చెన్నై: తమిళనాడులోని ప్రముఖ ఆలయాల్లో ఇకపై సెల్ఫోన్ మోగదు.. కెమెరా క్లిక్మనదు. ఆలయాల పవిత్రత, ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు ఆలయ ప్రాంగణాల్లోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై నిషేధం అమల్లోకి వచ్చింది. నేటి (సెప్టెంబర్ 1) నుంచి రాష్ట్రంలో తొలి దశలో 52 ప్రధాన ఆలయాల్లో ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.
ఆలయాల్లో సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరణకు అడ్డుకట్ట వేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. దేవతామూర్తులతో పాటు వీఐపీలు, ప్రముఖులు, సినీ తారల ఫొటోలు, వీడియోలు తీయడానికీ అనుమతి ఉండదు. భక్తులు తమ మొబైల్ ఫోన్లను ఆలయాల ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన డిపాజిట్ కేంద్రాల్లో భద్రపరచుకోవాలి. ఒక్కో ఫోన్కు రూ.5 ఫీజు వసూలు చేసి రసీదు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. దర్శనం అనంతరం రసీదు చూపించి తమ ఫోన్లను తిరిగి తీసుకోవచ్చు.
ఈ నిర్ణయానికి 2022లో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా ఆధారంగా ఉన్నాయి. ఆలయాల పవిత్రత, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణాల్లో మొబైల్ ఫోన్లు, కెమెరాల వినియోగాన్ని నియంత్రించవచ్చని కోర్టు పేర్కొంది. దీంతో ఇకపై తమిళనాడులోని ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులు ‘ముందు దర్శనం.. ఆ తర్వాతే ఫోన్’ అన్న నిబంధనను పాటించాల్సి ఉంటుంది.


