జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు హైకోర్టు ఆదేశం
కోడి పందేలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పు
సాక్షి, అమరావతి: సంక్రాంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా కోడి పందేలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జంతుహింస నిరోధక చట్టం–1960, ఏపీ జూద నిరోధక చట్టం–1974ను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. చట్టాల అమలులో విఫలమైతే తహసీల్దార్లు, పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఆయా జిల్లాల్లోని మండలాల్లో సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. కోడి పందేల పేరుతో బెట్టింగ్, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తూ యువతను వాటిలోకి లాగుతున్నారని, దీంతో వారు ఆస్తులు కోల్పోయే పరిస్థితి వస్తోందంటూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. పందేలను ఆపేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. గతంలోనూ హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసినా అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తెలిపారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... జంతు హింస నిరోధక చట్టం, ఏపీ జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.
తహసీల్దార్, ఎస్‌ఐలతో తనిఖీ బృందాలు
సంయుక్త తనిఖీ బృందాల్లో తహసీల్దార్, ఎస్‌ఐ ర్యాంకుకు తగ్గని పోలీసు అధికారి, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణకు పనిచేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉండాలని కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. వీరు తనిఖీలకు వెళ్లే సమయంలో ఇద్దరు పోలీసులు, ఒక ఫోటోగ్రాఫర్ సహాయకులుగా ఉండాలని పేర్కొంది. ‘‘కోడి పందేలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? బరులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? తదితర వివరాలను తెలుసుకునేందుకు తనిఖీ బృందాలు మండలాల పరిధిలోని గ్రామాలను సందర్శించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
కోడి పందేలకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తక్షణమే చర్యలు చేపట్టాలి. అవసరమైతే 144 సెక్షన్ కింద ఉన్న అధికారాలను సైతం ఉపయోగించుకోవచ్చు. కోడి పందేల్లో ఉపయోగించిన, ఉపయోగించ తలపెట్టిన ఉపకరణాలు, పందేల సందర్భంగా వసూలు చేసిన డబ్బును జప్తు చేయవచ్చు’’ అని డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తీర్పునిచ్చారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమిల్లి జయంతి వాదనలు వినిపిస్తూ చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనకుండా పోలీసులు ప్రజలను చైతన్యపరుస్తున్నారని తెలిపారు.


