కోవైలో డిజిటల్ ఫైనాన్స్ సెంటర్
తిరుచ్చిలో మల్టీ మోడల్
లాజిస్టిక్స్ హబ్
తూత్తుకుడిలో కొత్త థర్మల్
పవర్ ప్లాంట్
అసెంబ్లీలో సీఎం విజయ్
ప్రకటన
పాల సేకరణ ధర మళ్లీ పెంపు
అసెంబ్లీ సమావేశాలలో సోమవారం సీఎం విజయ్ శాసనసభ నిబంధన 110 మేరకు ప్రత్యేక ప్రకటనలు చేశారు. కాంచీపురం జిల్లాలో సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ పార్క్, కోయంబత్తూరులో డిజిటల్ ఫైనాన్స్ సెంటర్, తిరుచ్చిలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సీఎం విజయ్
సాక్షి, చైన్నె: భారీ పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు అసెంబ్లీలో సీఎం విజయ్ తెలిపారు. తమిళనాడుకు సెమీకండక్టర్ రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, ఈ విభాగంలో రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచేందుకు కాంచీపురం జిల్లా, మధురమంగళంలో రూ.,175 కోట్ల అంచనా వ్యయంతో సిప్‌కాట్ సంస్థ ద్వారా ’సెమీకండక్టర్ – ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ పార్క్‌లో సెమీకండక్టర్ రంగంలో కొత్త పరిశ్రమల స్థాపనకు వీలుగా అంతర్జాతీయ స్థాయి పరిశోధన ,అభివృద్ధి సౌకర్యాలను కల్పిస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ రంగంలో సుమారు రూ.2,000 కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, 5,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
కోయంబత్తూరులో డిజిటల్ ఫైనాన్స్ సెంటర్
ఫిన్‌టెక్ ఆవిష్కరణలతో డిజిటల్ ఆర్థిక సేవలను పెంపొందించే లక్ష్యంతో, తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ద్వారా కోయంబత్తూరులో డిజిటల్ ఫైనాన్స్ సెంటర్ ను పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంలో రూ.400 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, ఆఫీస్ స్పేస్‌లు, స్టార్టప్‌లు, అత్యాధునిక ల్యాబ్‌లు, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి ఇందులో ప్రాధాన్యతగా సమకూర్చనున్నామని వివరించారు. దీని ద్వారా కోయంబత్తూరు జిల్లాలో ఆర్థిక, ఆర్థిక సాంకేతిక రంగాలలో గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం, నాణ్యమైన ఉద్యోగావకాశాలను సృష్టించడం జరుగుతుందని వివరించారు.
తిరుచ్చిలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్
2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో తమిళనాడులోని ప్రముఖ ప్రాంతాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌లు, డ్రై పోర్ట్‌ల ఏర్పాటు ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఇప్పటికే ప్రకటించామని సీఎం విజయ్ గుర్తు చేశారు. ఇందులో భాగంగా, తమిళనాడు చిత్ర పటంలో మధ్యభాగంలో ఉన్న తిరుచ్చి, పరిసర జిల్లాల్లో అనేక ముఖ్యమైన ఉత్పాదక పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమలు విస్తరించి ఉన్నాయని వివరించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని, టిడ్కో సంస్థ ద్వారా సమగ్ర అధ్యయనం నిర్వహించి, ప్రాజెక్ట్ రిపోర్టు ఆధారంగా తిరుచ్చి రీజియన్‌లో ‘మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్ చేయనున్నామని సీఎం విజయ్ స్పష్టం చేశారు.
ఆవిన్ పాల సేకరణ ధర లీటరుకు పెంపు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాల ఉత్పత్తిదారుల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, ఆగస్టు 19వ తేదీన పాల సేకరణ ధరను లీటరుకు రూ. 38 నుంచి రూ. 41కి పెంచిన విషయం తెలిసిందే. అయితే పాడి ఆవులకు అవసరమైన పచ్చి మేత, ఎండు మేత, తవుడు, పిండి తదితర ముడిసరుకుల ధరలు భారీగా పెరిగినందున, సేకరణ ధరను మరింత పెంచాలని పలు సహకార పాల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. పాడి రైతుల అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం, లీటరు పాల సేకరణ ధరను మరో రూ. 3 పెంచి రూ. 44కు పెంచాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రకటించారు. సేకరణ ధర పెంపు వలన ప్రభుత్వానికి, ఆవిన్‌కు నెలకు రూ. 60 కోట్లు, సంవత్సరానికి రూ. 720 కోట్ల అదనపు వ్యయం భారం కానున్నట్టు వివరించారు. ప్రభుత్వ నిధులు: ఈ ధర పెంపు వల్ల ఏర్పడే అదనపు భారాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్న 3,16,000 మందికి పైగా పాల ఉత్పత్తిదారులకు ఈ నిర్ణయం త్లో ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనున్నదని తెలిపారు.
కాంచీపురంలో
సెమీకండక్టర్ తయారీ పార్క్
రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు, మౌలిక సదుపాయాల ఆధునీకరణకు రూ. 55,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను అసెంబ్లీలొఓ సీఎం విజయ్ ప్రకటించారు. ఈమేరకు తూత్తుకుడిలో 1,600 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్, తూత్తుకుడి థర్మల్ పవర్ స్టేషన్‌లో 1979 నుండి సేవలందిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇందులో పాతబడిన 210 మెగావాట్ల చొప్పున అందించే (మొత్తం 1,050 ) ఐదు యూనిట్లను దశలవారీగా తొలగించనున్నామని తెలిపారు. వీటి స్థానంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ. 20,800 కోట్ల అంచనా వ్యయంతో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యంతో రెండు కొత్త యూనిట్లను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు.
పునరుత్పాదక ఇంధన వనరులు (సౌర, పవన విద్యుత్) అందుబాటులో లేని రాత్రి సమయాల్లో , గరిష్ట డిమాండ్ వేళల్లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఈ ఆధునిక సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ ఉపయోగపడనుదన్నారు. అలాగే రూ. 33,066 కోట్లతో తమిళనాడు ట్రాన్స్‌మిషన్ ఇంప్రూవ్ మెంట్ స్కీమ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి చైన్నె వంటి ప్రధాన వినియోగ నగరాలకు విద్యుత్‌ను సమర్థవంతంగా ప్రసారం చేయడానికి కొత్త పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు కింద 196 కొత్త సబ్‌స్టేషన్లు, 15,000 కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణం చేపట్టనున్నామని వివరించారు. చైన్నె పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ రూ. 1,762 కోట్లతో చేపట్టనున్నామన్నారు. చైన్నెలో వర్షాకాలంలో వరదల వల్ల కలిగే విద్యుత్ అంతరాయాలు, వేసవిలో డిమాండ్ పెరగడం వంటి సమస్యల పరిస్కారానికి పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయనున్నామన్నారు. ఇందులో భాగంగా 36 కొత్త (33/11) సబ్‌స్టేషన్ల నిర్మాణం, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుతో పాటు పాతబడిన కేబుళ్లు, పిల్లర్ బాక్సులు, సర్క్యూట్ బ్రేకర్ల స్థానంలో కొత్తవి అమర్చడానికి రూ.1,762 కోట్లు కేటాయించామని తెలిపారు.


