న్యూఢిల్లీ: చమురు కంపెనీలు పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ఎంతో స్పష్టంగా తెలియజేయాలన్న డిమాండ్‌తో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు కింద నరేంద్ర కుమార్ గోస్వామీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేది లేదని జస్టిస్ ఎంఎం సుంద్రేశ్, జస్టిస్ పి.బి.వరాలేలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. పిటిషనర్ తగిన హైకోర్టును ఆశ్రయించే వెసలుబాటు కల్పించింది.
విచారణ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకట రమణి వాదిస్తూ ఇలాంటి పిటిషన్ ఒకటి ఇప్పటికే డిస్మిస్ అయ్యిందని, దీంతో ఇప్పుడు పరోక్షంగా కేసు వేశారని చెప్పారు. ‘భారత ప్రభుత్వం తనకు జవాబుదారిగా ఉండాలని పిటిషనర్ కోరుకుంటున్నారు’’అని తెలిపారు. అయితే పిటిషర్ నరేంద్ర కుమార్ గోస్వామీ కోర్టుకు పెట్రోలు పంపు రసీదు ఒకటి సమర్పిస్తూ... తాను ఉపయోగించే పెట్రోలులో ఏమేమి కలిశాయో తెలుసుకునే హక్కు తనకుందని స్పష్టం చేశారు.
‘‘నేనొక్కడినే కాదు. దేశ పౌరుల్లో అధికులు పెట్రోలులో ఏమేం ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు’’అని తెలిపారు. తాను అందించిన రసీదులో పెట్రోలులో కలిపిన ఇథనాల్ మోతాదు ఎంతో లేదని చెప్పారు. పెట్రోలులో ఇథనాల్ కలపడాన్ని అటార్నీ జనరల్ గత విచారణలో ఒక ప్రయోగం అన్నారని, కానీ ఆ తరువాత ప్రభుత్వం తాము ఆ మాట అనలేదని ఒక ప్రకటన చేసిందని గోస్వామి గుర్తు చేశారు. ఈ దశలో న్యాయమూర్తులు మాట్లాడుతూ పిటిషనర్ తన అభ్యంతరాలను హైకోర్టు ముందు చెప్పుకోవాలని తెలిపారు.
పెట్రోలులో ఇథనాల్ శాతాన్ని ప్రతి పంపుపైనా, రసీదులోనూ ప్రదర్శించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని నరేంద్ర కుమార్ గోస్వామీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏ వాహనానికి ఏ రకమైన పెట్రోలు, ఇథనాల్ మిశ్రమం పని చేస్తుందో చూపే ఒక జాబితాను తయారు చేసేలా కేంద్రానికి, సంబంధితులైన ఇతరులకు ఆదేశాలివ్వాలని కోరిన విషయం తెలిసిందే. ఈ జాబి తాలో తయారీదారు ఎవరు? మోడల్, ఇంజిన్ రకం, త యారైన సంవత్సరం వంటి విషయాలన్నీ పొందుపరిచి.. వెతికేందుకు అనువుగా ఉండేలా సిద్ధం చేయాలని కోరా రు. ఈ20 పెట్రోలును వాడుతున్న వాహనాలపై నిపుణు ల కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని, ఆ వాహనాల మైలేజీ, ఇంజిన్ మన్నిక, నిర్వహణ ఖర్చులు, వారంటీ, బీమా తదితర అంశాల ప్రభావాన్ని కూడా మదింపు చేసి నివేదిక సమర్పించేలా చూడాలని కోరారు.


