తెలంగాణలో సమగ్ర భూపరిపాలనకు క్షేత్రస్థాయి పర్యవేక్షణే కీలకం
భూసమస్యల పరిష్కారానికి త్రిముఖ వ్యూహమే మార్గం
కంప్యూటర్ భూ రికార్డులను ఏటా ప్రింట్ తీయాలి... ప్రతి రైతుకు ఆ ప్రింట్లు ఇవ్వాలి
నిషేధిత జాబితా తయారీ, సవరణలకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలివ్వాలి
అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కుల కల్పన అసాధ్యమేమీ కాదు
గ్రామ రెవెన్యూ కోర్టులు నిర్వహిస్తేనే పాసు పుస్తకాల్లోని తప్పులు పోతాయి
భూముల రీసర్వే కోసం సర్వే చట్టంలో మార్పులు చేయాలి
‘సాక్షి’ఇంటర్వ్యూలో భూ చట్టాల నిపుణుడు ఎం. సునీల్‌కుమార్
సాక్షి, హైదరాబాద్ : ‘సమగ్ర భూపరిపాలన జరగాలంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కీలకం. అందులో భాగంగా తెలంగాణలోని ప్రతి ఊరికో సర్వేయర్‌తోపాటు రెవెన్యూ అధికారి ఉండాలి’అని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.సునీల్‌కుమార్ అంటున్నారు. భూమి హక్కుల కల్పనతోపాటు వాటి భద్రత, నిర్వహణకు స్పష్టత, సమగ్రత, చిత్తశుద్ధి అనే త్రిముఖ వ్యూహం ఉండాలని చెబుతున్నారు. ఏటా కంప్యూటర్ భూరికార్డులను ప్రింట్ తీసి పెట్టాలంటున్న సునీల్‌కుమార్.. గ్రామస్థాయిలో రెవెన్యూ కోర్టులు నిర్వహించాలని కూడా అంటున్నారు.
నిషేధిత (22ఏ) జాబితా సమస్యల పరిష్కారానికి గ్రామసభల ద్వారా అభ్యంతరాలు స్వీకరించాలని, ఈ జాబితా రూపకల్పనతోపాటు సవరణలకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో పలు అంశాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలివి...!
భూమి ఉంది.. పాసు పుస్తకం లేదు.. ఎలా?
భూమి ఉండి పట్టా లేకపోతే అన్నీ చిక్కులే. రైతు భరోసా రాదు. యూరియా బస్తా దొరకదు. పంట రుణాలు రావు. పండించిన పంటలు అమ్ముకోవడానికి కూడా వీలు పడదు. 2025లో వచ్చిన భూభారతి చట్టంలోని సెక్షన్ 4 (6) ప్రకారం భూమి ఉండి పట్టా రాకపోతే ఆర్డీఓ లేదంటే కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. సెక్షన్ 6 ద్వారా సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశముంది. ఈ రెండు సెక్షన్లు అమలు జరిగితే ప్రతి భూకమతానికి పాసు పుస్తకాలు వస్తాయి.
భూముల రీ సర్వే సాధ్యమేనా?
సాధ్యమే. ఇప్పటికే మన రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో పైలెట్ పద్ధతిన రీసర్వే జరుగుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతోపాటు ప్రజల భాగస్వామ్యం ఇందులో ఉండాలి. సర్వే చట్టంలో అవసరమైన మార్పులు చేసుకోవాలి.
పోడు సాగు, పోడు పట్టాల గురించి?
అటవీ హక్కుల చట్టం–2006 ప్రకారం పోడు సాగు చేస్తున్న వారికి హక్కు పత్రాలివ్వాల్సిందే. 2008–10, 2020–23 మధ్య కాలంలో ఈ ప్రక్రియ మన రాష్ట్రంలో జరిగింది. దాదాపు 7 లక్షల ఎకరాలకు పైగా అటవీ భూమిపై 2.5 లక్షల మంది గిరిజనులకు ఈ పట్టాలు ఇచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా పోడు పత్రాలు రావాల్సిన వారున్నారు. హక్కు పత్రాలొచ్చినా వాటిలోని తప్పుల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి పాలకుల చిత్తశుద్ధి మాత్రమే ప్రధానం.
అసైన్డ్ భూములకు సర్వ హక్కులివ్వడం అసలు జరిగేదేనా?
తెలంగాణలో 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. వీటిపై సంపూర్ణ హక్కులు కల్పించాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. కానీ 1977 పీఓటీ చట్టం ప్రకారం ఈ భూములు అమ్ముకోకూడదు. ఇప్పుడు ఈ చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. అధికారంలోకి వస్తే చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అయితే, ఈ చట్ట సవరణ అసాధ్యమేమీ కాదు కానీ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఏజెన్సీ ప్రాంతంలో భూచట్టాల అమలు ఎలా ఉంది?
భూ మారి్పడి నియంత్రణ (ఎల్‌టీఆర్) చట్టం తెలంగాణలో ఆశించిన మేరకు లేదనే చెప్పాలి. అయితే, ఈ చట్టాన్నే సవరించాలన్న కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. గిరిజన భూహక్కుల భద్రత, ఏజెన్సీ ప్రాంతాల్లో భూచట్టాల సమగ్ర అమలుకు అటవీ శాఖతో వివాదాలున్న భూముల కోసం జాయింట్ సర్వే నిర్వహించాలి. డీమ్డ్ ఫారెస్ట్ భూములపై హక్కులు నిర్ధారించాలి. అవసరమైతే ప్రత్యేక కోర్టులు పెట్టాలి.
భూ సేకరణ చట్టం–2016 వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా?
ప్రజా ప్రయోజన కార్యక్రమాల కోసం సేకరించే భూములను ఇచ్చే రైతుల హక్కులు కాపాడడం, వారికి తగినంత పరిహారం ఇవ్వడానికి 2013లో కేంద్రం ఓ చట్టాన్ని తెచ్చింది. ఇందులో భూ నిర్వాసితులకు మేలు చేసే అంశాలున్నాయి. కానీ ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2016లో సవరించింది. తద్వారా భూ నిర్వాసితులకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ చట్టాన్ని పునః సమీక్ష చేయాలి. అసైన్డ్ భూములకు కూడా పట్టాభూములతో సమానంగా పరిహారం ఇవ్వడం, కేవలం నష్ట పరిహారానికే పరిమితం కాకుండా పునరావాస ప్యాకేజీ కూడా సక్రమంగా అందేలా చూడాలి.
తెలంగాణలో అసలు అటవీ భూముల లెక్కలున్నాయా?
ఉన్నాయి... కానీ ఆ లెక్కల్లోనే సందేహాలు కూడా ఉన్నాయి. అటవీ శాఖ లెక్కల ప్రకారం వారి భూమి 68 లక్షల ఎకరాలు. కానీ రెవెన్యూ లెక్కల ప్రకారం 43 లక్షల ఎకరాలే ఉంది. ఈ గందరగోళం చాలా తీవ్రమైనది. ఈ రెండు శాఖల మధ్య సరిహద్దు వివాదాలున్న భూమి లక్షల ఎకరాల్లో ఉంది. ఫారెస్ట్ సెటిల్‌మెంట్ కాని భూమి కూడా పెద్ద మొత్తంలోనే ఉంది. ఈ రెండు సమస్యలు తక్షణం పరిష్కారం కావాలి.
రాష్ట్రంలో భూపరిపాలన అవసరాలకు తగినట్టు ఉందా?
లేదనే చెప్పాలి. ఊరికో రెవెన్యూ అధికారి, ఒక సర్వేయర్ ఉంటే భూపరిపాలనను సక్రమంగా నిర్వహించుకోవచ్చు. భూమి సమస్యల పరిష్కారానికి జిల్లాకో ట్రిబ్యునల్ ఏర్పాటు అవసరం.
రెవెన్యూ కోడ్ సాధ్యమేనా?
మన రాష్ట్రంలో భూమి చట్టాలు 124 ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇందులో కాలం చెల్లినవి, అవసరానికి పనికిరానివే ఎక్కువ ఉన్నాయి. ఈ చట్టాలన్నింటినీ కలిపి ప్రస్తుత అవసరాలు, పరిస్థితులకు తగ్గట్టు నిబంధనలను రూపొందించుకుంటూ ఒకే భూమి చట్టం (రెవెన్యూ కోడ్) తెస్తే ఇప్పుడున్న గందరగోళాలన్నీ పోతాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆ దిశలో అడుగులు వేశాయి.
ఇటీవల వెలుగులోనికి వచ్చిన నిషేధిత (22ఏ) జాబితా కష్టాలు ఎలా తీరతాయి?
ప్రభుత్వ భూములు, ఆస్తులను రక్షించడానికి వచ్చిన నిబంధన కాస్తా ప్రజలు తమ సొంత ఆస్తులను అనుభవించడంలో చిక్కులు సృష్టిస్తోంది. ఈ జాబితాను 2007లో తొలుత రూపొందించారు. 2020లో ధరణి వచ్చిన సమయంలో కొన్ని మార్పులు జరిగాయి. ఆరు నెలల కింద మరోమారు కొత్త జాబితా వచ్చింది. ఈ జాబితాలో పట్టా భూములు, వ్యక్తిగత ఆస్తులు కూడా చేరాయి. దీంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ ఇబ్బందులు తొలగాలంటే జాబితా తయారీతోపాటు సవరణలపై స్పష్టమైన మార్గదర్శకాలుండాలి. ఈ జాబితా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి. గ్రామాలకు పంపి గ్రామసభల ద్వారా అభ్యంతరాలను తీసుకొని ప్రభుత్వమే ఈ జాబితాను సవరించే ప్రక్రియ చేపట్టాలి.


