ప్రకృతిని సరుకుగా చూడొద్దు  | Supreme Court driving shift towards ecocentric environmental jurisprudence | Sakshi
Sakshi News home page

ప్రకృతిని సరుకుగా చూడొద్దు 

Sep 21 2026 6:36 AM | Updated on Sep 21 2026 6:36 AM

Supreme Court driving shift towards ecocentric environmental jurisprudence

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న వ్యాఖ్య

న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు దేశ అత్యున్నత న్యాయస్థానం గణనీయమైన కృషి చేస్తున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న చెప్పారు. మానవ కేంద్రీకృత విధానం నుంచి పర్యావరణ కేంద్రీకృత విధానానికి సుప్రీంకోర్టు మారుతోందని ఆమె వ్యాఖ్యానించారు. పర్యావరణ సంబంధిత తీర్పు అనేది ముందుచూపుతో కూడిన ప్రక్రియ అని స్పష్టంచేశారు. భవిష్యత్తుపై సరైన స్పృహతో వర్తమానంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కోర్టులపై ఉందని సూచించారు.

 ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) ఆధ్వర్యంలో ఆదివారం ‘పర్యావరణం, వాతావరణ గతిశీలత భవిష్యత్తు’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో జస్టిస్‌ నాగరత్న ప్రసంగించారు. పర్యావరణ చట్టం అనేది ప్రకృతిని ఆస్తిగా, సరుకుగా లేదా వనరుగా పరిగణించే ధోరణిని విడిచిపెట్టాలని పేర్కొన్నారు. మానవులు ప్రకృతిలో అంతర్భాగమేనని భారతీయ సంప్రదాయాలు ఎప్పటినుంచో చాటిచెబుతున్నాయని గుర్తుచేశారు. 

ప్రకృతికి ఎవరూ అతీతం కాదని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు సహా అనేక న్యాయస్థానాలు పర్యావరణ న్యాయం అనే భావనకు నిర్దిష్టమైన అర్థాన్ని ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించాయని అన్నారు. అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణపై కచ్చితంగా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య, ప్రస్తుత అవసరాలకు, భవిష్యత్‌ ప్రయోజనాలకు మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలని తేల్చిచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement