సూపరింటెండెంట్‌లతో కలిపి మొత్తం ఐదుగుర్ని సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ శ్రీ చక్ర నవావరణార్చన పూజ జరిపించిన అ­ర్చకుల నుంచి వివరాలను అడిగి నమోదు చేసుకుంది. నివేదికను దేవదాయ శాఖ కమిషనర్‌కు అందజేయనున్నట్లు ఆలయ ఈఓ శీనా నాయక్‌ తెలిపారు.  

ప్రొవిజన్స్‌ స్టోర్స్‌లో తనిఖీలు.. 
ఇక పూజలో ఉపయోగించే పాలలో పురుగుల ఘటనపై విజిలెన్స్‌ అధికారులు శుక్రవారం ఆలయ ప్రొవిజన్స్‌ స్టోర్స్‌లో తనిఖీలు చేపట్టారు. దేవస్థానానికి చెందిన అసిస్టెంట్‌ కమిషనర్‌ రంగారావు, పరిపాలనా విభాగం ఏఈఓ వాసు స్టోర్స్‌ సిబ్బందిని ఆరా తీశారు. టెట్రా ప్యాకెట్ల పాల సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అమ్మ­వారి అభిషేకాలు, పూజలు, మల్లేశ్వరస్వామి వారి అభిషేకాలకు వినియోగిస్తున్న టెట్రా ప్యాకెట్లలోని పాలను తనిఖీ చేశారు. పురుగులున్న ప్యాకెట్‌ ఏ బ్యాచ్‌కు చెందినది? పాలు వినియోగించాల్సిన గడువు తేదీ వంటి అంశాలను రికార్డు చేసుకున్నారు. దేవస్థానంలో ప్రతీరోజు నాలుగు లీటర్లకు పైగా ఆవు పాల వినియోగిస్తుండగా, అవన్ని టెట్రా ప్యాకెట్ల రూపంలోనే సరఫరా అవుతున్నట్లు ఆలయ సిబ్బంది అధికారులకు తెలిపారు.

ఆలయ గోశాల తరలింపు పర్యవసానమేనా..!?
నిజానికి.. అమ్మవారి ఆలయంలో పూజలు, అభిషేకాల నిమిత్తం అవసరమైన ఆవుపాల కోసం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోనే గోశాలను నిర్వహిస్తోంది. అందులో నాలుగు గోవులను ఓ వ్యక్తి సంరక్షించే వారు. అయితే, ఇటీవల అధికారులు తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారితీయగా, దాని పర్యవసానమే  ఇప్పుడు తెలుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దసరా ఉత్సవాలకు ముందు భక్తుల భద్రత పేరుతో ఆలయ గాలి గోపురం, లక్ష్మీగణపతి విగ్రహాల వద్ద ఉన్న గోవులను కానూరులోని వేద పాఠశాల ఆవరణలోకి తరలించారు. అప్పటి నుంచి ఆవుపాల కోసం దేవస్థానం టెట్రా ప్యాకెట్లను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గో సంరక్షణ పేరుతో భక్తుల నుంచి దేవస్థానం విరాళాలను సైతం సేకరిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement