గల్లంతైన తమిళుల కోసం గాలింపు ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన తమిళుల కోసం గాలింపు ముమ్మరం

Sep 1 2026 1:49 AM | Updated on Sep 1 2026 1:49 AM

● కాట్మాండులో ప్రత్యేక అధికారులు ● బాధిత కుటుంబాలు నేపాల్‌ వెళ్లేందుకు అవకాశం

సాక్షి, చైన్నె: నేపాల్‌ వరదల్లో గల్లంతైన తమిళనాడు పర్యాటకుల బంధువులకు సహాయ సహకారాలు అందించేందుకు సీఎం విజయ్‌ ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని కాట్మాండుకు పంపింది. ఈ అధికారులు ప్రస్తుతం కాట్మాండులోనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా, గల్లంతైన వారి కుటుంబాలకు చెందిన వారెవరైనా సహాయక పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లదలచిన పక్షంలో నేపాల్‌కు పంపించేందుకు చర్యలు తీసుకుంటామని, ఖర్చులన్నీ ప్రభుత్వం భరి స్తుందని ప్రకటించారు. నేపాల్‌ వరదలలో తమిళనాడుకు చెందిన పలువురు పర్యాటకులు చిక్కుకుపోయినట్లు, మరికొందరు గల్లంతైనట్లు తొలుత సమాచారం అందిన విషయం తెలిసిందే. దీంతో బాధితులకు తక్షణమే అవసరమైన సహాయం అందించాలని సీఎం విజయ్‌ అధికారులను ఆదేశించారు. తమిళనాడుకు చెందిన 21 మంది పర్యాటకులను సురక్షితంగా రక్షించి, స్వస్థలాలకు తీసుకొచ్చారు. 305 మంది తమిళులు నేపాల్‌కు వెళ్లినట్టు గుర్తించారు. వీరిలో 221 మంది సురక్షితంగా ఉండగా, 84 మంది జాడ కానరాలేదు. బాధితుల వివరాల కోసం నేపాల్‌ పోలీసులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పొందుపరిచారు.

కాట్మాండులో అధికారులు..

బాధితుల కుటుంబ సభ్యులకు నేపాల్‌ ప్రయాణంలో మార్గదర్శనం చేసేందుకు , స్థానిక యంత్రాంగంతో సమన్వయం చేసుకునేందుకు ముగ్గురు అధికారులను నియమించారు. వీరిలో సత్య శివం (9868207259), పి.దినేష్‌ కన్నన్‌(9868530799), ఎస్‌.అజయ్‌ (9868 224049) ఉన్నారు. నేపాల్‌ ప్రభుత్వం, భారత విదే శాంగ మంత్రిత్వ శాఖ, కాట్మాండులోని భారత రాయబార కార్యాలయంతో ఈ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ రెస్క్యూ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

జాడకాన రాక..

నేపాల్‌ వరదల్లో తల్లిదండ్రుల గల్లంతు కావడంతో 3 రోజులు గాలించినా ఆచూకీ దక్కక పోవడంతో తీవ్ర నిరాశతో ఈరోడ్‌ వారి కుమారుడు తిరిగి వచ్చేశాడు. ఈరోడ్‌ జిల్లా వెల్లోడ్‌ సమీపంలోని కనకపురం ప్రాంతానికి చెందిన నటరాజన్‌ (67), ఆయన భార్య కృష్ణవేణి (56) దంపతులు ఈరోడ్‌లో హోటల్‌ నిర్వహిస్తున్నారు. వీరు నామక్కల్‌కు చెందిన 9 మంది బంధువులతో కలిసి చైన్నెలోని ఒక టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఏజెన్సీ ద్వారా నేపాల్‌లోని కాఠ్మండుకు ఆధ్యాత్మిక యాత్ర కోసం వెళ్లారు. వీరు గల్లంతు కావడంతో జాడ కోసం వీరి కుమారుడు కవిరాజ్‌ ఈరోడ్‌ నుంచి బెంగళూరు మీదుగా విమానంలో కాఠ్మండు చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఆర్మీ క్యాంపులు, మెడికల్‌ క్యాంపులు, తాత్కాలిక పునరావాస కేంద్రాలలో మూడు రోజుల పాటు గాలించినప్పటికీ వారి సమాచారం లభించలేదు. దీంతో ఆయన భారత్‌కు తిరిగొచ్చాడు.

చైన్నెకు చెందిన 49 మంది పరిస్థితి ఏమిటో..?

చైన్నె క్రోమ్‌పేట్‌, రాధా నగర్‌కు చెందిన ’మహాదేవ్‌ కై లాష్‌ యాత్ర’ ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన 49 మంది యాత్రికులుఆధ్యాత్మిక యాత్ర కోసం నేపాల్‌ వెళ్లారు. యాత్ర ముగించుకుని వీరు ఆగస్టు 27న చైన్నెకి తిరిగి రావాల్సి ఉండగా, చైనా–నేపాల్‌ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతయ్యారు. ఈ ఘటనపై ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు మారవేల్‌ విలేకరులతో మాట్లాడుతూ: సంఘటన జరిగిన రోజున తమ యాత్రికుల బృందం చైనా–నేపాల్‌ సరిహద్దులోని ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయం బయట వేచి ఉన్నట్టు, వరదలు రాగానే వారు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాల వైపు పరిగెత్తినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా స్పష్టమైందన్నారు. నేపాల్‌లోని ఆసుపత్రులు, సహాయక క్యాంపులు , పునరావాస కేంద్రాలలో వెతికినప్పటికీ వారి ఆచూకీ లభించలేదన్నారు. ప్రస్తుతం గల్లంతైన వారి గురించిన సమాచారం కేవలం నేపాల్‌ ప్రభుత్వం నుండి మాత్రమే వస్తున్నదని, అయితే, చైనా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని, సరిహద్దు ప్రాంతం కావడంతో, తమిళనాడు ప్రభుత్వం తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా చైనా ప్రభుత్వం నుండి ఈ 49 మంది యాత్రికుల పరిస్థితిపై స్పష్టమైన సమాచారాన్ని రాబట్టాలని విజ్ఞప్తి చేశారు. కాగా, నేపాల్‌లో 219 మంది సురక్షితంగా ఉన్నట్టు సమాచారాలు వచ్చాయని, వారందర్నీ ఇక్కడకు తీసుకొస్తామని మంత్రి రాజ్‌మోహన్‌ తెలిపారు. తాజా సమాచారం మేరకు తమిళనాడు నుంచి నేపాల్‌ వెళ్లిన మొత్తం 319 మందిలో 219 మంది పూర్తి సురక్షితంగా ఉన్నారన్నారు. క్రోమ్‌పేట్‌కు చెందిన 49 మందితో సహా మిగిలిన 100 మంది గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశామన్నారు. గుర్తుతెలియని మృతదేహాల వివరాలను సేకరించి, గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసే పనులు కూడా జరుగుతున్నాయి. కాగా, బాధిత కుటుంబాల నుంచి ఎవరైనా తమ వారి ఆచూకీ కనిపెట్టడం కోసం నేపాల్‌కు వెళ్ల దలిచిన పక్షంలో వారిని అక్కడకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, క్రోంపేటలో ఉన్న బాధిత కుటుంబాలను మంత్రి వెంకటరమణన్‌ పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement