అభివృద్ధి చెందుతున్న దేశాలను అన్యాయంగా నిందిస్తున్నారు
అణు శక్తి ఉత్పత్తి దిశగా భారత్ ముందడుగు
పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది
పర్యావరణం, వాతావరణంపై సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశాలు భారత్ కంటే ఆరు రెట్లు ఎక్కువ తలసరి కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని, అయినప్పటికీ వాతావరణ మార్పుల దుష్పరిణామాలకు గాను అభివృద్ధి చెందుతున్న దేశాలను అన్యాయంగా నిందిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. పర్యావరణం, వాతావరణంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అణు శక్తి ఉత్పత్తి దిశగా భారత్ వేగంగా ముందుకు సాగుతోందని మోదీ చెప్పారు. అయితే, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడే కొందరు వ్యక్తులు ప్రభుత్వ అణు కార్యక్రమాలను అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేస్తున్నారని, స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థలను వ్యతిరేకిస్తున్నారని తప్పుపట్టారు. కర్బన ఉద్గారాలకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న దేశాలపై నిందలు వేయడం సరైంది కాదన్నారు.
వాస్తవానికి తలసరి కర్బన ఉద్గారాల విషయంలో భారత్ వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగానే ఉందని వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలు అధికంగా కర్బన ఉద్గారాలకు, తద్వారా పర్యావరణ మార్పులకు కారణమవుతున్నాయని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ప్రపంచమంతటా గట్టిగా చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
‘అణుశక్తి’ పనులను అడ్డుకోవద్దు
భారతదేశం ప్రపంచంలోని ఇతర దేశాలతో కలిసి పనిచేస్తోందని, పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని ప్రధాని వివరించారు. భారతదేశ అభివృద్ధి వేగవంతమైనది, సుస్థిరమైనది అని వ్యాఖ్యానించారు. పునరుత్పాదక ఇంధనంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, నిర్ణీత గడువు కంటే ముందే పారిస్(కాప్–21) ఒప్పందాల ప్రకారం తన బాధ్యతలను నెరవేర్చిన ఏకైక జీ20 దేశం భారత్ అని పేర్కొన్నారు. నవ భారతం శక్తి ఇదేనని అన్నారు. శిలాజేతర ఇంధనాలు, సౌరశక్తి సామర్థ్యం, కర్బన ఉద్గారాల నియంత్రణ వంటి కీలక అంశాల్లో భారతదేశ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెలియజేశారు.
గత 12 ఏళ్లలో ఇండియాలో పవన విద్యుత్ సామర్థ్యం మూడు రెట్లు పెరిగిందని, జల విద్యుత్ సామర్థ్యంలోనూ గణనీయమైన వృద్ధి నమోదైందని, ప్రస్తుతం అణు విద్యుత్ ఉత్పత్తి దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని మోదీ స్పష్టంచేశారు. అణుశక్తికి సంబంధించిన పనులను ముందుకు తీసుకెళ్తున్నామని, వీటిని దయచేసి ఎవరూ అడ్డుకోవద్దని కోరారు. అణుశక్తి రంగంలోకి ప్రైవేట్ సంస్థలను తీసుకొస్తున్నట్లు చెప్పారు. తమ ప్రయత్నాల ఫలితంగా భారతదేశపు శిలాజేతర ఇంధన సామర్థ్యం 400 శాతం పెరిగిందని హర్షం వ్యక్తంచేశారు.
160 గిగావాట్ల సౌరశక్తి సామర్థ్యం
గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ, ప్రతి విభాగంలోనూ భారత్ అసాధారణ పురోగతిని సాధించిందని ప్రధాని వివరించారు. 12 ఏళ్ల క్రితం దేశంలో సౌరశక్తి సామర్థ్యం కేవలం 2 గిగావాట్లు ఉండేదని, నేడు అది 160 గిగావాట్లను దాటిందని గుర్తుచేశారు. ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ ద్వారా ఇళ్లను సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాలుగా మార్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఈ పథకం కింద 50 లక్షలకు పైగా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇది అనేక దేశాల్లోని మొత్తం ఇళ్ల సంఖ్య కంటే ఎక్కువ అని పేర్కొన్నారు.
2014కు ముందు దేశంలో ఏటా 3,000 ఎల్రక్టానిక్–వాహనాలు(ఈవీ) మాత్రమే అమ్ముడయ్యేవని వెల్లడించారు. గత ఏడాది 25 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయని, ఇది నమ్మశక్యంకాని వృద్ధి అని ఉద్ఘాటించారు. ఇది మన పర్యావరణానికి మేలు చేస్తోందన్నారు. ఫాస్ట్‌ట్యాగ్‌ల వల్ల టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం, ఇంధన వృథా గణనీయంగా తగ్గాయని ప్రధాని తేల్చిచెప్పారు. పర్యావరణానికి ప్లాస్టిక్ వ్యర్థాలు ఒక ప్రధాన సవాలుగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే సింగిల్–యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించినట్లు చెప్పారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకల్’ అనే విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.


