రైతన్న టెన్షన్‌.. టెన్షన్‌.. ఖరీఫ్‌పై కరువు ఛాయలు | Effect of Drought on kharif Crop Production | Sakshi
Sakshi News home page

రైతన్న టెన్షన్‌.. టెన్షన్‌.. ఖరీఫ్‌పై కరువు ఛాయలు

Jul 15 2025 5:46 AM | Updated on Jul 15 2025 5:46 AM

Effect of Drought on kharif Crop Production

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో వేరుశనగ సాగు కోసం దుక్కు దున్ని ఖాళీగా వదిలేసిన సాగు భూమి

రాష్ట్రంలో ముందుకు కదలని పంటల సాగు

సీజన్‌ ప్రారంభమై 45 రోజులు దాటుతున్నా సాగైంది 15 శాతమే 

వేరుశనగ పంట సాగుకు ఈ నెలాఖరుతో దాటనున్న అదును   

అయినా లక్ష ఎకరాలకు మించి సాగవ్వని పంట 

రాయలసీమలో ఖరీఫ్‌ పంటలపై వర్షాభావం తీవ్ర ప్రభావం 

సాగు లక్ష్యం 86 లక్షల ఎకరాలు.. సాగైంది 12 లక్షల ఎకరాలే 

ఓ వైపు వర్షాభావ పరిస్థితులు.. మరో వైపు అధిక ఉష్ణోగ్రతలు 

సాగైన ప్రాంతాల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు లేక వాడిపోతున్న పైరు.. చాలా చోట్ల దుక్కులు దున్ని ఖాళీగా వదిలేసిన భూములు 

17 జిల్లాల్లో 446 మండలాల్లో లోటు వర్షపాతం 

153 మండలాల్లో పంటల సాగుపై డ్రై స్పెల్స్‌ ప్రభావం

రాష్ట్రంలో ముందుకు కదలని పంటల సాగు

సీజన్‌ ప్రారంభమై 45 రోజులు దాటుతున్నా సాగైంది 15 శాతమే

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ సాగుపై కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. ఓ వైపు వర్షాభావ పరిస్థితు­లు, మరో వైపు అధిక ఉష్ణోగ్రతలు అన్నదాతను సాగుకు దూరం చేస్తున్నాయి. గత ఖరీఫ్‌ మాదిరిగా ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖరీఫ్‌ సాగు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో వర్షాభావం వెన్నా­డుతుండటంతో ఖరీఫ్‌ సాగు తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. క్షేత్ర స్థాయిలో డిమాండ్‌కు సరిపడా సబ్సిడీ విత్తనాలకు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు.

యూరియా, డీఏపీ కొరత వేధిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌కు 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం కాగా, దాదాపు 1.10 లక్షల క్వింటాళ్ల మేర కోత పెట్టారు. 5.22 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తన కేటాయింపులు జరపగా, ఇప్పటి వరకు 4 లక్షల క్వింటాళ్లను నిల్వ చేసి, 3.50 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు. ఇండెంట్‌ ప్రకారం 3 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనం అ­వ­­సరం కాగా, దాదాపు లక్ష క్వింటాళ్లకు కోత పె­ట్ట­గా, కేవలం 1.80 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని స­రఫరా చేశారు. వరి విత్తనాన్ని కూడా 2.27 లక్షల క్వింటాళ్లకు 1.60 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పొ­జిషన్‌ చేయగా, 1.35 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు సరఫరా చేశారు. మరో వైపు రాష్ట్రంలో ప్రస్తుతం  3 లక్షల టన్నుల యూరియా, 91 వేల టన్ను­ల డీఏపీ అందుబాటులో ఉందని చెబుతున్న­ప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఆ స్థాయిలో కన్పించడం లేదు. 

