breaking news
Ashok Vikhe Patil
-
స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన విఖే పాటిల్ కుమార్తె
ముంబై: మహారాష్ట్రలో ప్రముఖ విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కుమార్తె నీలా విఖే పాటిల్ గత వారం జరిగిన స్వీడన్ పార్లమెంట్ ఎన్నికల్లో స్టాక్‌హోమ్ సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఆ దేశ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ‘‘349 మంది సభ్యులున్న పార్లమెంట్‌కు ఎన్నికవ్వడం సంతోషంగాఉంది. తమ కష్టాలను చెప్పుకోలేకపోయిన వాళ్లకు గొంతుక అవుతా. ప్రతి చిన్నారికి మంచి భవిష్యత్తు ఉండేలా మెరుగైన సమాజం కోసం కృషిచేస్తా’’అని నీల తెలిపారు. 41 ఏళ్ల నీలా పాటిల్ ఆసియాలోనే మొట్టమొదటి సహకార చక్కెర ఫ్యాక్టరీని స్థాపించిన విఠల్‌రావ్ విఖే పాటిల్ మునిమనవరాలు. నీలా తాత బాలాసాహెబ్ విఖే పాటిల్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ‘‘మా తాత గర్వపడేలా ఎంపీగా పనిచేస్తా. టీనేజర్‌గా ఉన్నప్పుడు తాత నాతో రాష్ట్ర బడ్జెట్ చదివించారు’’అని నీల గుర్తుచేసుకున్నారు. నీల గతంలో నాటి ప్రధానమంత్రి స్టీఫన్ లోవెన్ హయాంలో ప్రధాని కార్యాలయంలో ఆర్థికం, పన్నులు, గృహాలకు సంబంధించి రాజకీయ సలహాదారుగా సేవలందించారు. నీల గతంలో స్టాక్‌హోమ్ మున్సిపల్ కార్పొరేషన్ సిటీ కౌన్సిల్లో సభ్యురాలిగా ఉన్నారు. స్వీడన్లో పుట్టిన నీల చిన్నతనంలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో పెరిగారు. నీల పెదనాన్న రాధాకృష్ణ విఖే పాటిల్ ప్రస్తుతం మహారాష్ట్రలో మంత్రిగా కొనసాగుతున్నారు. గోథన్బర్గ్ బిజినెస్ స్కూల్లో ఈమె ఎంబీఏ చేశారు. మాడ్రిడ్‌లోనూ విద్యనభ్యసించారు. స్వీడన్‌లోని విపక్ష గ్రీన్పారీ్టలో గత పాతికేళ్లుగా నీల క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. -
జవాన్ల కుమార్తెలకు రెండు శాతం సీట్లు
ముంబై: రక్షణ రంగంలో పనిచేస్తున్న జవాన్ల కుమార్తెల కోసం తమ విద్యాసంస్థల్లో రెండు శాతం సీట్లు కేటాయించినట్లు రాష్ట్రంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ప్రవరా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ ట్రస్ట్ చైర్మన్ అశోక్ విఖే పాటిల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మన దేశ రక్షణకు అహర్నిశలు కృషిచేస్తున్న జవాన్లకు కృతజ్ఞతాభావంగా తమ విద్యాసంస్థల్లో రెండు శాతం సీట్లను కేటాయించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. తన తండ్రి, పార్లమెంట్ డిఫెన్స్ కమిటీకి ఐదేళ్లపాటు చైర్మన్‌గా పనిచేసిన మాజీ కేంద్ర మంత్రి బాలాసాహెబ్ విఖే పాటిల్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల స్థాయినుంచి ప్రొఫషనల్ కోర్సుల వరకు సుమారు 125 సంస్థలు నడుస్తున్నాయని, వాటిలో సుమారు 40 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అశోక్ తెలిపారు. కాగా, మాజీ ఎయిర్‌చీఫ్ పీవీ నాయక్ ఆధ్వర్యంలో ఆర్మీకి సంబంధించి అడ్మిషన్లు చేపడతామని తెలిపారు. తమ విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందిన బాలికలకు విద్యాభ్యాసానికి, హాస్టల్‌కు సంబంధించి ఎటువంటి రుసుం తీసుకోబోమని, అన్ని సౌకర్యాలు ఉచితంగా అందజేస్తామని స్పష్టం చేశారు.


