ఆర్టీసీ నిలువు దోపిడీ
భిక్కనూరు: రాఖీ పండుగ స్పెషల్ బస్సుల పేరిట ఆర్టీసీ అదనపు చార్జీలతో ప్రయాణికులకు మోత మోగుతోంది. ఎనిమిది కిలోమీటర్ల దూరానికి రూ.30 టికెట్ ఉండగా, రూ.90 చార్జీ వసూలు చేశారు. కామారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. మెదక్ జిల్లా రామాయంపేట నుంచి భిక్కనూరుకు సరిగ్గా ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది. భిక్కనూరుకు చెందిన ఎనిమిది మంది ప్రయాణికులు రామాయంపేట బస్టాండ్‌లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డిపోకు చెందిన బస్సు ఎక్కారు.
చాలామంది ప్రయాణికులు ఉండటంతో కండక్టర్ టిక్కెట్లు ఇస్తూ వచ్చేసరికి బస్సు బస్వాపూర్ గ్రామం వద్దకు చేరుకుంది. భిక్కనూరుకు టికెట్ ఇవ్వాలని అడగ్గా ఒక్కొక్కరికి రూ.90 చెల్లించాలని కండక్టర్ చెప్పడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. అధిక చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారని కండక్టర్‌ను ప్రశ్నించగా.. ప్రత్యేక రోజుల్లో ఆర్టీసీకి చార్జీలను పెంచుకునే అవకాశం ఉందని సమాధానం ఇచ్చారు. దీంతో చేసేదేమీ లేక ప్రయాణికులు ఒక్కొక్కరూ రూ.90 చెల్లించి టికెట్ తీసుకున్నారు. ఆర్టీసీ ఇలా దోపిడీ చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు.


