సుప్రీంను ఆశ్రయించిన ఎన్‌హెచ్‌ఏఐ
విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తామన్న సీజేఐ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రహదారుల వెంబడి సంచరించే వీధి పశువులకు షెల్టర్లు నిర్మించాలన్న ఆదేశాలపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆశ్రయాల నిర్మాణం వల్ల తమపై రూ.7 వేల కోట్ల భారీ ఆర్థిక భారం పడుతుందని, ఈ బాధ్యతను స్థానిక, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలే చేపట్టాలని కోరింది. జాతీయ రహదారులపైకి వీధి పశువులు, జంతువులు ప్రవేశించి, రాకపోకలకు ఆటంకం కలిగించకుండా దేశవ్యాప్తంగా పశువుల షెల్టర్లు నిర్మించాలని మే 19వ తేదీన జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఎన్‌హెచ్‌ఏఐను ఆదేశించింది.
ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సంస్థ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. పశువుల షెల్టర్ల నిర్మాణ బాధ్యతను స్థానిక, జిల్లా యంత్రాంగాలే తీసుకోవాలని ఆయన అన్నారు. ఇది తమకు ఉద్దేశించిన ప్రత్యేక బాధ్యత కాదని పేర్కొన్నారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎన్‌హెచ్‌ఏఐ ఒక్కటే ఈ బాధ్యతను తీసుకోలేదన్నారు. వీధి కుక్కలు, పశువుల నిర్వహణ, ప్రభుత్వ అధికారుల బాధ్యతలపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విస్తృత విచారణల సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.
రహదారిపైకి జంతువులు రాకుండా చూడటం, వాటి యజమానులకు జరిమానాలు విధించడం, వాటికి షెల్టర్లు ఏర్పాటు చేయడం వంటివి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకే వస్తాయని కోర్టుకు విన్నవించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం–1988, కంట్రోల్ ఆఫ్ నేషనల్ హైవేస్ (ల్యాండ్ అండ్ ట్రాఫిక్) చట్టం–2002ల ప్రకారం తమ చట్టబద్ధమైన అధికార పరిధి, ప్రాథమిక బాధ్యత కేవలం జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ, యాజమాన్యం, ట్రాఫిక్ సంబంధిత విధులను నియంత్రించడానికే పరిమితమని వివరించారు. తమ పిటిషన్‌పై విచారణకు జస్టిస్ విక్రమ్ నాథ్ సారథ్యంలో ప్రత్యేక ధర్మాసనాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు సానుకూలత వ్యక్తం చేసిన జస్టిస్ సూర్యకాంత్ ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.


