ఢిల్లీలో దారుణం
న్యూఢిల్లీ: రాత్రి 11 గంటల సమయంలో స్టేషనరీ వస్తువులు కొనేందుకు బయటికొచ్చిన 11 ఏళ్ల అమ్మాయిని 56 ఏళ్ల టైలర్ మక్సూద్ రేప్‌చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 16వ తేదీన సదర్ బజార్ ప్రాంతంలో జరిగిన ఈ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక గత బుధవారం రాత్రి బయటికొస్తుంటే వెళ్లొద్దని తల్లి వారించింది. సమీపంలోని బంధువుల దుకాణానికే వెళ్లొస్తానని చెప్పి బయల్దేరింది. అయితే మార్గమధ్యంలో మక్సూద్ అమ్మాయిని గమనించి మాయమాటలు చెప్పి టైలర్ షాప్‌కు తీసుకెళ్లి కుర్చీకి కట్టేసి నోట్లో ఒక వస్త్రం కుక్కి అరుపులు వినపడకుండా చేశాడు.
అరిస్తే పొడిచి చంపేస్తానని కత్తెరతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యలో బయటకు వచ్చినప్పుడు ఇతనికి అమ్మాయి తల్లి తారసపడింది. మా అమ్మాయిని చూశారా? అని అడిగితే లేదు అని బుకాయించాడు. తర్వాత భయపడిపోయి వెంటనే అమ్మాయిని దుకాణం నుంచి బయటకు గెంటేశాడు. ఇది చూసిన పొరుగువ్యక్తి ముజామిల్ ఖురేషి వెంటనే తల్లికి సమాచారం ఇచ్చాడు. ఇంటికెళ్లిన అమ్మాయి తనకు జరిగిన ఘోరం చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అదే రాత్రి మక్సూద్‌ను అరెస్ట్‌చేసి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా జైలుకు తరలించారు. నార్త్ డిస్ట్రిక్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేసి దర్యాప్తు ఆరంభించారు.


