ముగిసిన కొళత్తూరు ఎన్నికల పిటిషన్‌ విచారణ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన కొళత్తూరు ఎన్నికల పిటిషన్‌ విచారణ

Sep 1 2026 1:49 AM | Updated on Sep 1 2026 1:49 AM

● తీర్పు రిజర్వుడ్‌ ● కొత్త పిటిషన్‌కు అవకాశం

సాక్షి, చైన్నె: కొళత్తూరు టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు విజయాన్ని చెల్లనిదిగా ప్రకటించాలని కోరుతూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు విచారణను ముగించింది. తీర్పును రిజర్వుడ్‌లో పెట్టింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో కొళత్తూరు నుంచి టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు గెలిచారు. రెండో స్థానంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ సర్దుకోవాల్సి వచ్చింది. అయితే ఫలితాలపై అనుమానాలు వ్యక్తం కావడంతో, ఎన్నికల నిబంధనల ప్రకారం స్టాలిన్‌ విస్తృత ప్రయత్నాలు చేపట్టారు. ఆయన సమర్పించిన దరఖాస్తు ఆధారంగా 14 ఓటింగ్‌ యంత్రాలు, వీవీప్యాట్‌ యంత్రాలను తనిఖీ గత నెల తనిఖీలు చేశారు. ఈ తనిఖీ ప్రక్రియలో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ ఎం.కే. స్టాలిన్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ధ్రువీకరణ సమయంలో కొన్ని ఓటింగ్‌ యంత్రాలు అకస్మాత్తుగా మోరాయించాయని పిటిషనన్‌లో పేర్కొన్నారు. ఆరు పోలింగ్‌ బూత్‌లలో ఓటింగ్‌ యంత్రాల్లోని డేటాకి, వీవీప్యాట్‌ స్లిప్పులకు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని తెలిపారు. ఈ దృష్ట్యా నియోజకవర్గంలోని అన్ని ఈవీఎంలు, వీవీప్యాట్లను సమగ్రంగా తనిఖీ చేయాలని , వి.ఎస్‌. బాబు ఎన్నికను చెల్లనిదిగా ప్రకటించి, తనను విజేతగా ప్రకటించాలని పిటిషన్‌లో స్టాలిన్‌ కోరారు.

హైకోర్టులో సుదీర్ఘ వాదనలు

ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్‌ అరవింద్‌ ధర్మాధికారి, జస్టిస్‌ జి. అరుల్‌ మురుగన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. స్టాలిన్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ, ‘మే 7న ఫలితాలు వెలువడిన 3 రోజుల్లోనే ఈవీఎంల ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నామని, అయితే ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేయడానికి ఉన్న 45 రోజుల గడువు ముగిసిన తర్వాతే అధికారులు ఈవీఎంలను తనిఖీ చేశారని వివిరంచారు. అందుకే చట్టపరంగా ఈ కేసును దాఖలు చేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ ఆరోపణలు విచారణకు స్వీకరించదగినవి కావు అని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వాదించారు. ఎమ్మెల్యే విజయాన్ని సవాలు చేయడానికి మాత్రమే ఎన్నికల పిటిషన్‌ పరిమితమని, ఒకవేళ ఇలాంటి పిటిషన్లను అనుమతిస్తే భవిష్యత్తులో ఇలాంటి కేసులు కోర్టులలో పోటెత్తుతాయని వివరించారు. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.

కొత్త పిటిషన్‌కు అనుమతి

వాదనల సమయంలో.. 2025లో ఈవీఎంల ధృవీకరణ మార్గదర్శకాల్లో కొన్ని సవరణలు వచ్చినట్లు ఎన్నికల సంఘం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీని ఆధారంగా, ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకుని, సవరించిన నిబంధనల ప్రకారం కొత్త పిటిషన్‌ దాఖలు చేయడానికి అనుమతించాలని స్టాలిన్‌ తరఫు న్యాయవాదులు కోరారు. దీనికి ధర్మాసనం అంగీకరిస్తూ, కేసు ఉపసంహరణకు అనుమతి ఇవ్వడమే కాకుండా, తుది ఉత్తర్వులు , తీర్పును రిజర్వుడ్‌లో పెట్టారు. తదుపరి విచారణను తేదీ ప్రకటించకుండా వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement