నకిలీ ఆఫర్ లెటర్లతో విచ్చలవిడిగా మోసాలు
యూకే, రష్యా, ఇజ్రాయెల్, జపాన్, గల్ఫ్ దేశాల్లో భారీ జీతాలంటూ ట్రాప్
సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ప్రచారం
తూతూమంత్రంగా ఇంటర్వ్యూలతో సెలెక్షన్లు
ఏటా అనధికారికంగా వేలాదిమంది విదేశాలకు పయనం... ఒక్కో బాధితుడి నుంచి రూ.3–8 లక్షల దాకా ముందస్తు వసూళ్లు
అమాయకులు, నిరక్షరాస్యులను నిలువునా ముంచుతున్న నకిలీ ఏజెంట్లు
విదేశాలకు వెళ్లాక పాస్‌పోర్టులు లాక్కొని, చెప్పిన జీతాలు ఇవ్వకుండా మోసగిస్తున్న ఏజెన్సీలు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో లబోదిబోమంటున్న బాధితులు.. అప్పులపాలవుతున్న కుటుంబాలు
ఇండోనేషియాకి‘ఆఫ్‌షోర్’ వర్క్ కింద 3నెలలకోసారి వెళ్లి రావాలని చెప్పారు. ఒక్కొక్కరం అప్పుచేసి రూ. 5.40 లక్షలు కట్టాం. ఆరుగురం మొదట విజిట్ వీసా మీద జకార్తకు వెళ్లి నెల ఉన్నాం. మళ్లీ 45 రోజుల్లో ఎంప్లాయ్‌మెంట్ వీసా ఇస్తామంటే తిరిగొచ్చాం. ఆరునెలలైనా వీసా రాలేదు. అయితే ఈసారి జకార్తకు కాకుండా రూ.లక్ష జీతం వచ్చే ఫిజి వెళ్లాలని చెప్పారు. మొదట ఇద్దరం రూ.50 వేలు తీసుకెళ్లాం. మొదట 15 రోజులు కన్‌స్ట్రక్షన్ కంపెనీలో చేశాం. మేము ఈ పనికోసం రాలేదని వేర్‌హౌసింగ్, సూపర్‌మార్కెట్, స్టోర్లు వంటి వాటిలో పని అంటే వచ్చామని చెబితే.. ఆ తర్వాత నెల రోజులు సెలవు లేకుండా రూ.34వేల జీతంతో రెస్టారెంట్లో వెయిటర్, హౌస్‌కీపింగ్ పనులు చేయించారు. 4 నెలల విజిట్‌వీసా ముగిశాక 29 రోజులు అదనంగా ఉండాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణం టికెట్.. అన్నీ కలిపి ఒక్కొక్కరికి రూ.7 లక్షలకుపైగా ఖర్చయింది. డబ్బులివ్వాలని అడిగితే బెదిరిస్తున్నారు. 
– తంగళ్లపల్లి రమేశ్, తంగళ్లపల్లి నరేశ్, కోరుట్ల జిల్లా
(ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి కె.రాహుల్)
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విదేశీ ఉపాధి పేరుతో మోసాలు ఉధృతంగా సాగుతున్నాయి. అమాయకులు, నిరక్షరాస్యులకు ఎరవేసి అప్పుల పాలు చేసి గుల్లచేస్తున్నాయి. యూకే, కెనడా, రష్యా, ఇజ్రాయెల్, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, గల్ఫ్ తదితర దేశాల్లో పెద్దమొత్తంలో జీతాలు అంటూ జరుగుతున్న మోసాలకు అంతే ఉండటం లేదు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్, యూట్యూబ్ ద్వారా నకిలీ కన్సల్టెన్సీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నకిలీ ఆఫర్ లెటర్లు, విమాన టికెట్లు ఇచ్చి ఒక్కో బాధితుడి నుంచి రూ. 3–8 లక్షల దాకా ముందస్తుగా వసూళ్లు చేస్తున్నాయి. వాట్సాప్/టెలిగ్రామ్ ద్వారా నకిలీ ఆడియో/వీడియో కాల్స్ ద్వారా తూతూమంత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహించి సెలెక్ట్ అయినట్లు నమ్మిస్తున్నాయి. తీరా విదేశాలకు వెళ్లాక పాస్‌పోర్టులు లాక్కోవడం, చెప్పిన జీతాలు ఇవ్వకపోవడం, కాంట్రాక్టులు మార్చడం, పని ఒత్తిడికి గురి చేయడం వంటి వాటికి పాల్పడుతున్నాయి. లక్షలు వసూలు చేసి, ఆ తర్వాత మోసగాళ్లు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. కేవలం తక్కువ చదువుకున్నవారే కాకుండా, నిరుద్యోగంతో బాధపడుతున్న ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర నిపుణులు సైతం నకిలీ కన్సల్టెన్సీల చేతిలో మోసపోతున్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు కుమ్మక్కు
ఉత్తర తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల నుంచి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. జగిత్యాల జిల్లా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే రష్యాకు వెళ్లేందుకు దాదాపు 1,200 మంది డబ్బులిచ్చి మోసపోయినట్టు తెలుస్తోంది. ఫిజికి ఆరుగురు వెళ్లగా, మరో 16 మంది దాకా ఇదేవిధంగా మోసపోయినట్టు తెలుస్తోంది. కాంట్రాక్ట్, కంపెనీ ఆఫర్ లెటర్, వర్క్‌వీసా, పకడ్బందీ అగ్రిమెంట్ వంటివేమీ లేకుండా, డబ్బు తీసుకున్న ఆధారాలు దొరకకుండా ఏజెంట్లు బోల్తా కొట్టిస్తున్నారు. ఈ నకిలీ ఏజెంట్లతో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారని బాధితులు వాపోతున్నారు. అందువల్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం అనేది కత్తి మీద సాములా మారుతోందని అంటున్నారు. ఏజెన్సీ ఆఫీసుల్లో అమ్మాయిలను రిసెప్షనిస్ట్‌లుగా పెట్టడంతో... మోసపోయిన వారు తమ డబ్బు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తే అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. దీంతో చాలామంది బాధితులు మిన్నకుండిపోతున్నారని తెలుస్తోంది. కుటుంబసభ్యుల ప్రాణాలకు ముప్పు కారణంగా ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు.
ఎడారిలో వదిలేస్తున్నారు...
చాలా మందిని విజిట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు తీసుకెళ్లి అక్కడ ఉద్యోగం ఇప్పించకుండా ఎడారిలో వదిలేస్తున్నారు. దీనివల్ల కొందరు జైలు పాలు కూడా అవుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలంటూ నమ్మించి, కొంతమందిని ఆర్మీ సహాయకులుగా లేదా రష్యా సైన్యంలో బలవంతంగా చేరి్పంచిన భయంకరమైన ఉదంతాలు కూడా వెలుగుచూశాయి. ఇటీవల విదేశాంగ శాఖ పార్లమెంట్‌లో వెల్లడించిన గణాంకాల ప్రకారం... తెలంగాణలో వందలాది బాధితులు మోసపోయారు.
పాస్‌పోర్టులు లాక్కోని సైబర్‌నేరాలు
కంబోడియా, మయన్మార్, వియత్నాం, లావోస్ వంటి ఆగ్నేయాసియా దేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలంటూ తీసుకెళ్లి, అక్కడ పాస్‌పోర్టులు లాక్కుని బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నట్టు జగిత్యాల, పరిసర ప్రాంతాల పోలీసుల విచారణలో తేలింది. ఈ మోసాలను అరికట్టడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, స్థానిక పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో నకిలీ కన్సల్టెన్సీలపై దాడులు చేసి వందలాది పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే, మాల్టా వంటి దేశాల్లో ఉద్యోగాలంటూ రూ.5–8 లక్షల వరకు వసూలు చేసిన పెద్ద రాకెట్లను పోలీసులు చేధించారు. ఇటీవల దుబాయ్ పోలీసులు కూడా తెలంగాణ యువత నకిలీ వీసాలు, నకిలీ ఆఫర్ లెటర్లు చూసి మోసపోవద్దని, సోషల్ మీడియా ప్రకటనలను నమ్మవద్దని ప్రత్యేకంగా హెచ్చరించడం గమనార్హం. అయినప్పటికీ.. కొత్తకొత్త రూపాల్లో మోసం చేసేందుకు నకిలీ ఏజెన్సీలు, ఏజెంట్లు వెనక్కు తగ్గడం లేదు.
‘టామ్‌కామ్’ ద్వారా సురక్షితంగా...
విదేశాంగ శాఖ పరిధిలోని ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ గుర్తింపు లేదా లైసెన్స్ ఉన్న ఏజెన్సీల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నడిపే టామ్‌కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్) సంస్థ ద్వారా సురక్షితమైన విదేశీ ఉద్యోగాల ప్రకటనలను పరిశీలించవచ్చు. టామ్‌కామ్ ద్వారా గమ్యస్థాన దేశాల ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనివల్ల మోసపోయిన వారికి సత్వర సహాయం అందే అవకాశం ఉంటుంది. విజిట్ వీసాపై వెళ్లి విదేశాల్లో ఉద్యోగం చేయడం చట్టవిరుద్ధం, కాబట్టి తప్పనిసరిగా వర్క్ వీసా ఉంటేనే వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పూర్తిగా వెరిఫై చేసుకోవాలి
విదేశాల్లో ఉద్యోగం కోసం పోవాలనుకునేవాళ్లు ముందు ఆ అవకాశం నిజమైనదా, కాదా అన్నది బాగా తెలుసుకోవాలి. ఎవరికైనా డబ్బులు కట్టే ముందు ఆ కంపెనీ ఏంటి, ఉద్యోగం ఏంటి, ప్రాసెస్ ఏంటి అన్నది పూర్తిగా వెరిఫై చేసుకోవాలి. సాధారణంగా విదేశీ ఉద్యోగ ప్రాసెస్‌కు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. వెంటనే పంపిస్తాం, చాలా త్వరగా ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మొద్దు. అక్కడి భాష నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వరకు పెరుగుతాయి.
-మేనేని రోహిత్‌రావు, సీఈవో, కెరీర్ కన్సల్ట్స్
కేస్ స్టడీస్...
=మంచి జీతంతో ఉద్యోగం ఇప్పిస్తామని ఆశపెడితే ఒమన్‌కి వెళ్లాను. ఇక్కడ పెయింటింగ్ పనిచేసి రోజుకు రూ.వెయ్యి సంపాదించేవాడిని. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలనే ఆలోచనతో ఎక్కువ జీతం వస్తుందనే ఆశతో వెళితే మొదటికే మోసం వచ్చింది. రూ.3 లక్షలు నగదు ఇచ్చాను. ఎలాంటి రశీదు ఇవ్వలేదు. కంపెనీలో వాచ్‌మన్ లేదా లేబర్ పని అని ఏవేవో పనులు చెప్పారు. అక్కడి భాష రాక 16 రోజుల పాటు దుర్భరపరిస్థితులు అనుభవించాను. రోజుకు ఒక బన్నుతో కడుపు నింపుకోవాల్సి వచ్చింది. బయటి వాళ్లతో మాట్లాడేందుకు కనీసం ఫోన్ లేదా ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. వీసా కాన్సలేషన్‌కు కూడా నా భార్య అప్పు చేసి డబ్బులు కట్టింది. తిరిగొచ్చాక ట్రావెల్ ఏజెన్సీలో డబ్బు వాపస్ అడిగితే బయటకు గెంటారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు.
-కల్లెడ లింగయ్య, పోరండ్ల, జగిత్యాల జిల్లా
⇒ మా ఊర్లో ఏజెంట్.. రష్యాలో జాబులు ఇస్తానని నమ్మబలికాడు. నాతోపాటు మరో ఇద్దరు ఖర్చుల కింద రూ.50వేలు ఇచ్చాం. ఏడాది దాటుతోంది. ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేస్తున్నాడు. మాలాంటి అమాయకులను మోసం చేస్తున్న అలాంటి ఏజెంట్లపై గట్టి చర్యలు తీసుకోవాలి.
-పరాంకుశం ప్రమోద్, మెట్‌పల్లి
అనధికారికంగా 1,54,000 మంది..
⇒ ఒక అంచనా ప్రకారం... ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ కలిపి 150 విదేశీ కార్మిక ఉపాధి ఏజెన్సీలు ఉంటే ఒక్క ఉమ్మడి కరీంనగర్‌లోనే 80కిపైగా ఉన్నాయి.
⇒ కేంద్ర ప్రభుత్వ ఈ–మైగ్రేట్ పోర్టల్ గణాంకాల ప్రకారం ‘ఎమిగ్రేషన్ క్లియ రెన్స్’ పొంది, లైసెన్స్‌డ్ ఏజెన్సీల ద్వారా తెలంగాణ నుంచి వెళ్లే కార్మికుల సంఖ్య ఏటా 5,000 నుంచి 12,000 వరకు ఉంటుంది. గత ఐదేళ్లలో మొత్తం 45,213 మంది అధికారికంగా వెళ్లారు.
⇒ ప్రభుత్వ లెక్కల్లో కేవలం వర్క్ వీసాలపై అధికారికంగా వెళ్లేవారే ఉంటారు. కానీ, అంతర్జాతీయ వలసల సంస్థ వంటి సంస్థల సర్వేల ప్రకారం... కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 1,54,000 మంది గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. వీరిలో చాలా మంది విజిట్ వీసాలపై వెళ్లి, అక్కడ వర్క్ వీసాలుగా మార్చుకుంటారు. వీరు ప్రభుత్వ రికార్డుల్లో నమోదుకారు.
⇒ తెలంగాణ కార్మికులు ఎక్కువగా యూఏఈ (ఐదేళ్లలో 18,585 మంది)కి, సౌదీ అరేబియా (ఐదేళ్లలో 11,081 మంది)కు వెళ్తుంటారు.


