‘పొగాకు’ సంచులను కొట్టేసిన హెడ్ కానిస్టేబుల్
వయనాడ్: అక్రమార్కుల నుంచి స్వాదీనం చేసుకున్న సరుకును జాగ్రత్తగా భద్రపర్చాల్సిన ఓ పోలీసు కక్కుర్తిపడ్డాడు. పోలీస్‌గా రక్షించాల్సిందిపోయి ఏకంగా దొంగతనం చేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఆ సరుకును కొట్టేశాడు. చివరికి సస్పెన్షన్‌కు గురయ్యాడు. కేరళంలోని వయనాడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. జూన్ 7న సుల్తాన్ బతేరీ సమీపంలోని దొట్టప్పన్‌కుళం వద్ద పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధించిన పొగాకు ఉత్పత్తులను స్వా«దీనం చేసుకున్నారు.
ఇందుకు సంబంధించిన ఏడు పెద్ద సంచుల నిండా పొగాకు ఉత్పత్తులను కోర్టు ఆదేశాల మేరకు సుల్తాన్ బతేరి పోలీస్ స్టేషన్‌లోని ఓ గదిలో భద్రపరిచారు. అదే పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ టి.సబిత్ వీటిపై కన్నేశాడు. రాత్రి ఎవరూ లేని సమయంలో స్టేషన్ రైటర్ డెస్క్ లో ఉన్న తాళం చెవితో ఆ గదిని తెరిచాడు. అందులో పొగాకు ఉత్పత్తులున్న సంచులన్నింటనీ తన కారులో తీసుకెళ్లి వేరే వ్యక్తికి విక్రయించేశాడు.
ఏమీ తెలియనట్టుగా విధులకు హాజరవుతున్నాడు. సెపె్టంబర్ 10వ తేదీన గదిని తనిఖీ చేయగా చోరీ విషయం బయటపడింది. గది తాళం యథా ప్రకారం ఉండటంతో ఇది ఇంటి దొంగల పనేనని అధికారులు అనుమానించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో హెడ్ కానిస్టేబుల్ సబిత్ నిర్వాకం బయటపడింది. సబిత్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. అరెస్ట్‌చేసేలోపే పరారైన అతని కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగి 10 రోజులపాటు వెంటాడి ఎట్టకేలకు ఆదివారం ఎర్నాకులం జిల్లాలో పట్టుకున్నారు.


