మాస్కో: రష్యాలో ఎన్నికలు జరుగుతున్నవేళ ఉక్రెయిన్ రెచ్చిపోయింది. రాజధాని మాస్కోతో పాటు ఇతర చుట్టుప్రక్కల ప్రాంతాలే టార్గెట్‌గా విరుచుకపడింది. 1600 డ్రోన్లతో ఏకకాలంతో దాడి చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు రష్యాపౌరులు మరణించగా ఒక ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం దెబ్బతింది. ఈ దాడిపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ఇటీవల రష్యా- ఉక్రెయిన్ దాడులు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. రష్యా మౌలిక సదుపాయాలే లక్షంగా ఉక్రెయిన్ దాడులకు తెగబడుతుంది. రష్యా సైతం పెద్దఎత్తున ప్రతి దాడులు జరుపుతుంది. ఈ దాడుల వల్ల పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరోసారి ఉక్రెయిన్ రష్యాపై పెద్దఎత్తున డ్రోన్ దాడులు చేసింది.
ఈ విషయమై రష్యా మేయర్ మాట్లాడుతూ.. 1,600కు పైగా డ్రోన్లను అడ్డుకుని కూల్చివేసాం. ఇందులో 450 డ్రోన్లు మాస్కోను లక్ష్యంగా చేసుకుని వచ్చాయి. రెండు వేర్వేరు దాడుల్లో 44 ఏళ్ల మహిళ, ఒక వృద్ధుడు మరణించినట్లు తెలిపారు. 21 అంతస్తుల భవనంపై డ్రోన్ కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 400 మందిని భవనం నుంచి ఖాళీ చేయించాల్సి వచ్చింది." అని ఆయన అన్నారు.
రష్యాలో జరుగుతున్న ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. "ఎన్నికలను భంగపరచాలనే ఉద్దేశంతోనే ఈ దాడిని స్పష్టంగా ప్రణాళిక చేశారు. అయితే శత్రువు అందులో విజయవంతం కాలేదు” అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు
మరోవైపు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ దాడులను ప్రశంసించారు. “గత రాత్రి మాస్కో ప్రాంతంలో మా సుదూర దాడులు చాలా ప్రభావాన్ని చూపించాయి. రష్యా చమురు పరిశ్రమలోని కీలక సదుపాయాల్లో ఒకదానితో పాటు లాజిస్టిక్స్‌కు సంబంధించిన సదుపాయం కూడా దెబ్బతింది. ఇవి యుద్ధ యంత్రాంగాన్ని కొనసాగించేందుకు ఉపయోగపడే బిలియన్ల డాలర్ల నిధులు” అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌లో రాత్రిపూట రష్యా జరిపిన దాడుల్లో కీవ్ ప్రాంతంలో కనీసం నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్‌లు ఒకరిపై ఒకరు సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణి దాడులను మరింత తీవ్రతరం చేస్తున్న సమయంలో ఈ తాజా దాడులు చోటుచేసుకున్నాయి.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాపై జరిగిన అతిపెద్ద ఒక్కరోజు దాడుల్లో ఇది ఒకటని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భారీ స్థాయి దాడి రష్యా ఎన్నికల చివరి రోజునే జరగడం యాదృచ్ఛికం కాదని అంటున్నారు. కాగా ఉక్రెయిన్ దాడులతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. రష్యా భారీ స్థాయిలో ప్రతిదాడులు చేసే అవకాశం ఉంది.


