ఐటీలో జాబ్స్‌ 1,50,000 | Major companies that have undertaken large-scale recruitment in India | Sakshi
Sakshi News home page

ఐటీలో జాబ్స్‌ 1,50,000

Sep 1 2026 4:45 AM | Updated on Sep 1 2026 4:45 AM

Major companies that have undertaken large-scale recruitment in India

దేశంలో భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్‌ చేపట్టిన దిగ్గజ సంస్థలు

మూడేళ్ల ‘ఫ్రీజ్‌’కు తెరదించుతూ అనుభవజ్ఞులతోపాటు ఫ్రెషర్లకూ ఉద్యోగ అవకాశాలు 

ఏఐ సంబంధ ఉద్యోగాలకు రూ.50 లక్షల దాకా వార్షిక వేతనాలతో ఆఫర్లు 

బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లోనూ కొలువుల జాతర  

బీటెక్‌ సహా బీసీఏ, బీకాం, బీఎస్సీ, ఎమ్మెస్సీ విద్యార్హతలు ఉన్నవారికి అవకాశం 

కొత్త నియామకాలకు అనుగుణంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల నిర్వహణ సేవల విస్తరణ  

నూగూరి మహేందర్‌ 
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఓవైపు ఐటీ రంగంలో లేఆఫ్‌లు పెరుగుతుంటే మరోవైపు దేశంలో మాత్రం ఐటీ దిగ్గజ సంస్థలు ఏఐతోపాటు ఇతర రంగాల్లోనూ కొత్త నియామకాలకు తెరలేపాయి. మూడేళ్లుగా అమలు చేసిన తాత్కాలిక నిషేధాన్ని పక్కనపెట్టి మళ్లీ భారీ నియామకాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఫ్రెషర్లతోపాటు అనుభవజు్ఞలకు కూడా ఉద్యోగాలు ఆఫర్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని ఐటీ మార్కెట్లో కొత్తగా 1.50 లక్షలకుపైగా జాబ్‌ ఓపెనింగ్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా కొలువులకు వార్షిక వేతనం అనుభవం, కంపెనీనిబట్టి రూ. 50 లక్షల వరకు   ఉంటోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినై, యాక్సెంచర్, హెచ్‌సీఎల్‌ టెక్, టెక్‌ మహీంద్రా, డెలాయిట్, జెన్‌ప్యాక్ట్‌ వంటి సంస్థలు ఫ్రెషర్లనూ భారీగా చేర్చుకుంటున్నాయి. వారికి వార్షిక వేతనం రూ. 3.5–10 లక్షల మధ్య ఆఫర్‌ చేస్తున్నాయి. బీఈ, బీటెక్, ఎంసీఏతోపాటు బీసీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, ఎమ్మెస్సీ విద్యార్హతలు ఉన్నవారికీ అవకాశాలు ఇస్తున్నాయి. ఆసక్తికర అంశం ఏమంటే 2024లో చదువు పూర్తి అయిన అభ్యర్థులనూ కంపెనీలు నియమిస్తున్నాయని ఐటీ నిపుణుడు కందుకూరి సురేశ్‌ బాబు ‘సాక్షి’కి తెలిపారు. డేటా అనలిస్ట్‌ పోస్టుకు 0–2 ఏళ్ల అనుభవం ఉన్నవారికి బార్‌క్లేస్‌ సంస్థ రూ. 20 లక్షల వరకూ వార్షిక వేతనం ఆఫర్‌ చేస్తోంది.  

ఒకదాని వెంట ఒకటి.. 
గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, మెటా వంటి బిగ్‌ టెక్, కంజ్యూమర్‌ టెక్‌ సంస్థలు క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ/ఎమ్‌ఎల్‌ డెవలప్‌మెంట్, సెక్యూరిటీ విభాగాల్లో భారీగా నియామకాలు చేపడుతున్నాయి. ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్‌ దిగ్గజాలు యాక్సెంచర్, డెలాయిట్, ఈవై, పీడబ్ల్యూసీ, కేపీఎమ్‌జీ వంటివి క్లౌడ్‌ అడ్వైజరీ, ఎంటర్‌ప్రైజ్‌ ఇంటిగ్రేషన్, సైబర్‌ సెక్యూరిటీ, మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ విభాగాల కోసం దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో దూకుడుగా నియామకాలు జరుపుతున్నాయి. అందుకు అనుగుణంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల నిర్వహణ సేవలను మరింత బలోపేతం చేస్తున్నాయి.  

ఇతర రంగాల్లోనూ.. 
బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో జేపీ మోర్గాన్‌ చేజ్, గోల్డ్‌మన్‌ శాక్స్, హెచ్‌ఎస్‌బీసీ, మోర్గాన్‌ స్టాన్లీ, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్, మాస్టర్‌ కార్డ్‌ తదితర దిగ్గజాలు సైబర్‌ సెక్యూరిటీ, ఫైనాన్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్చర్, రిస్క్‌ అనలిటిక్స్, క్వాంటిటేటివ్‌ ఇంజనీరింగ్, డిజిటల్‌ బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫామ్, కాంప్లయన్స్‌ అనలిటిక్స్‌ విభాగాల్లో రిక్రూట్‌మెంట్‌ చేపట్టాయి. ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో సనోఫి, ఎలీ లిల్లీ, నోవార్టిస్‌ వంటి సంస్థలు క్లినికల్‌ డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత ఔషధ ఆవిష్కరణలు, రెగ్యులేటరీ టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ డేటా ఇంజనీరింగ్, డిజిటల్‌ హెల్త్, క్లినికల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌లను వేగంగా విస్తరిస్తున్నాయి. బోయింగ్, మెర్సిడెస్‌ బెంజ్, బాష్, సీమెన్స్, కాటర్‌పిల్లర్‌ తదితర సంస్థలు ఫ్లైట్‌ సిస్టమ్స్‌ సాఫ్ట్‌వేర్, ఏవియానిక్స్, స్ట్రక్చరల్‌ అనాలిసిస్‌ విభాగాలపై దృష్టి సారించాయి. అటానమస్‌ వెహికిల్‌ సాఫ్ట్‌వేర్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్, ఐఓటీ ప్లాట్‌ఫామ్‌ల కోసం నిపుణులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఇండ్రస్టియల్‌ ఆటోమేషన్, డిజిటల్‌ ట్విన్‌ టెక్నాలజీ, ఎక్విప్‌మెంట్‌ సిమ్యులేషన్ల కోసం చురుగ్గా ఇంజనీరింగ్‌ నియామకాలు చేపడుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement