సాక్షి,న్యూఢిల్లీ: అత్యాచారానికి గురై, అత్యంత కిరాతకంగా ప్రాణాలు కోల్పోయిన 17 ఏళ్ల సౌజన్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంతో బాధితురాలి కుటుంబం గత 14 ఏళ్లుగా చేస్తున్నపోరాటానికి ఎట్టకేలకు సుప్రీంకోర్టులో న్యాయం జరగనుంది. తొలుత ఈ కేసు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టినా నిజానిజాలను రాబట్టలేకపోయాయి. అయితే, ఓ దినపత్రికలో వచ్చిన కథనంతో ఈ కేసులో తీగ లాగితే డొంక కదిలింది. ఆ పత్రికా కథనం ఆధారంగా సౌజన్య తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించగా... అత్యున్నత న్యాయస్థానం కేసును రీ-ఇన్వెస్టిగేషన్ (పునర్‌విచారణ) చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటకలోని ధర్మస్థల ప్రాంతంలో (ఉజిరే) దశాబ్దానికి పైగా సంచలనం సృష్టించిన 17 ఏళ్ల విద్యార్థిని సౌజన్య అత్యాచారం మరియు హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుదీర్ఘకాలంగా న్యాయం కోసం పోరాడుతున్న బాధితురాలి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఈ కేసులో తాజా దర్యాప్తునకు సుప్రీంకోర్టు సోమవారం (సెప్టెంబర్ 21) ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ దర్యాప్తు పురోగతికి సంబంధించిన నివేదికను మూడు నెలల్లోగా సమర్పించాలని స్పష్టం చేసింది.
కేసు నేపథ్యం
అక్టోబర్ 2012లో 17 ఏళ్ల సౌజన్యపై అత్యాచారం జరిగి, ఆపై ఆమె హత్యకు గురయ్యారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసుకు సంబంధించి తొలుత కర్ణాటక సీఐడీ దర్యాప్తు చేపట్టింది. కానీ, కేసు కొలిక్కి రాకపోవడంతో సౌజన్య తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అయినప్పటికీ అసలు దోషులు ఎవరనేది మాత్రం తేలలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సంతోష్ రావును సీబీఐ అరెస్టు చేసింది. అయితే, పలుమార్లు జరిగిన విచారణలో తగిన ఆధారాలు లేవని ప్రత్యేక సీబీఐ కోర్టు తేల్చడంతో, 2023 జూన్ 16న అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన తల్లి
ఈ క్రమంలో, గత దర్యాప్తుల్లో లోపాలు ఉన్నాయని, కీలకమైన సాక్ష్యాలను విస్మరించారని బెంగళూరుకు చెందిన ఓ మీడియా సంస్థ కథనం వెలువరించింది. ఆ కథనంలోని అంశాలు, తన కుమార్తెకు న్యాయం కోసం తాను మొదటి నుంచి చేస్తున్న పోరాటంలోని అంశాలతో సరిపోలడంతో.. సౌజన్య తల్లి కుసుమావతి గౌడ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
కర్ణాటక హైకోర్టు గతంలో పిటిషన్‌ను తోసిపుచ్చినప్పటికీ, ఈ కేసులో లోతైన దర్యాప్తు అవసరమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తాజా విచారణలో సీబీఐ దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో సౌజన్య కుటుంబానికి, ప్రజా సంఘాలకు ఎట్టకేలకు న్యాయం జరుగుతుందనే ఆశలు మళ్లీ చిగురించాయి.


