ఎదగని మొక్క.. నిలవని పూత | Adverse conditions for cotton and other crops depending on the region | Sakshi
Sakshi News home page

ఎదగని మొక్క.. నిలవని పూత

Aug 31 2026 4:22 AM | Updated on Aug 31 2026 4:22 AM

Adverse conditions for cotton and other crops depending on the region

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎల్‌నినో, వర్షాభావంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి మొక్కలు ఎదిగీ ఎదగక చేన్లలోనే వడలిపోతున్నాయి. విత్తనాలు నాటిన నుంచి కీలక దశల వరకు అనుకూల వర్షాలు పడకపోవడంతో రైతుల ఆశలు కళ్ల ముందే వాడిపోతున్నాయి. పెట్టుబడి పక్కనపెడితే కనీసం కూలీల ఖర్చులు వచ్చే పరిస్థితి లేదని పత్తి రైతులు బోరున విలపిస్తున్నారు. 

వాతావరణం అనుకూలిస్తే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఆగస్టు చివరి వరకు పత్తి మొక్క కనీసం నాలుగు నుంచి ఐదు ఫీట్ల ఎత్తులో పెరగాలి. చెట్టుకు కనీసం 50 నుంచి 60 కాయలు పడాలి. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో రెండు నుంచి మూడు ఫీట్ల్ల ఎత్తులో మాత్రమే పెరిగాయి. అంతేకాక చెట్టుకు కనీసం 10 నుంచి 20 కాయలు కూడా లేని పరిస్థితి ఉంది. 

ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో.. 
రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వాతావరణ మార్పులు భిన్నంగా ఉన్నాయి. అంతటా లోటు వర్షపాతం నమోదైనప్పటికీ.. ప్రాంతాలను బట్టి పత్తి తదితర పంటలకు ప్రతికూల పరిస్థితులు (అవసరమైన సమయంలో వర్షాలు పడకపోవడం) నెలకొన్నాయి. బోర్లు, బావుల కింద నీళ్లు ఉన్న ప్రాంతాల్లో పత్తి పంట కాస్త పరవాలేదు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో బోర్లు, బావులు ఉన్నప్పటికీ నీరందడం లేదు. 

వర్షాధారంగా సాగు చేసిన పత్తిలో ఎదుగుదల లోపించి.. పూత, కాత నిలవడం లేదు. ఇందుకు ప్రధాన కారణం డ్రెసై్పల్‌ అని వాతావరణ, వ్యవసాయ నిపుణులు అంటున్నారు. వర్షాభావం, ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసంతో వాతావరణంలో తేమ శాతం తగ్గి.. వేడి పెరగడంతో కాయ తొడిగే దశలో మొక్కల ఎదుగుదల లోపించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ డ్రెస్పైల్‌ ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి సుమారు 10 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 

తెగుళ్లు సోకడంతో ఆందోళన 
అధిక ఉష్ణోగ్రతల వల్ల పత్తి పంటలో తెల్ల దోమ, పచ్చ దోమ, రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగింది. వీటివల్ల ఆకులు పండిపోతున్నాయి. కాయలు రాలిపోవడం, పగిలిపోవడం జరుగుతోంది. జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో తెగుళ్ల ప్రభావం అధికంగా ఉండగా.. దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు పర్యాయాలు విత్తనాలు పెట్టి.. నీటి కోసం అష్టకష్టాలు పడి రూ.లక్షలు ఖర్చు చేశామని.. ఇంకా పెట్టుబడి పెడితే భారీగా నష్టపోయే అవకాశం ఉందని పలువురు రైతులు సాగుపై సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. 

తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలి.. 
ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి పత్తి పంటను కాపాడుకునేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. చేన్లలో ఉన్న తేమ ఆవిరి కాకుండా ఉండేందుకు గడ్డి, చెత్త లేదా పొట్టుతో పత్తి సాళ్ల మధ్య కప్పి (మల్చింగ్‌) ఉంచాలి. తేమ సంరక్షణతోపాటు నీటి ఎద్దడి వల్ల పూత రాలిపోకుండా 13–0–45 (పొటాíÙయం నైట్రేట్‌) పది గ్రాములు లేదా యూరియా 20 గ్రాములు లీటర్‌ నీటికి కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. బోర్లు, బావులు ఉన్న రైతులు కాల్వల ద్వారా నీటిని వృథా చేయకుండా డ్రిప్‌/ స్ప్రింక్లర్ల ద్వారా తడులు ఇవ్వాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా పాలెంలోని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్‌ సైంటిస్ట్, హెడ్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ ఒంగోలు శైల, జోగుళాంబ జిల్లా వ్యవసాయాధికారి వీరప్ప సూచించారు. 

డ్రెస్పైల్‌ తీవ్ర ప్రభావ చూపిస్తోంది..
నేను లాండా సాంగ్విలో 16 ఎకరాలు కౌలుకు తీసుకొని ఎనిమిది ఎకరాల్లో పత్తి, మిగిలిన ఎనిమిది ఎకరాల్లో సోయా పంట సాగు చేస్తున్నాను. కౌలు కోసం రూ.3.20 లక్షలు వెచ్చించాను. సాగుకు ఇప్పటి వరకు రూ.3.50 లక్షల పెట్టుబడి పెట్టాను. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒకటే పెద్ద వర్షం పడింది.పంట వ్యవధి కాలంలో ఎక్కువ రోజులు వర్షం కురవలేదు. ఈ డ్రెస్పైల్‌ పంటపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈపాటికి పూత, కాత దశలో ఉండాల్సిన పంట ఇంకా ఆరంభ దశలోనే ఉంది. మొక్కలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. దిగుబడి ఆశలు కనిపించడం లేదు.  – రాసంవార్‌ మహేందర్, రైతు, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement