ఐటీ కొలువుల్లో 77% లేఆఫ్స్‌ | The impact of AI layoffs has increased significantly in two years | Sakshi
Sakshi News home page

ఐటీ కొలువుల్లో 77% లేఆఫ్స్‌

Aug 31 2026 4:31 AM | Updated on Aug 31 2026 4:31 AM

The impact of AI layoffs has increased significantly in two years

97 వేల మంది ఉద్యోగులపై కృత్రిమ మేధస్సు వేటు 

రెండేళ్లలో గణనీయంగా పెరిగిన ఏఐ లేఆఫ్స్‌ ప్రభావం 

సాంకేతిక ప్రపంచాన్ని వణికిస్తున్న సరికొత్త సంక్షోభం

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్, సాంకేతిక రంగాలు భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ సంస్థల నుంచి చిన్న స్టార్టప్‌ల వరకు వేలాది మంది ఉద్యోగులపై వేటు పడుతోంది. గతంలో ఈ తొలగింపులకు ఆర్థిక మాంద్యం, అధిక వడ్డీ రేట్లు, కోవిడ్‌ అనంతర పరిణామాలు కారణమవగా ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్‌ సాంకేతికతలే దీనికి ప్రధాన కారణాలవుతున్నాయి. 

ఏఐ వల్ల ఉద్యోగ కోతలపై అంతర్జాతీయ గణాంకాలు ఇలా.. 
» ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 281 ఐటీ కంపెనీల్లో 1,27,180 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో ఏఐ, ఆటోమేషన్‌ వల్ల 111 కంపెనీలు 97,473 మందిని విధుల్లోంచి తొలగించాయి. మొత్తం ఉద్యోగాల తొలగింపుల్లో కేవలం ఏఐ, ఆటోమేషన్‌ వల్ల జరిగిన లేఆఫ్స్‌ వాటా 77 శాతానికి చేరింది. 

» గతేడాది 278 ఐటీ సంస్థలు 1,22,606 మందిని ఇంటిబాట పట్టించాయి. ఇందులో 54 కంపెనీలు 35,534 మంది ఉద్యోగులను ఏఐ కారణంగా తీసివేశాయి. మొత్తం లేఆఫ్స్‌లో కృత్రిమ మేధస్సు వాటా 29 శాతం మాత్రమే. 

» 2024లో 551 కంపెనీల్లో నమోదైన 1,52,922 లేఆఫ్స్‌లో ఏఐ వాటా 7 శాతమే. 4 కంపెనీలు 10,030 మందిని తొలగించాయి. దీన్ని బట్టి చూస్తే కంపెనీలు ఎంత వేగంగా మానవ వనరుల స్థానంలో కొత్త సాంకేతికతను ప్రవేశపెడుతున్నాయో అర్థం అవుతోంది. 

ఖర్చులు తగ్గించుకునే వ్యూహంలో.. 
కరోనా వ్యాప్తి సమయంలో కంపెనీలు అవసరానికి మించి ఉద్యోగులను నియమించుకున్నాయి. కానీ ప్రస్తుతం తమ వ్యూహాలను మార్చుకుంటూ సంప్రదాయ మానవ వనరుల కంటే ఏఐ ప్రాజెక్టులపై ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాయి. చాట్‌–జీపీటీ, క్లాడ్, జెమినై వంటి అధునాతన జనరేటివ్‌ ఏఐ సాధనాలు అందుబాటులోకి రావడంతో గతంలో పదుల సంఖ్యలో ఉద్యోగులు చేసే పనులను క్షణాల్లో పూర్తి చేస్తున్నాయి. దీనివల్ల కంపెనీల నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతోంది. ఫలితంగా మానవ వనరుల అవసరం పరిమితమవుతోంది. 

ప్రభావితమవుతున్న విభాగాలు ఇవీ.. 
» కస్టమర్‌ సపోర్ట్, చాట్‌ సర్వీసెస్‌: ఏఐ చాట్‌బాట్స్‌ 24 గంటలూ అందుబాటులో ఉంటూ వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరిస్తుండటంతో ఈ విభాగంలో ఉద్యోగాలు వేగంగా తగ్గుతున్నాయి. 
» ప్రాథమిక కోడింగ్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌: జూనియర్‌ డెవలపర్లు చేసే ప్రాథమిక కోడింగ్‌ పనులను ఏఐ అసిస్టెంట్లు సులభంగా చేస్తుండటంతో ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ తగ్గింది. 
» కంటెంట్‌ రైటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్‌: టెక్స్టŠ, ఇమేజెస్, మార్కెటింగ్‌ కాపీలను ఏఐ క్షణాల్లో సృష్టిస్తుండటంతో ఈ విభాగాలపై ప్రభావం పడింది. 
» హ్యూమన్‌ రిసోర్సెస్‌: అభ్యర్థుల రెజ్యూమే స్క్రీనింగ్, ప్రాథమిక ఎంపిక ప్రక్రియలు ఆటోమేట్‌ కావడం వల్ల ఈ విభాగంలోనూ కోతలు ఉన్నాయి. 

పెరుగుతున్న కొత్త అవకాశాలు 
ఏఐ సాంకేతికత సరికొత్త ఉద్యోగ విపణిని కూడా సృష్టిస్తోంది. మార్కెట్లో సాధారణ సాంకేతిక నిపుణుల కంటే ఏఐ స్పెషలిస్ట్‌లకు డిమాండ్‌ పెరిగింది. ఏఐ మోడల్స్‌ నిర్మించే డేటా సైంటిస్టులు, మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్లు, ఏఐ నుంచి సరైన ఫలితాలను రాబట్టే ప్రాంప్ట్‌ ఇంజనీర్ల కోసం కంపెనీలు భారీ ప్యాకేజీలను ఆఫర్‌ చేస్తున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విభాగాల్లోనూ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇందుకోసం ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మానవ నైపుణ్యాలకు ఏఐ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని స్పష్టం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement