సాక్షి,విశాఖ: పచ్చనేతలు పేట్రేగిపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూమి కనపడితే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా,టీడీపీ నేత నరసింగరావు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులపై నరసింగరావు అనుచరులు రాళ్లు,రాడ్లతో దాడులకు తెగబడ్డారు.
విశాఖపట్నం పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తున్న టీడీపీ నేత నరసింగరావు పై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, నిర్మాణం తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై ఆయన అనుచరులు దాడి చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మాణం జరుగుతోందని సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, విఆర్ఓ ఆధ్వర్యంలో జేసీబీతో అక్కడికి చేరుకున్నారు. నిర్మాణాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుండగా, టీడీపీ నేత నరసింగరావు అనుచరులు రాళ్లు, కర్రలతో రెవెన్యూ సిబ్బందిపై దాడి చేశారు. జేసీబీ వాహనాన్ని కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు.
దాడిలో తాను ప్రాణహానికి గురయ్యానని విఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, స్థానిక పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం వివాదాస్పదంగా మారింది. అధికారులు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


