నావికాదళ అధ్యక్షుడు అడ్మిరల్ స్వామినాథన్
ఐఎన్‌ఎస్ నిపుణ్... జాతికి అంకితం
ముంబై: ప్రపంచంలో ప్రస్తుతం వ్యూహాత్మక మార్పుల కాలం నడుస్తోందని, సముద్ర మార్గాల్లో ముప్పు పెరుగుతోందని, నౌకాయాన పరిస్థితుల్లోనూ చాలా తేడాలు వస్తున్నాయని భారత నావికాదళ అధ్యక్షుడు అడ్మిరల్ స్వామినాథన్ తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం ఇందుకు ఒక కారణమని చెప్పారు.
సముద్ర గర్భంలో సుమారు 300 మీటర్ల లోతుల్లోనూ పనిచేయగల సరికొత్త జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ నిపుణ’ను సోమవారం జాతికి అంకితం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడ్మిరల్ స్వామినాథన్ మాట్లాడుతూ ముప్పు తీరుతెన్నులు నిరంతరం మారిపోతున్నాయని, కొత్త రకాల సవాళ్లు, సంక్లిష్టతలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. పశ్చిమ ఆసియాలో అస్థిరత నేపథ్యంలో ఆ ప్రాంతంలోని దేశాలు చాలా వేగంగా ఆయుధాలు సమకూర్చుకుంటున్నాయని, చెప్పారు.
ఈ పరిస్థితుల్లో దేశ పశ్చిమ నౌకాదళ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. ‘దేశం ఏ రకమైన ముప్పు ఎదుర్కొంటుందో కచి్చతంగా ఊహించడం ఎల్లప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. కానీ, ముందస్తుగా అంచనాలున్న ముప్పులకు మాత్రం తయారుగా ఉండవచ్చు. అందుకు తగ్గ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు‘ అని ఆయన అన్నారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ పరిధిలో ఉన్న దేశ తీర ప్రాంతం సామర్థ్యాలను పెంచడంలో ఐఎన్‌ఎస్ నిపుణ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
300 మీటర్ల లోతులోనూ...
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్పింగ్ యార్డ్ నిర్మించిన ఐఎన్‌ఎస్ నిపుణ్ 300 మీటర్ల లోతుల్లో జరిపే కార్యకలాపాలకూ దన్నుగా నిలవగలదు. భారతీయ నౌకాదళంలో ఇప్పటివరకూ ఇలాంటి నౌక ఒకటే ఉండగా... నిపుణ్ చేరికతో వీటి సంఖ్య రెండుకు చేరింది. సుమారు 119.4 మీటర్ల పొడవు, 10,500 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. రక్షణ కార్యకలాపాలు వేగంగా నిర్వహించగల సామర్థ్యం దీని సొంతం. విపత్తు సహాయక చర్యలు, మానవతా సాయం చేరవేతలకు కూడా దీనిని వినియోగించవచ్చు.


