సాక్షి, న్యూఢిల్లీ: హత్యాయత్నం నేరానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ 307 వర్తించాలంటే బాధితుడికి అయిన గాయం తప్పనిసరిగా తీవ్రంగా ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గాయం సాధారణమైనదైనా, తీవ్రంగా ఉన్నదైనా.. నిందితుడికి బాధితుడిని చంపాలనే ఉద్దేశం, తన చర్య వల్ల మరణం సంభవించే అవకాశం ఉందనే అవగాహన ఉన్నట్లు నిర్ధారణ కావడమే అత్యంత కీలకమని పేర్కొంది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. విచారణ పురోగతిలో ఉండగా నిందితులపై సెక్షన్ 307ను చేర్చాలని హరియాణాకు చెందిన బాధితుడి సోదరుడు సురేందర్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
ఆ తర్వాత తొలగించారు
పిటిషనర్ సురేందర్ కుమార్ వాదన ప్రకారం.. తొలుత పోలీసులు సెక్షన్ 307 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే నిందితుల అభ్యర్థన మేరకు మెడికల్ బోర్డు బాధితుడిని పరీక్షించిన అనంతరం సెక్షన్ 307ను తొలగించారు. అనంతరం అభియోగాలను మార్చి సెక్షన్ 307ను తిరిగి చేర్చాలని పిటిషనర్ కోరారు. ఈ అభ్యర్థనను మేజి్రస్టేట్ తిరస్కరించడంతో సెషన్స్ కోర్టును, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ట్రయల్ కోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించగా సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్ దాఖలు చేశారు.
సెక్షన్ 307 వర్తించదు
దాడి కారణంగా బాధితుడికి అయిన గాయం మరణానికి దారితీసేంత తీవ్రంగా ఉందని, అందువల్ల సెక్షన్ 307ను వర్తింపజేయాలన్న పిటిషనర్ వాదనకు ధర్మాసనం నిరాకరించింది. గాయం తీవ్రంగా ఉందన్న కారణంతో మాత్రమే హత్యాయత్నం నేరాన్ని నిర్ధారించలేమని స్పష్టం చేసింది. గాయం ఉండటం సెక్షన్ 307కు తప్పనిసరి అంశం కాదని.. గాయం సాధారణమైనదైనా, తీవ్రమైనదైనా, అందుకు దారితీసిన చర్యలో బాధితుడిని చంపాలనే ఉద్దేశం లేదా ఆ చర్య వల్ల మరణం సంభవించే అవకాశం ఉందనే విషయం అతడికి తెలిసి ఉండాలని ధర్మాసనం వివరించింది.
2009 నాటి తీర్పు ఇదే..
‘సెక్షన్ 307 కింద హత్యాయత్నం నేరాన్ని నిర్ధారించడానికి చంపాలనే ఉద్దేశం ఉండి, ఆ దిశగా కొంత ప్రత్యక్ష చర్య జరిగితే సరిపోతుంది. మరణానికి దారితీసే శారీరక గాయం ఉండాల్సిన అవసరం లేదు. కనీసం సాధారణ గాయం కూడా తప్పనిసరి కాదు’అని 2009లో ‘స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ కాశీరామ్ తదితరులు’కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. ఈ కేసులో ప్రారంభ దశలోనే నిందితుడికి హత్య ఉద్దేశం ఉందని లేదా తన చర్య వల్ల మరణం సంభవిస్తుందని తెలిసి ఉందనే అంశాన్ని పిటిషనర్ ప్రస్తావించలేదని ధర్మాసనం పేర్కొంది. దర్యాప్తులోనూ అలాంటి అంశాలు వెలుగులోకి రాలేదని తెలిపింది. విచారణ ప్రారంభమై సాక్ష్యాలు నమోదు చేస్తున్న దశలో కూడా ఈ అంశాన్ని లేవనెత్త లేదని వివరించింది. తదుపరి దశలో కొత్తగా అలాంటి కారణాలను చూపుతూ సెక్షన్ 307ను చేర్చాలని కోరడం సమర్థనీయం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పులను సమరి్థస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.