చేతిలో పెట్టుబడి లేక.. అప్పులు పుట్టక..
అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి ఏడాది ఇవ్వాల్సిన రూ.20 వేల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం, ఈ ఏడాది ఎప్పుడిస్తుందో కూడా చెప్పలేక పోతోంది.  కనీసం సరిపడా పంట రుణాలైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఇప్పటి వరకు నిర్దేశించిన రుణ లక్ష్యం 2.32 లక్షల కోట్లలో 30 శాతం అంటే  రూ.77 వేల కోట్లు కూడా దాటలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణా ల రీ షెడ్యూల్‌ తప్ప కొత్తగా ఇచ్చేది ఏమీ ఉండడం లేదంటున్నారు. కౌలు రైతుల విషయానికి వస్తే 10 లక్షల మందికి సీసీఆర్సీ ఇవ్వాలన్నది లక్ష్యంగా కాగా, నేటికి 4 లక్షల మందికి కార్డులు జారీ చేశారు. వీరికి రూ.8 వేల కోట్ల రుణాలివ్వాలనేది లక్ష్యం. అయితే రూ.100 కోట్లు కూడా దాటలేదు.

446 మండలాల్లో లోటు వర్షపాతం
సీజన్‌ ప్రారంభమై 45 రోజులు దాటింది. జూలై రెండో వారం వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు.  ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ వర్షపాతం 575 ఎంఎం కాగా, ఇప్పటి వరకు 100 ఎంఎంకు మించి వర్షపాతం పడలేదు. దాదాపు 30 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదైంది. తొమ్మిది జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 13 జిల్లాల్లో లోటు, 4 జిల్లాల పరిధిలో అత్యధిక లోటు వర్షపాతం నమోదైంది. 

153 మండలాల్లో ఒకటి కంటే ఎక్కువ డ్రైస్పెల్స్‌
జూలై రెండో వారం వచ్చినా సరే కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదవుతోంది. ఈ నెలాఖరు వరకు ఇదే స్థితి కొనసాగేలా కన్పిస్తోంది. ఒక డ్రై స్పెల్‌ (పొడి వాతావరణం) అంటే వరుసగా 21 రోజుల పాటు వానలు లేకపోవడం. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై దాదాపు 45 రోజులు కావస్తోంది. దాదాపు 153 మండలాల్లో ఒకటి కంటే ఎక్కువగా డ్రైస్పెల్స్‌ ఏర్పడ్డాయి. నెల్లూరుతో సహా రాయలసీమ జిల్లాల్లో 98, కోస్తా జిల్లాల్లో 37, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 9, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 5, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 4 చొప్పున మండలాల్లో ఒకటి కంటే ఎక్కువగా నమోదైన డ్రైస్పెల్స్‌ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

15 శాతం దాటని పంటల సాగు
ఖరీఫ్‌ సాధారణ పంటల సాగు విస్తీర్ణం 80 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో 86.47 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. 38.87 లక్షల ఎకరాల్లో వరి, 14.30 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.10 లక్షల ఎకరాల్లో పత్తి, 9.35 లక్షల ఎకరాల్లో అపరాల సాగు లక్ష్యంగా అంచనా వేశారు. జూలై రెండో వారం వచ్చినా పంటల సాగు కనీసం 15 శాతం దాటలేదు. 12 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. 5 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడగా, 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. మిగిలిన పంటలన్నీ కలిపి 3 ఎక్షల ఎకరాలు దాటలేదు.  నెల్లూరు జిల్లాలో మాత్రమే  1.27 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం కాగా, ఇప్పటికే రికార్డు స్థాయిలో 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. నెల్లూరు తర్వాత తిరుపతిలో 80 శాతం, కర్నూలులో 40 శాతం విస్తీర్ణంలో పంటలు సాగ య్యాయి. మిగిలిన ఏ జిల్లాలోనూ 15–20 శాతం దాటలేదు. గోదావరి, కృష్ణా డెల్టాల కింద సాగునీరు ఇచ్చామని గొప్పలు చెబుతున్నా.. ఒక్క తూర్పు గోదావరిలోనే 20 శాతం విస్తీర్ణంలో పంటలు సాగవ్వగా, మిగిలిన జిల్లాల్లో 1–10 శాతం లోపే ఉన్నాయి.

అదును దాటుతున్నా జాడలేని వేరుశనగ సాగు
ఖరీఫ్‌ సీజన్‌లో వరి తర్వాత అత్యధికంగా సాగ­య్యేది వేరుశనగ పంట. రాయ­లసీమ జిల్లాల్లో నూటికి 70–80 శాతం విస్తీర్ణంలో ఈ పంటే సాగవుతుంది. ఏటా 18 లక్షల ఎకరాల్లో సాగయ్యే ఈ పంటను ఈ ఏడాది 14.30 లక్షల ఎకరాలకు కుదించారు. సాధారణంగా ఈ పంట సాగు జూలై నెలాఖరులోగా పూర్తవుతుంది. కానీ ఈ ఏడాది జూలై రెండో వారం దాటుతున్నా.. పట్టుమని లక్ష ఎకరాల్లోనూ విత్తనం వేయని దుస్థితి. వరి, వేరుశనగ తర్వాత ఎక్కువగా సాగయ్యేది పత్తి.  గతేడాది ఆశించిన ధరలు లేకపోవడంతో ఈసారి పత్తి సాగుపై రైతులు విముఖత చూపారు. దీంతో ఇప్పటి వరకు 4 లక్షల ఎకరాల్లోనే పత్తి సాగైంది.

మిరప సాగుకు దూరంగా రైతులు
గతేడాది కనీస మద్దతు ధరలు లేక తీవ్ర నష్టాలను చవిచూసిన మిరప, పొగాకు రైతులు ఈసారి ఆ పంటల సాగుకు ముందుకెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు. ఫలితంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో నేటికీ ఏ విత్తనం పడలేదు. గుంటూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి మిరప విత్తనం కొనే నాథుడే కరువయ్యాడు. ఏటా రూ.150–200 కోట్లకుపైగా జరిగే మిరప విత్తన వ్యాపారం, ఈసారి రూ.15 కోట్లు కూడా దాటలేదని విత్తన వ్యాపారులు చెబుతున్నారు. ఏటా 6 లక్షల ఎకరాల్లో సాగయ్యే మిరప.. గతేడాది 4 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది అందులో కనీసం 30 శాతం విస్తీర్ణంలో కూడా మిరప సాగయ్యే పరిస్థితి కన్పించడం లేదు. మరోవైపు తీవ్ర నష్టాలను మిగిల్చిన నల్లబర్లి పొగాకు రైతులు కూడా ఈసారి ఖరీఫ్‌ సాగుకు విముఖత ప్రదర్శిస్తున్నారు.  

ఏ పంట వేయాలన్నా భయమేస్తోంది
గత ఖరీఫ్‌లో 4 ఎకరాలల్లో మిరప సాగు చేశాను. ఎకరాకు 15–20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఎకరాకు రూ.2 లక్షలు పెట్టుబడి అయ్యింది. అంతకు ముందు ఏడాది క్వింటా రూ.14 వేలకు పైగా అమ్ముకున్న తాలు కాయలను ఈసారి రూ.3 వేలతో అమ్ముకోవాల్సి వచ్చింది. 16 క్వింటాళ్ల తాలు కాయలు అమ్ముకోగా 60  క్వింటాళ్ల మేలు రకం కాయలు ధర లేక కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టాను. 2023లో రూ.20–27 వేల వరకు ధర పలికింది. ఈసారి రూ.6–10 వేలకు మించి పలకలేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో మిరపను దాచుకున్న రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు. క్వింటాకు ఏడాదికి రూ.700 చెల్లించాలి. ఎకరాకు రూ.1.50 లక్షలు నష్టపోయాను. ఏ పంట వేయాలన్నా భయమేస్తోంది.  – దారం ఎలిసా రెడ్డి, దారంవారిపాలెం, ప్రకాశం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement