breaking news
section 307
-
గాయాల తీవ్రతే ప్రామాణికం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: హత్యాయత్నం నేరానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ 307 వర్తించాలంటే బాధితుడికి అయిన గాయం తప్పనిసరిగా తీవ్రంగా ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గాయం సాధారణమైనదైనా, తీవ్రంగా ఉన్నదైనా.. నిందితుడికి బాధితుడిని చంపాలనే ఉద్దేశం, తన చర్య వల్ల మరణం సంభవించే అవకాశం ఉందనే అవగాహన ఉన్నట్లు నిర్ధారణ కావడమే అత్యంత కీలకమని పేర్కొంది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. విచారణ పురోగతిలో ఉండగా నిందితులపై సెక్షన్ 307ను చేర్చాలని హరియాణాకు చెందిన బాధితుడి సోదరుడు సురేందర్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఆ తర్వాత తొలగించారు పిటిషనర్ సురేందర్ కుమార్ వాదన ప్రకారం.. తొలుత పోలీసులు సెక్షన్ 307 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే నిందితుల అభ్యర్థన మేరకు మెడికల్ బోర్డు బాధితుడిని పరీక్షించిన అనంతరం సెక్షన్ 307ను తొలగించారు. అనంతరం అభియోగాలను మార్చి సెక్షన్ 307ను తిరిగి చేర్చాలని పిటిషనర్ కోరారు. ఈ అభ్యర్థనను మేజి్రస్టేట్ తిరస్కరించడంతో సెషన్స్ కోర్టును, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ట్రయల్ కోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించగా సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 307 వర్తించదు దాడి కారణంగా బాధితుడికి అయిన గాయం మరణానికి దారితీసేంత తీవ్రంగా ఉందని, అందువల్ల సెక్షన్ 307ను వర్తింపజేయాలన్న పిటిషనర్ వాదనకు ధర్మాసనం నిరాకరించింది. గాయం తీవ్రంగా ఉందన్న కారణంతో మాత్రమే హత్యాయత్నం నేరాన్ని నిర్ధారించలేమని స్పష్టం చేసింది. గాయం ఉండటం సెక్షన్ 307కు తప్పనిసరి అంశం కాదని.. గాయం సాధారణమైనదైనా, తీవ్రమైనదైనా, అందుకు దారితీసిన చర్యలో బాధితుడిని చంపాలనే ఉద్దేశం లేదా ఆ చర్య వల్ల మరణం సంభవించే అవకాశం ఉందనే విషయం అతడికి తెలిసి ఉండాలని ధర్మాసనం వివరించింది.2009 నాటి తీర్పు ఇదే.. ‘సెక్షన్ 307 కింద హత్యాయత్నం నేరాన్ని నిర్ధారించడానికి చంపాలనే ఉద్దేశం ఉండి, ఆ దిశగా కొంత ప్రత్యక్ష చర్య జరిగితే సరిపోతుంది. మరణానికి దారితీసే శారీరక గాయం ఉండాల్సిన అవసరం లేదు. కనీసం సాధారణ గాయం కూడా తప్పనిసరి కాదు’అని 2009లో ‘స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ కాశీరామ్ తదితరులు’కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. ఈ కేసులో ప్రారంభ దశలోనే నిందితుడికి హత్య ఉద్దేశం ఉందని లేదా తన చర్య వల్ల మరణం సంభవిస్తుందని తెలిసి ఉందనే అంశాన్ని పిటిషనర్ ప్రస్తావించలేదని ధర్మాసనం పేర్కొంది. దర్యాప్తులోనూ అలాంటి అంశాలు వెలుగులోకి రాలేదని తెలిపింది. విచారణ ప్రారంభమై సాక్ష్యాలు నమోదు చేస్తున్న దశలో కూడా ఈ అంశాన్ని లేవనెత్త లేదని వివరించింది. తదుపరి దశలో కొత్తగా అలాంటి కారణాలను చూపుతూ సెక్షన్ 307ను చేర్చాలని కోరడం సమర్థనీయం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పులను సమరి్థస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
హతవిధీ.. ఏమిది!
► అధికారానికి అండగా ఖాకీలు ► వివాదాస్పదం అవుతున్న పోలీసు వైఖరి ► తుందుర్రు, తాడేపల్లిగూడెం ప్రాంతం ఏదైనా సెక్షన్ 307 కేసులే ► చట్టపరంగా నిలవకపోయినా వేధింపులే లక్ష్యం సాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికారానికి ఖాకీ చొక్కా తోడైతే.. పరిస్థితి ఎలా ఉంటుందో సామాన్యుడి నుంచి ప్రతిపక్ష నేతల వరకూ అందరికీ అర్థమవుతోంది. ప్రశాంతతకు మారపేరైన ‘పశ్చిమ’లో అధికార పక్షం పోలీస్ రాజ్యం నడుపుతోంది. ఇదేమని ప్రశ్నించినా.. ఎదురు తిరిగినా.. ఖాకీలను అడ్డం పెట్టుకుని బెదిరించడం, అక్రమ కేసులు బనాయించడం ఆనవాయితీగా మారిపోయింది. అధికారపక్ష ప్రజాప్రతినిధులు, నేతలు ప్రజల సమక్షంలోనే పోలీసులపై విరుచుకుపడినా.. అసభ్య పదజాలంతో బూతుపురాణం విప్పి దూషిస్తున్నా కనీసం నోరు మెదపలేని దుస్థితికి ఖాకీ వ్యవస్థ చేరడం చర్చనీయాంశంగా మారింది. తుందుర్రులో అధికార పక్షం అండతో ప్రై వేటు వ్యక్తులు నిర్మిస్తున్న గోదావరి మెగా ఫుడ్‌పార్క్‌ను వ్యతిరేకించిన వారిపై పోలీసుల దమనకాండ ఏ విధంగా సాగిందో అందరికీ విదితమే. తాజాగా ఫ్లెక్సీలు కట్టే విషయంలో తలెత్తిన వివాదాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సాగిస్తున్న హైడ్రామా జిల్లాలో పోలీసు వ్యవస్థను నవ్వుల పాలు చేస్తోంది. తుందుర్రులో అక్వా పార్క్‌ను వ్యతిరేకించిన వారిపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసులు నమోదు చేయడం, ఒక మహిళతో సహా ఏడుగురిని జైలుపాలు చేయడం తెలిసిందే. వారికి కనీసం బెయిల్ కూడా రాకుండా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సుమారు 120 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతోపాటు ఆ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి ప్రజల్ని వేధించడం తెలిసిందే. ‘గూడెం’లో మంత్రి ఒత్తిడితో .. తాడేపల్లిగూడెంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా అధికారానికి దాసోహమైనట్టుగా ఉండటం వివాదాస్పదం అవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగత ద్వారం ఏర్పాటుచేసే విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జనం మధ్యన కొవ్వూరు డీఎస్పీ సమక్షంలో సీఐని అసభ్య పదజాలంతో దూషించడం, ముఖ్యమంత్రితో చెప్పి సస్పెండ్ చేయిస్తానని బెదిరించడం చర్చనీయాంశమైంది. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా పోలీసులు ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. కొట్టు సత్యనారాయణ, మరికొందరిపై హత్యాయత్నం, అక్రమ నిర్బంధం, గాయపర్చడం వంటి ఆరోపణలు చేర్చి సెక్షన్లు 307, 341, 324 కింద కేసులు నమోదు చేశారు. మంత్రి మాణిక్యాలరావు, కొట్టు సత్యనారాయణ వర్గీయులు పోలీసుల సమక్షంలోనే ఘర్షణకు దిగారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. అయితే మంత్రి మాణిక్యాల రావు వత్తిడి మేరకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం సాధ్యం కాని 307 సెక్షన్‌ను మాజీ ఎమ్మెల్యేపై పెట్టారు. మంత్రి వర్గీయులపై మాత్రం స్టేషన్లోనే బెయిల్ ఇచ్చే సెక్షన్ 324 కింద వచ్చే అభియోగాలు మాత్రమే నమోదు చేశారు. ఈ వ్యవహారంపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేయడంతో 307 సెక్షన్‌ను 324గా మార్చి బెయిల్ ఇచ్చారు. ఈ సెక్షన్ కింద బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కోర్టుకు తీసుకువెళ్లి రిమాండ్ విధింపచేసేందుకు ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది. పద్ధతి మారకపోతే ఉద్యమిస్తాం : ఆళ్ల నాని అధికారం చేతిలో ఉంది కదా అని ప్రజలపైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేసే వైఖరి మానుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని హెచ్చరించారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను శనివారం అరెస్ట్ చేయడంపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వైఖరి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రశ్నిస్తే 307 సెక్షన్ కింద కేసులు పెట్టడం జిల్లా పోలీసులకు ఆనవాయితీగా మారుతోందన్నారు. ఈ వైఖరి ప్రజాస్వామ్యంలో మంచిది కాదని, ఇదే పద్ధతి కొనసాగిస్తే తాము ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒక మాజీ ఎమ్మెల్యే విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు బాగాలేదని నాని విమర్శించారు.


