ఖరీఫ్‌లోనూ కర్షకుడికి కష్టాలే! | AP Farmers Concern Over Kharif Season Crops | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌లోనూ కర్షకుడికి కష్టాలే!

May 31 2026 4:05 AM | Updated on May 31 2026 4:05 AM

AP Farmers Concern Over Kharif Season Crops

జూన్‌ ఒకటో తేదీ వస్తున్నా జాడ లేని విత్తనం

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతతో ఖరీఫ్‌లో సాగుపై అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జూన్‌ 1వ తేదీ వస్తున్నా విత్తనాలు, ఎరువుల సరఫరాలో  ప్రభుత్వం విఫలమైంది. అదునుకు వేరుశనగ విత్తనమే కాదు.. కనీసం పచ్చిరొట్ట విత్తనం కూడా సరఫరా చేయలేక చేతులెత్తేస్తోంది. ఎరువులను యాప్‌ ద్వారా పంపిణీ చేసేందుకు సిద్ధపడడంతో ఈసారి కూడా యూరియా, డీఏపీ కోసం యూరియా, డీఏపీ కోసం రైతులకు అగచాట్లు తప్పేటట్టు కన్పించడం లేదు. 

సీజన్‌కు ముందుగా పెట్టుబడి సాయం లేదు. ఇన్‌పుట్‌సబ్సిడీ ఎలాగూ లేదు. ఉచిత పంటల బీమా అసలే లేదు. కనీసం స్వచ్ఛంద పంటల బీమాను కూడా రైతులకు దూరం చేశారు. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాధార ప్రాంతాల్లోనే కాదు, సాగునీటి వనరులున్న ప్రాంతాల్లోనూ రైతులు ఖరీఫ్‌ సాగుకు ముందుకెళ్లలేకపోతున్నారు.

అదునుకు విత్తనమేది?
ఖరీఫ్‌లో రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణం 77.12 లక్షల ఎకరాలు కాగా, ఖరీఫ్‌–2026లో 81.50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా 37.85 లక్షల ఎకరాల్లో వరి, 9.89 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 12.87 లక్షల ఎకరాల్లో ప్రత్తి, 8 లక్షల ఎకరాల్లో అపరాలు, తదితర పంటల సాగును లక్ష్యంగా పెట్టారు. ఈసారి ముందస్తుగా సాగునీటి విడుదలకు షెడ్యూల్‌ ప్రకటించామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది.

కోతల వేళ వైపరీత్యాల బారిన పడకుండా పంటలను కాపాడుకోవచ్చంటూ మే 4 నుంచి పెన్నా డెల్టాకు, జూన్‌ 1 నుంచి గోదావరి డెల్టాకు జూలై 1 నుంచి కృష్ణా డెల్టా ఆయకట్టుకు, అలాగే, మిగిలిన ఆయకట్టులకు సాగునీటి షెడ్యూల్‌ను విడు­దల చేసింది. కానీ అందుకు తగినట్టుగా విత్త­న సరఫరా చేయలేకపోతోంది. వైఎస్‌ జగన్‌ ప్రభు­త్వంలో ఏటా రెండు సీజన్లు కలిపి కనీసం 400 కోట్లతో సబ్సిడీ విత్తనాన్ని సరఫరా చేసేవారు. గడిచిన రెండేళ్లుగా సబ్సిడీ విత్తన పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కోతలు పెడుతు­ండడంతో రైతులు అదునుకు సబ్సిడీ విత్తనం దొర­క్క దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడు­తున్నారు.

బకాయిలతో ముందుకురాని కంపెనీలు
2026–27 వ్యవసాయ సీజన్‌లో ఖరీఫ్‌లో రూ.179 కోట్లతో 4.82 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేయా­లని జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ప్రతి­పాదించారు. 2.20 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 1.62 లక్షల క్వింటాళ్ల వరి, 92 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు టెండర్లు ఖరారయ్యాయి.అయితే గడిచిన రెండేళ్లకు చెందిన రూ.187 కోట్ల విత్తన సబ్సిడీ బకాయిల చెల్లింపులో చంద్రబాబు ప్రభుత్వ ఎగవేత ధోరణికి నిరసనగా విత్తన సరఫరాకు కంపెనీలు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. 

ఏపీ సీడ్స్‌ వద్ద అందుబాటులో ఉన్న పచ్చిరొట్ట విత్తనాలను అరకొరగా పొజిషన్‌ చేయగా, వేరుశనగ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో చెప్పలేని దుస్థితి. దీంతో రాయలసీమ రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎల్‌నినో పరిస్థితులున్నప్పటికీ సీమ జిల్లాల్లో ప్రస్తుతం ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో అదునుకు విత్తనం సరఫరా చేసి ఉంటే రైతులకు ఎంతగానో మేలు జరిగేది. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగు వేయలేదు.

అందని పెట్టుబడి సాయం.. అటకెక్కిన పంటల బీమా
అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామన్న చంద్ర­బాబు తొలి ఏడాది నిస్సిగ్గుగా రూ.10,716 కోట్లు ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఏడు లక్షల మందికి కోత పెట్టి రూ.14వేలతో సరిపెట్టారు. ఈ ఏడాది అయినా సీజన్‌కు ముందుగా పెట్టుబడి సాయం అందిస్తారేమో అని ఆశపడిన రైతులకు నిరాశే ఎదురైంది. కానీ మరో రెండ్రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్నా పెట్టు­బడి సాయం ఊసె­త్త­డం లేదు.

రెండేళ్లుగా పైసా పెట్టుబడి సాయం అందించకపోవడంతో కౌలు రైతు­లు­­గగ్గోలు పెడుతు­న్నారు. 2024 జూన్‌లో కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టడంతో 2023–24 సీజన్‌కు సంబంధించి దాదాపు రూ.1385 కోట్ల బీమా పరిహారం రైతులకు అందలేదు. 2024–­25, 2025–26 వ్యవసాయ సీజన్లలో ప్రభుత్వం బీమా ప్రీమియం బకాయిలు రూ.1095.11 కోట్లు ఎగ్గొట్టడంతో కంపెనీలు ఏపీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే­శాయి. మరోవైపు కరువు బకాయిలు రూ.327 కోట్లతో పాటు 2024–25 సీజన్‌లో రూ.650 కోట్లకు­పైగా పంట నష్టపరిహారం నేటికీ జమ చేయలేదు. రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీ రెండేళ్లుగా చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. దీంతో ఖరీఫ్‌ సాగు వేళ రైతుల చేతిలో చిల్లి­గవ్వ లేక అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు.

యాప్‌ ద్వారా ఎరువులు.. ఆందోళనలో రైతులు
ఎరువుల కొరతేమీ లేదంటూ పదేపదే ప్రకట­నలు ఇస్తున్న టీడీపీ ప్రభుత్వం ఈసారి యాప్‌ ద్వారా పంపిణీ అంటూ మెలిక పెట్టి, ఆంక్షలు విధిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు 2025–26 వ్యవ­సాయ సీజన్‌కు సంబంధించి జాతీయ స్థాయి­లో 39.054 మిలియన్‌ టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 20.012 మిలియన్‌ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ సారి రాష్ట్రా­నికి జరిపిన కేటాయింపుల మేరకు ఎరువులు సరఫరా జరిగే అవకాశాల్లేవని తెలుస్తోంది.

రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌కు 18.09 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 8.20 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నా­­­యంటున్నారు. రాష్ట్రంలో యూరియా ఏ స్థాయిలో దారిమళ్లుతోందో రెండేళ్లుగా చూ­స్తూనే ఉన్నాం. ఎలాంటి పంటలు సాగులేని ఏప్రిల్, మే నెలల్లో ఇప్పటికే 2 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 75 వేల టన్నుల యూరియా, 30 వేల టన్నుల డీఏపీ అమ్మకాలు జరిగాయంటే ఏ స్థాయిలో పక్కదారి పడుతు­న్నాయో ప్రత్యేకంగా చెప్పనవ­స­రం లేదు. చంద్రబాబు ప్రభుత్వం మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతుందే తప్ప వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించలేకపో­తోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

రాష్ట్రంలో ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం: 77.12 లక్షల ఎకరాలు
ఖరీఫ్‌ 2026 సాగు లక్ష్యం: 81.50 లక్షల ఎకరాలు
వరి: 37.85 లక్షల ఎకరాలు
వేరుశనగ: 9.89 లక్షల ఎకరాలు
పత్తి: 12.87 లక్షల ఎకరాలు
అపరాలు తదితర పంటలు: 8 లక్షల ఎకరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement