
సానుకూల వాతావరణంలో సాగుతున్నాయి
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై భారత్–అమెరికా మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో ముందుకు సాగుతున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గురువారం ప్రకటించారు. చర్చల్లో పురోగతి పట్ల రెండు దేశాలు సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) చర్చలను 2025 నవంబర్ నాటికి ముగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ దేశ వాణిజ్య మంత్రులకు సూచించినట్టు తెలిపారు. వాణిజ్య ఒప్పందం విషయమై అమెరికాతో భారత్ చురుగ్గా చర్చలు నిర్వహిస్తున్నట్టు మంత్రి గోయల్ బుధవారం సైతం ప్రకటించడం గమనార్హం.
రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విజయవంతంగా పూర్తయ్యేందుకు ఎలాంటి అడ్డంకుల్లేవని, తన మంచి స్నేహితుడైన ప్రధాని నరేంద్ర మోదీతో రానున్న వారాల్లో మాట్లాడేందుకు వేచి చూస్తున్నానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సాకారమవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సైతం వెంటనే సానుకూలంగా స్పందించారు.
అమెరికా, భారత్ సహజ భాగస్వాములంటూ.. వీలైనంత ముందుగా వాణిజ్య చర్చలను ముగించేందుకు రెండు దేశాలు చురుగ్గా పనిచేస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి భారత్–అమెరికా మధ్య పలు విడతల చర్చలు జరిగినప్పటికీ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదరకపోవడం తెలిసిందే.
ఇదీ చదవండి: నోకియా హ్యాండ్‌సెట్‌ల తయారీదారు కొత్త ఫోన్