● కానీ మరణాలు పెరిగాయి ● సర్వేలో వెల్లడి
కొరుక్కుపేట: 2026 మొదటి అర్ధభాగంలో చైన్నెలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. అయితే మరణాలు మాత్రం పెరిగినట్లు సర్వేలో తేలింది. గత ఏడాదితో పోలిస్తే మొత్తం సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ, ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఆందోళనకరంగా పెరిగిందని గణాంకాలు చూపిస్తున్నాయి. వివరాలు.. 2025 జనవరి నుండి జూన్ వరకు మొదటి అర్ధభాగంలో 2,051 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా, 2026లో ఇదే కాలంలో ఈ సంఖ్య 2.68 శాతం తగ్గి 1,996కి చేరింది. ప్రమాదాల సంఖ్య తగ్గినప్పటికీ, వాటి తీవ్రత పెరగడం వల్ల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాది 237గా ఉన్న మరణాల సంఖ్య, ఈ ఏడాది 8.44 శాతం పెరిగి 257కి చేరింది. ఈ వివరాలు తమిళనాడులోని సాధారణ ప్రమాద పరిస్థితికి భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్త గణాంకాల ప్రకారం, తమిళనాడులో మొత్తం ప్రమాదాల సంఖ్య 5.86 శాతం పెరిగి 37,292కి చేరింది.అయితే, రాష్ట్ర స్థాయిలో మరణాల సంఖ్య 0.39 శాతం స్వల్పంగా తగ్గి 9,461కి చేరింది. తర్వాతి అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలతో పోల్చినప్పుడు, అత్యధిక ప్రమాదాలు, మరణాలతో చైన్నె మెట్రోపాలిటన్ ప్రాంతం మొదటి స్థానంలో ఉంది. తాంబరం పోలీస్ స్టేషన్ పరిధిలో 1,027 ప్రమాదాల్లో 256 మంది మరణించగా, ఆవడి పోలీస్ స్టేషన్ పరిధిలో 729 ప్రమాదాల్లో 118 మంది మరణించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా వారీగా చూస్తే, 2,078 ప్రమాదాలు , 494 మరణాలతో కోయంబత్తూరు జిల్లా రాష్ట్రంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన జిల్లాగా ఉందని పేర్కొన్నారు.
డీఎంకేకు
తోప్పు వెంకటాచలం బై..బై
సాక్షి, చైన్నె:డీఎంకే ప్రాథమిక సభ్యత్వాని కి తోపు వెంకటాచలం రాజీనామా చేశారు. తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో అన్న వివరాలను సీనియర్ రాజకీయ నాయుడు, మాజీ ఎమ్మెల్యే తోప్పు వెంకటాచలం మీడియాకు వివరించారు. ఈరోడ్ జిల్లా పెరుందురైలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నాపై నమ్మకంతో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ నన్ను జిల్లా పార్టీ ఇన్‌చార్జిగా నియమించడమే కాకుండా, పెరుందురై శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకు ధన్యవాదాలు.’’ అని పేర్కొన్నారు. అయితే, తాను జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో, అలాగే అసెంబ్లీ ఎన్నికలలోతనకు, తన మద్దతుదారులకు ఎదురైన చేదు అనుభవాలు మనసుపై తీవ్రమైన ప్రభావం చూపాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై డీఎంకేలో ప్రయాణాన్ని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడినందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. వేరే ఏ ఇతర పార్టీలోనూ చేరే ఆలోచన తనకు ప్రస్తుతానికి లేదన్నారు. తన మద్దతుదారులు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణపై తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు.
రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థి!
సాక్షి, చైన్నె: జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మాత్రమే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని, తమిళనాడు సీఎం విజయ్‌కి అలాంటి ఆలోచన ఊహల్లో కూడా ఉండదని ఎండీఎంకే నేత వైగో వ్యాఖ్యానించారు. ఇకపై మంత్రులు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సీఎం విజయ్ చూసుకోవాలని సూచించారు. సోమవారం తిరునెల్వేలిలో వైగో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడులో ఒక భారీ ప్రభుత్వ మార్పు వచ్చిందని, టీవీకే ప్రభుత్వాన్ని సీఎం విజయ్ అవి నీతి రహితంగా నడిపిస్తున్నారని కొనియాడారు. గతంలో ప్రతి శాఖలో లంచాలు ఇస్తేనే పనులు జరిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ప్రజలు ఏ ప్రభు త్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కమీషన్లు లేకుండా నేరుగా పాల న సాగుతోందన్నారు. 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ ప్రభుత్వానికి తాను 100కి 80 మార్కులు ఇస్తున్నానని, అవినీతిని పూర్తిగా నిర్మూలించడం హిమాలయాన్ని కదిలించినంత కష్టమైన పనిగా పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చక్కగా పనిచేస్తున్నట్టు వైగో అభినందించారు.
రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వం:
‘’రాహుల్ గాంధీని ప్రధానిగా అంగీకరించకపోతే రాజీనామా చేస్తాం’’ అని మంత్రి రాజేష్‌కుమార్ చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సీఎం విజయ్ ఊహల్లో కూడా అలాంటి ఆలోచన ఉండదన్నారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని, మంత్రులు బాధ్యతారాహిత్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సీఎం విజయ్ నిరోధించాలని సూచించారు. ఇక, కావేరీ నిర్వహణ బోర్డు తన బాధ్యతను విస్మరించిందని, కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తూ తమిళనాడుకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని, ఈ ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైగో డిమాండ్ చేశారు. కాగా, సీఎం విజయ్ భావి ప్రదాని అంటూ మంత్రులు వ్యాఖ్యల తూటాలను అందుకోవడంతో కాంగ్రెస్ నాయకులు గుర్రు మంటున్న విషయం తెలిసిందే.


